ఈ పాట ఎపుడైనా విన్నారా?…

ఇప్పటి తరానికి అంత ఈజీగా కనిపించే పాట, వినిపించే పాట కాదిది.
ఇదే ముప్పై యేళ్ల కిందట ఈ పాట ప్రతిధ్వనించని కాలేజీలు, యూనివర్శిటీలు లేవు తెలుగు నేల మీద. పాటలకు మంత్ర శక్తి ఉంటుంది కదా. అందునా విప్లవ గేయాలు మెదడులో అనేక రసాయన చర్యలు పుట్టిస్తాయి. అలోచింపచేస్తాయి. కార్యోన్మోఖుని చేస్తాయి. ఇలాంటి వశీకరణ శక్తి ఉన్న ఈ పాట 1980 దశకంలో ఎంత మందిని విప్లవోద్యమం వైపు మళ్లించిందో చెప్పలేం.
ఇపుడు సమాజం కుతకుత ఉడుకుతూ ఉంది గాని ఉద్యమాల్లేవు. విప్లవం, ఉద్యమం అంటే డిక్షనరీలో అర్థం వెదుక్కునే మిల్లీనియల్స్ యుగమిది.  ఇపుడు కాలేజీల్లో విశ్వవిద్యాలయాల్లో ఉద్యమాలనేవి కనిపించవు. పాటలసలు వినిపించవు. వినిపిస్తే  ప్రభుత్వాలు నోరుమూయిస్తాయి. ఇలాంటి కాలంలో నుంచి గతంలోకి తొంగి  చూసి ఆ పాటవినవడం టైమ్ మిషన్ లోకి దూరి చరిత్రలోలోకి వెళ్లిపోవడంలా ఉంటుంది. ఈ పాట సినిమాకెక్కింది. అర్థరాత్రిస్వాతంత్య్రం చిత్రంలోని క్లిప్ ఇది. అయినా ఈ పాటొకసారి వినండి.

ఇలాగే పాట మీద  డాక్టర్ ఎస్ రఘు  రాసిన అద్భుతమయిన విశ్లేషణ చదవండి. ఈ విశ్లేషణ kolimi.org నుంచి పునర్ముద్రితం.

వెంటాడే పాట

డాక్టర్ ఎస్ రఘు
విశాఖ సముద్ర హోరుగాలితో పోటీపడుతూ తన పాటలతో విప్లవ జ్వాలను ఆరిపోకుండా కాపాడిన ప్రజా గాయకుడు వంగపండు ప్రసాదరావు. హిందూస్తాన్ షిప్ యార్డ్ లో దినసరి కూలీగా పనిచేస్తూనే ఉత్తరాంధ్ర బతుకుల్లోని వేదనను పాటలుగా మలచి ప్రజలను మేల్కొల్పిన జానపద వైతాళికుడు వంగపండు. 1950లో విజయనగరం జిల్లా పార్వతీపురం మండలం, పెదకొండపల్లి గ్రామంలో జన్మించిన ఈ ప్రజాకవి జీవితం అడుగడుగునా అవరోధాలమయమే. చదువుకున్నది తొమ్మిదోతరగతి వరకేగాని సమాజాన్ని మాత్రం నిశితంగా అధ్యయనం చేసాడు.
“ఉప్పుసముద్రం చుట్టూ ఉండి ఉప్పులేని బతుకులను” గంధపు చెక్కవనాలున్నా గతిలేని బతుకులను, నాగావళి ఉండి నాటులేని బతుకులను ’దగ్గరగా చూసి చలించిపోయిన మనిషి వంగపండు. నెత్తురు కన్నీళ్లతో తడిసి ముద్దయిన నేలలోంచి వంగపండు స్వరం విప్లవ ఆహ్వాన గీతికలను ఆలపించింది. జానపద బాణీలను తన పాటకు ముడివేసి లోకాన్ని జజ్జనకరి జనారే జనకుజనా జనారే అని ఉర్రూతలూగించాడు. ఆ వరుసలో వినిపించే పతాకస్థాయి గీతం ‘ఏం పిల్లడో ఎల్దమొస్తవా ’ నేపథ్యాన్ని తెలుసుకుందాం.
వంగపండు అనగానే ‘ ఏం పిల్లడో ఎల్దమొస్తవా ’ అనే పాట గుర్తుకు వస్తుంది. ఈ పాట రావడం వెనుక ఒక ఉద్వేగభరితమైన విప్లవచరిత్ర దాగి ఉంది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో డార్జిలింగ్ దగ్గరగల నక్సల్ బరి గ్రామం పోరాట ఉద్యమాల ఆవిర్భావ కేంద్రం.1967 లో ఆ గ్రామంలో భూమిలేని నిరుపేద రైతులు తమను వేధిస్తున్న భూస్వాములపై, స్థానికులపై సాయుధులై చేసిన తిరుగుబాటు నక్సలిజం పుట్టుకకు కారణమయింది. దాదాపు అదే సంవత్సరంలో శ్రీకాకుళ గిరిజన పోరాటం ప్రాంరభమైంది. ఇక్కడి రైతులు తమ పొలంలో తామే కూలీలుగా మారిపోవాల్సిన దుస్థితి దాపురించింది. భూస్వాముల అధిక వడ్డీలకు, ఇతర దోపిడీ విధానాలకు బలయిపోయిన అమాయక గిరిజనులు ఒక సంఘంగా ఏర్పడ్డారు. తమ సమస్యల పరిష్కారం కోసం జరుపుకుంటున్న మహాసభను భూస్వాములు అడ్డుకున్నారు. భూస్వాముల కిరాయి గూండాలు కోరన్న, మంగన్నలనే గిరిజన కార్యకర్తలను దారుణంగా కొట్టి చంపేశారు. దానితో గిరిజనులందరు ఆత్మరక్షణ కోసం ఆయుధం చేపట్టారు. అదే విముక్తి ఉద్యమంగా రూపాంతరం చెందింది. 1967 నుండి 1970 వరకు తీవ్రమైన ఉద్యమం ఉవ్వెత్తున కొనసాగింది. సుబ్బారావు పాణిగ్రాహి, వెంపటాపు సత్యంలు ఈ శ్రీకాకుళ ఉద్యమానికి తమ ప్రాణాలను పణంగా పెట్టి పోరాడారు. ఈ ఉద్యమం అనుకున్న లక్ష్యాన్ని సాధించలేకపోయింది. కానీ మరెన్నో ఉద్యమాలకు పురుడుపోసింది. ఉద్యమ కార్యాచరణకు కొత్త ప్రణాళికలను అందించింది. ఈ శ్రీకాకుళ ఉద్యమ స్ఫూర్తితోనే ఉత్తర తెలంగాణలో అనేక సాయుధ పోరాటాలు ఉదయించాయి. ఆనాటి శ్రీకాకుళ ఉద్యమ స్ఫూర్తిని నింపుకుని ఉత్తర తెలంగాణలో వామపక్ష ఉద్యమాలు కొత్త ప౦థాలో కదం తొక్కాయి. వంగపండు ‘ ఏం పిల్లడో ఎల్దమొస్తవా ’ పాటలో విప్లవోద్యమాలకున్న శక్తిని, విస్తృతిని వివరిస్తూ రచించాడు.
‘ ఏం పిల్లడో ఎల్దామొస్తవా
శ్రీకాకుళంలో సీమకొండకి
ఏం పిల్లడో ఎల్దామొస్తవా
అరె చిలుకలు కత్తులు దులపరిస్తయట
సాలూరవతల సవర్లకొండకు
చెమరపిల్లులే శంఖామూదేనటా ’
80వ దశకంలో ఈ పాట వచ్చేనాటికే వంగపండు అనేక ప్రజా సమస్యల మీద వందలాది పాటలు రాశాడు. నిరక్షరాస్యులైన వారికి కూడా అర్ధమయ్యే పద్ధతిలో ‘ జాలరి బాగోతం ’ వరసలో అనేక జానపద బాణీలను కట్టాడు. తనలాగే బతుకు పోరాటం చేస్తున్నవారికోసం ప్రజల భాషలో పదాలను అల్లుకున్నాడు. విరసం, పౌరహక్కుల సంఘం, జన నాట్యమండలి వంటి సంస్థల్లో మమేకమయ్యాడు. కాళ్ళకు గజ్జెకట్టి గద్దర్ తో కలిసి అడుగులు వేసాడు. స్వరం కలిపాడు. పలుకులో పదును పెరిగింది. పాటతో విప్లవ శంఖారావాన్ని మోగించాడు. సీకాకుళం సీమకొండలో దాగిన విప్లవ చైతన్యాన్ని మరోసారి రగుల్కొల్పాడు. ముద్దుగొలిపే ముచ్చటైన చిలుక కత్తుల్ని ఎగురవేసే పోరాట కార్యశీలత ఉందని వర్ణిస్తున్నాడు. ఆ సిక్కోలు కొండలో దాగిన సాహస గుణాల్ని పరిచయం చేస్తున్నాడు. సాలూరు దగ్గరున్న సవర్లకొండలో చెమర పిల్లులు తక్కువేమికాదట. చిన్న అలికిడికే చెదిరిపోయి పొదల్లో దూరే చెమర పిల్లులు విప్లవానికి శంఖమూదాయట. ఆ శంఖధ్వని శత్రువు గుండెల్లో ప్రకంపనాలు పుట్టించే విధంగా పాడుతాడు వంగపండు.
“ ఏం పిల్లడో ఎల్దామొస్తవా
నల్లగొండ నట్టడవిలోనికీ
పాముని పొడిచిన చీమలున్నయట
ఏం పిల్లడో ఎల్దామొస్తవా
తెలంగాణ కొమురయ్య కొండకీ ”
పాట ఒక్కసారిగా శ్రీకాకుళం నుండి తెలంగాణలోకి ప్రవహించింది. నక్సల్బరీ ఉద్యమం పుట్టకముందే తెలంగాణాలో ముఖ్యంగా నల్లగొండ, వరంగల్ జిల్లాలో రైతాంగ సాయుధ పోరాటం ప్రారంభమైంది. బలవంతుడైన నిజాంరాజుని గద్దెదింపే ప్రయత్నం ఉధృతంగా జరిగింది. బలవంతమైన సర్పము చీమల బారినపడి హతమయిన సత్యాన్ని తెలంగాణ సాయుధ పోరాటం నిరూపించింది. ప్రజలు చీమల దండులా ఏకమై అధికార సర్పాన్ని కాటువేసిన ఉదంతాన్ని వివరిస్తున్నాడు. దొడ్డి కొమురయ్య హత్యతో తెలంగాణ సాయుధ పోరాటం ఎంత తీవ్రరూపందాల్చిందో తెలుపుతున్నాడు. వీటన్నిటిని పుణశ్చరన చేసుకోవడం ద్వారా మన పోరాట వారసత్వాన్ని వదులుకోకూడదని హెచ్చరిస్తున్నాడు.
“ ఏం పిల్లడో ఎల్దమొస్తవా
అరె గద్దని తన్నిన చేతులున్నయట
ఆకులు మేసిన మేకల కొండకు
పులుల్ని మింగిన గొర్రెలున్నయట”
కవి ఈ పాటను అతిశయోక్తి అలంకారాలతో నింపినట్టుగా కనిపిస్తుంది. సాధ్యంకాని పనులను, చర్యలను సాధ్యమయ్యేటట్లుగా చెబుతున్నాడని అనిపిస్తుంది. కాని నిజంగా చరిత్రను తరచిచూస్తే ఇవన్నీ సాధ్యమైనవేనని నిరూపితమయింది. ప్రపంచాన్ని శాసించిన నియంతలు, చక్రవర్తులు, ధనమదా౦దులంతా ప్రజాబల౦ ముందు దారుణంగా ఓడిపోయారు. ప్రజలకు ఆ తెగువను, సాహసాన్ని, పోరాటశీలతను అదించే౦ది ఇలాంటి భావజాలాలు, విప్లవ ధోరణులు మాత్రమే. వాటితో పాటు పాట తక్షణ చర్యను ప్రేరేపిస్తుంది. ఈ పాటలోని చరణాలన్నీ మరో రూపంలో సాధ్యమయిన పనులకు, విజయాలకు కవితాత్మక రూపంగా భావించవచ్చు.
“ రాయలసీమ రాలుకొండకీ
రక్తం రాజ్యం ఏలుతుందట
ఏం పిల్లడో ఎల్దమొస్తవా
అరె తూరుపు దిక్కున దోరకొండకీ
అరె తుపాకి పేల్చిన తూనీగలున్నాయట ”
కవి ప్రజాఉద్యమాలకున్న భౌగోళిక విస్తృతిని కూడా ఎరుకపరుస్తున్నాడు. కరువు సీమ రాయల సీమలో దోపిడీకి, అధిపత్యానికి మాత్రం కరువులేదు. నీళ్లజాడ లేకపోయినా రక్తప్రవాహపు చారికలున్న రాజ్యం అది. ఈ పాటలో కవి ఊహలు ఆశ్చర్యానికి గురిచేస్తాయి. ముట్టుకుంటే రాలిపోయే సున్నితమైన లేతరెక్కలున్న తూనీగ తుపాకి పేల్చడం విభ్రా౦తి కలిగిస్తుంది. ఒక్కసారిగా తుపాకిపట్టుకున్న తూనీగ దృశ్యమానమవుతుంది. ఇది నిజం అనిపించేంతగా తదాత్మమ్యాతాలోకి తీసుకెళతాడు కవి. ఇందులో వాస్తవం కూడా ఉంది. భూస్వాముల, దొరల ఏలుబడిలో లేతరెక్కల పసివాళ్లు వెట్టిచాకిరిలో మగ్గిపోయి ఎంతకుమిలిపోయారు. ఎంత కమిలిపోయారు. అవే లేతరెక్కలు ఒక దశలో తుపాకులు పట్టుకున్నాయి కదా! కవి ఊహల లోతుల్లోకి వెళితే వాస్తవికత పునాదులు బయటపడతాయి.
“ ఏం పిల్లడో ఎల్దమొస్తవా
కలకత్తా కొదకారుకొండకీ
ఎలుకలు పిల్లిని ఎంట తగిలెనట ”
కవి వంగపండు విప్లవ ఆవిర్భావ ప్రాంతమైన బెంగాల్ కు వెళ్ళాడు. కొండలు, అడవులు ఉద్యమకారుల కార్యక్షేత్రం. ఆ కొండలు, అడవుల్లో వుండే చిలుకలు, చెమర పిల్లులు, చీమలు, గొర్రెలు, తూనీగలు, ఎలుకలు అన్నీ ఒక్కొక్కరూపం దాల్చిన విప్లవవీరులకు ప్రతీక. ఆ వీరుల గెరిల్లా పోరాట నైపుణ్యాలను, సాహసఘట్టాలను ఆయా ప్రాణులకు ఆపాదిస్తూ మనలో పోరాటపటిమను, విప్లవస్పూర్తిని మండిస్తున్నాడు కవి. ఒక అమరవీరుడిపై స్మృతి కవిత ఉద్యమకారులపై కొండంత ప్రభావాన్ని చూపుతుంది. ఈ పాట ప్రభావం మరింత విస్తృతిని పొదువుకుంది. ఈ పాట నిద్రాణమైన ఉద్యమానికి వైతాళిక గీతంగా వినబడుతుంది. ‘ఏం పిల్లడో ఎల్దమొస్తావా’ అని పదేపదే పిలిచే కవి గొంతు మనల్ని అడవుల్లోకీ లాక్కెళుతుంది. ఈ పాట కొత్త ఉద్యమాల ఆవిర్భావానికి కార్యాచరణ ప్రణాళికను అందిస్తుంది. ఒక జానపదుల పాటలోకి వంగపండు గొప్ప రసాయన శాస్త్రాన్ని సమ్మిళితం చేశాడు. పాటలో ఎన్నో టన్నుల శక్తిని దాచవచ్చనడానికి ఈ పాట ఒక నిదర్శనం.
“ ఏం పిల్లడో ఎల్దమొస్తవా”
– వంగపండు ప్రసాదరావు
(ఏం పిల్లడో ఎల్దామొస్తవా 3
శ్రీకాకుళంలో సీమకొండకి II ఏం పిల్లడో ఎల్దమొస్తవా
అరె చిలకలు కత్తులు దులపరిస్తయట II ఏం పిల్లడో ఎల్దామొస్తవా II
అరె సాలూరవతల సవర్లకొండకు ,, ,,
చెమర పిల్లులే శంఖమూదేనట ,, ,,
నల్లగొండ నట్టడవిలోనికి ,, ,,
పాముని పొడిచిన చీమలున్నయట ,, ,,
తెలంగాణ కొమురయ్యకొండకీ ,, ,,
అరెరరె అరె హహూ హహూహ ,, ,,
అరె గద్దని తన్నిన చేతులున్నయట ,, ,,
ఆకులు మేసిన మేకలకొండకు ,, ,,
పులుల్ని మింగిన గొర్రెలున్నయట ,, ,,
రాయలసీమ రాలుకొండకీ ,, ,,
రక్తం రాజ్యం ఏలుతుందట ,, ,,
అరె తూరుపు ,, ,,
తూరుపు దిక్కున దోర కొండకీ ,, ,,
అరెరరెరరె హహూ హాహూహ ,, ,,
అరె తుపాకీ పేల్చిన తూనీగలున్నయట ,, ,,
కలకత్తా కొద కారుకొండకీ ,, ,,
ఎలుకలు పిల్లిని ఎంటా తగిలెనట II ఏం పిల్లడో ఎల్దామొస్తవా II)