స్మిత్ ‘రాజస్థాన్ రాయల్స్’ రాత మార్చుతాడా?

(బి. వెంకటేశ్వరమూర్తి)

రాజస్థాన్ రాయల్స్ జట్టు మొట్టమొదటి ఐపిఎల్ ఛాంపియన్ గా ఎప్పటికీ చరిత్రలో మిగిలిపోతుంది. ఇది  బద్దలు చేయడానికి వీల్లేనిది. లెగ్ స్పిన్ లెజెండ్ షేన్ వార్న్ ఐపిఎల్ తొలి ఎడిషన్ లో రాజస్థాన్ రాయల్స్ సారథిగా జట్టును శిఖరాగ్రాన నిలిపాడు. చరిత్ర విషయానికొస్తే, రెండేళ్ల పాటు సస్పెన్షన్ కు గురైన రెండు ఐపిఎల్ జట్లలో రాజస్థాన్ కూడా ఒకటి. 2016, 17 సంవత్సరాలు నిషేధం తర్వాత తిరిగి రంగంలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ ఏకంగా ఛాంపియన్ షిప్ సాధిస్తే, రాజస్థాన్ ప్లే ఆఫ్ స్థాయి దాకా రాగలిగింది.

భారీ కలెక్షన్ లతో కనక వర్షం కురిపించి భారత క్రికెట్ ను ఆర్థిక పరంగా సుసంపన్నం చేయడం ఐపిఎల్ కు ప్రధాన లక్ష్యమైతే, యూత్ టాలెంట్ ని గుర్తించి, భుజం తట్టి ప్రోత్సహించడం మరో ముఖ్య లక్ష్యం. టాలెంట్ ను గుర్తించి ప్రోత్సహించడంలో రాజస్థాన్ రాయల్స్ దే అగ్ర తాంబూలం.

ఇటు రాజస్థాన్ రాయల్స్ స్పాట్ ఫిక్సింగ్ వల్ల రెండేళ్లు సస్పెన్షన్ కు గురై, గతేడాది రంగంలోకి దిగితే, అంతక్రితం ఆ జట్టు కెప్టెన్ స్టీవ్ స్మిత్ బాల్ ట్యాంపరింగ్ కేసులో ఏడాది నిషేధం ముగించుకుని ఈ సంవత్సరం ఐపిఎల్ తోనే పునః ప్రవేశం చేస్తున్నాడు. అతని నిషేధం గడువు ఈ నెల 29కి ముగుస్తుంది. అంటే మొదటి నాలుగైదు మ్యాచ్ ల్లో అతను ఆడే అవకాశం లేదు. మే నెలలో జరగనున్న ప్రపంచ కప్ పోటీల కోసం సంసిద్ధమయ్యేందుకు స్మిత్ కు ఐపిఎల్ టోర్నీయే ఏకైక మ్యాచ్ ప్రాక్టీస్ అవకాశం. అందువల్ల అతను  ఈ టోర్నీలో పూర్తి స్థాయిలో విజృంభించక తప్పదు.

ప్రస్తుతం రాజస్థాన్ కెప్టెన్ అజింక్య రహానేను భారత ప్రపంచ కప్ జట్టులో నంబర్ ఫోర్ బ్యాటింగ్ స్థానం ఊరిస్తున్నది. మిగత క్రికెటర్లతో పోల్చితే రహానేకు తగినన్ని అవకాశాలివ్వకుండానే సెలెక్టర్లు అన్యాయంగా పక్కకు నెట్టారన్న అభిప్రాయం ఉంది. ఆసీస్ తో మొన్న ముగిసిన వన్ డే సిరీస్ లో కోహ్లి సేన మొట్టమొదటి సారిగా పరాజయం పాలవడం, నంబర్ ఫోర్ స్థానంలో రాయుడు ఆశించిన రీతిలో రాణించలేక పోవడంతో రహానే వంటి వారికి తొడగొట్టి సత్తా నిరూపించుకోడానికి ఐపిఎల్ సువర్ణావకాశంగా పరిణమించింది.

రహానే, స్మిత్ లకు తోడుగా ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్ జాస్ బట్లర్, బెన్ స్టోక్స్, తాజా భారత-ఆస్ట్రేలియా వన్ డే సిరీస్ సెన్సేషన్ ఆష్టన్ టర్నర్, ఐపిఎల్ లోభారత స్టార్లు సంజు శాంసన్, రాహుల్ త్రిపాఠీలతో రాజస్థాన్ బ్యాటింగ్ లైనప్ అత్యంత శక్తిమంతంగా ఉన్నది. ఆస్ట్రేలియాతో భారత్ హోమ్ సిరీస్ లో359 పరుగుల భారీ స్కోరును ఛేజ్ చేయడంలో ఆసీస్ తరఫున వీర విధ్వంసక బ్యాటింగ్ ప్రదర్శించిన ఆష్టన్ టర్నర్ కూడా ఈ జట్టులో ఉన్నాడు. అయితే పాకిస్తాన్ తో హోమ్ సిరీస్ లో ఆడవలసి ఉన్నందున మొదటి మూడు పోటీలకు అతను అందుబాటులో ఉండడు.

భారత అండర్ -19 జట్టులో ఆట ద్వారా సుప్రసిద్ధుడైన జయదేవ్ ఉనద్కట్ ను రూ.11.5 కోట్ల భారీ మూల్యం చెల్లించి కొనుగోలు చేసిన రాయల్స్ ఆతని బౌలింగ్ కూడా భారీగా పరుగులివ్వడం వల్ల కాస్ట్ లీగా మారుతున్నప్పటికీ మరో మారు రూ. 8.4 కోట్లు పోసి కొని మళ్లీ అతనిపై విశ్వాసం ఉంచింది. ఉనద్కట్ తో బాటు ఇంగ్లీష్ ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్, విండీస్ స్పీడ్ స్టర్ ఒషానె థామస్,

కర్ణాటక స్పిన్ ద్వయం శ్రేయస్ గోపాల్, కె గౌతమ్ లతో పాటు న్యూజిలాండ్ స్పిన్నర్ ఇష్ సోధి, మహీపాల్ లమ్రోర్ ల స్పిన్ ప్రత్యర్థి బ్యాట్స్ మెన్  ను ఏ మాత్రం ఇబ్బంది పెడుతుందో చూడాలి.

హోం గ్రౌండ్ జై పూర్ లోని సవాయ్ మాన్ సింగ్ స్టేడియంలో ఈ నెల 25న పంజాబ్ కింగ్స్ లెవెన్ తో రాజస్థాన్ తొలి పోటీ ఆడుతుంది.

(బి వెంకటేశ్వర మూర్తి, సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్టు, బెంగుళూరు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *