Home Politics కెసిఆర్ ఫెడరల్ ఫ్రంట్ యాత్రల వెనక మర్మం…

కెసిఆర్ ఫెడరల్ ఫ్రంట్ యాత్రల వెనక మర్మం…

111
0
SHARE

(టి.లక్ష్మీనారాయణ*)

“ఫెడరల్ ప్రంట్” పేరుతో, కేసీఆర్ గోడ మీద పిల్లి వాటంతో, తన రాజకీయ స్వప్రయోజనాలే కొలబద్ధగా, రాజకీయ తీర్థ యాత్రను ఎన్నికలకు ముందు ప్రారంభించి, ఐదు దశల పోలింగ్ ముగిసిన తరువాత కొనసాగిస్తున్నారు.

బిజెపి, కాంగ్రెస్ పార్టీలకు వ్యతిరేకమంటూ బిజెపి నేతృత్వంలోని ఎన్.డి.ఏ. కూటమిలోని ప్రాంతీయ పార్టీల నేతలను కలవకుండా కాంగ్రెస్ నాయకత్వంలోని యు.పి.ఏ. భాగస్వామ్య పార్టీల నేతలను, బిజెపికి వ్యతిరేకంగా రాజకీయ ప్రత్యామ్నాయం కోసం కృషి చేస్తున్న పార్టీల నేతలను కలుస్తున్నారు.

బిహార్ ముఖ్యమంత్రి తనకు మంచి మిత్రుడని చెప్పుకొనే కేసీఆర్ ఆయన్ను ఎందుకు కలవలేదు.
ఎఐఎడియంకె కు చెందిన తమిళనాడు ముఖ్యమంత్రి పళనీ స్వామిని ఎందుకు కలవలేదు? బిజెపిపై విమర్శలు గుప్పించిన శివసేన అధినేతతో ఎందుకు కలవలేదు?

వామపక్ష కూటమికి నేతగా ఉన్న కేరళ ముఖ్యమంత్రి విజయన్ ను కలిశారు. సిపిఐ, సిపిఐ(యం) రెండు పార్టీలు తమిళనాడులో డియంకె నాయకత్వంలోని కూటమిలో కాంగ్రెసుతో కలిసి భాగస్వాములుగా ఉన్నారు. ఒడిస్సాలో కాంగ్రెసుతో సీట్ల సర్దుబాట్లు చేసుకొని ఎన్నికల బరిలో ఉన్నారు. ఈ పూర్వరంగంలో బిజెపి, కాంగ్రెస్ వ్యతిరేక ‘ఫెడరల్ ప్రంట్’ ఏర్పాటు నినాదంతో వామపక్ష నేత అయిన కేరళ ముఖ్యమంత్రితో కేసీఆర్ సమావేశం కావడంలోని ఆంతర్యం ఏమిటి?

యు.పి.ఏ. కూటమి ప్రధాన మంత్రి అభ్యర్థి రాహుల్ గాంధీ అని విస్పష్టంగా ప్రకటించిన డి.యం.కె. అధినేత స్టాలిన్ ను కేసీఆర్ కలవడంలోని పరమార్థం ఏమిటి?

కాంగ్రెస్ మద్ధతుతో కర్నాటకలో అధికారంలో ఉన్న జె.డి.(ఎస్) అధినాయకుడు దేవగౌడ, ముఖ్యమంత్రి కుమారస్వామితో ఏ రాజకీయ ప్రయోజనం ఆశించి కేసిఆర్ మనంతనాలు జరుపుతున్నారు? కుమారస్వామి ముఖ్యమంత్రి పదవిని వదులుకొని కేసీఆర్ తో జట్టు కడతారా?

ఒక్కమాటలో చెప్పాలంటే, తనకు మిత్రులుగా భావిస్తున్న జగన్మోహన్ రెడ్డి, అసదుద్ధీన్ ఒవైసీ లకు చెందిన వై.యస్.ఆర్.సి.పి., యం.ఐ.యం.లతో కలుపుకొని 35 స్థానాల్లో గెలవబోతున్నామని చెప్పి “రాజకీయ మార్కెటింగ్” పనిలో కేసీఆర్ నిమగ్నమై ఉన్నారు.

తన కుమారుడు కె.టి.ఆర్.కు తెలంగాణ ప్రభుత్వ పగ్గాలను అప్పగించాలంటే తాను డిల్లీ రాజకీయాల్లోకి వెళ్ళాలి. ఎన్నికల తదనంతరం కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందన్న వాతావరణం స్పష్టంగా కనబడుతున్నది. కాకపోతే, ఆ సంకీర్ణ ప్రభుత్వం బిజెపి లేదా కాంగ్రెస్ నేతృత్వంలోనా, మద్ధతుతోనా అన్నదే తేలాల్సి ఉన్నది. అందుకనే కేసీఆర్ గోడ మీద పిల్లిలా వ్యవహరిస్తూ, పావులు కదుపుతున్నాడు.

ఫలితాల తదనంతరం మోడీ ప్రభుత్వమే కొనసాగే పరిస్థితి ఉత్ఫన్నమైతే మద్ధతు ప్రకటించే వారిలో కేసీఆర్ మొదటి వరుసలో ఉంటారనడంలో ఎలాంటి సందేహం లేదు. తదనుగుణంగా బేరసారాలు చేసుకొంటారు.

బిజెపి యేతర ప్రభుత్వమైతే కాంగ్రెస్ నేతృత్వంలో కాకుండా మరొకరి నాయకత్వంలో, చంద్రబాబు క్రియాశీల పాత్రలేని ప్రభుత్వం ఏర్పడాలన్న లక్ష్యంతో నేడు రాజకీయ తీర్థ యాత్ర చేస్తూ, ఎన్.డి.ఏ. యేతర పార్టీల నేతలను కలుస్తున్నారని పిస్తోంది. అవకాశవాద రాజకీయాలే కేసీఆర్ రాజకీయ తీర్థ యాత్ర పరమార్థమని విస్పష్టంగా కనబడుతున్నది.

(*లక్ష్మినారాయణ తెలుగు నాటప్రముఖ రాజకీయ, సాంఘిక విశ్లేషకుడు)