రాయలసీమలో కాబోయే వైసీపీ రాజులెవరో?

(యనమల నాగిరెడ్డి)
ఇటీవల ముగిసిన ఎన్నికలలో అఖండ విజయం సాధించి ముఖ్యమంత్రిగా  అధికార పీఠం అధిష్టించిన వెంటనే తనదైన శైలిలో పాలన సాగించాలనుకుంటున్న వై. ఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రులుగా ఎవరిని ఎంచుకుంటారో? అని మొత్తం ఎంఎల్ ఏ లతో పాటు అధికారులు, సాధారణ ప్రజలు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ప్రమాణ స్వీకార సమయంలో జగన్ తన  ప్రధాన ఆశయాలుగా చెప్పుకున్న “అవినీతి రహిత ప్రజారంజక పాలన” సాధించడానికి కీలకమైన మంత్రివర్గ నిర్మాణం ఎలా ఉంటుందో? ఈ మంత్రులు ఆయన ఆశయాన్నిఅమలు చేసే విధంగా పని చేస్తారా? లేదా అనే అంశాలపై అందరిలో తీవ్ర ఉత్కంఠత నెలకొనివుంది. ఈ నేపథ్యంలో ఆయన స్వంత జిల్లా తో పాటు అనేక రకాలుగా జగన్ కు కీలకమైన కరువుసీమ నుండి ఎవరు మంత్రులు ఆవుతారో, వారికి ఎలాంటి కీలక శాఖలు లభిస్తాయో నని ఎంఎల్ ఏలు పలురకాల అంచనాలు వేసుకుంటున్నారు.ఉత్కంఠ రేపు వీడే అవకాశం ఉంది.
వర్గపోరుకు, ముఠా తగాదాలకు పేరుపొందిన రాయలసీమలో ఎన్నడూ లేని విధంగా ఈ ఎన్నికలలో 52 అసెంబ్లీ స్థానాలకు 49 స్థానాలలో వైసీపీ అభ్యర్థులను ప్రజలు భారీ మెజారిటీలతో గెలిపించారు. అలాగే 8 ఎంపీ లను కూడా పెద్ద మెజారిటీతో విజయం కట్టపెట్టారు. ఇది రాయలసీమ చరిత్రలోనే ఒక చరిత్రగా మారింది. ఈ నేపథ్యంలో ఈ కరువుసీమ నుండి ఎవరికి మంత్రి పదవి దక్కనుందోనని అందరు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
 రాయలసీమకు చెందిన కడప జిల్లా నుండి ముఖ్యమంత్రి జగన్ స్వయంగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అందువల్ల ఈ జిల్లాకు మొదటి దశలో మరోమంత్రి పదవి దక్కుతుందా? లేదా అన్నది మిలియన్ డాలర్స్ ప్రశ్నగా  మిగిలింది.
జిల్లా నుండి నలుగురు ఎంఎల్ ఏలు మంత్రి పదవులు ఆశిస్తున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి.  ఈ జిల్లాలో సీనియర్ నాయకుడుగా ఉన్న మైదుకూరు ఎంఎల్ఏ గా గెలిచిన రఘురామిరెడ్డి మంత్రి పదవిని ఆశిస్తున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి.
“ఇవి తనకు చివరి ఎన్నికలని, తనకు ఒకసారి మంత్రిగా అవకాశం ఇవ్వడం ధర్మమని” రఘురామిరెడ్డి భావిస్తున్నారనేది సమాచారం. కాగా పార్టీ మారి, ఎన్నికల నిధులు సమకూర్చడంలో కీలక పాత్ర పోషించిన రాజంపేట ఎంఎల్ఏ మేడా మల్లికార్జున రెడ్డి కూడా మంత్రి పదవి ఆశిస్తున్నారని, ఎన్నికల సమయంలో ఆయనకు జగన్ స్వయంగా హామీ ఇచ్చారని, అందువల్ల మేడాకు మంత్రి పదవి ఖాయమని ఆయన అనుచరగణం విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే జగన్ కు సన్నిహితుడుగా ఉండి, మీడియాలో పార్టీ వాణిని
వినిపించి లౌక్యంగా వ్యవరించగలడని గుర్తింపు పొందిన రాయచోటి శాసనసభ్యుడు గడికోట శ్రీకాంత్ రెడ్డి మంత్రి పదవి రేసులో ఉన్నారని, ఆయనకు ఐటి లేదా పురపాలక శాఖ కేటాయించనున్నారని  తీవ్ర ప్రచారం జరుగుతున్నది.
శ్రీకాంత కు రాజంపేట ఎంపీ , జగన్ కు అత్యంత సన్నిహితుడు గా ఉన్న మిథున్ రెడ్డి మద్దతు భారీగా ఉందని, ఎంపీ మద్దతుతో ఆయనకు మంత్రి పదవి దక్కే అవకాశం ఉందని శ్రీకాంత్ అనుచరులు అంటున్నారు.
చివరగా ప్రజలలో మంచివాడిగా గుర్తింపు పొంది, గత దశాబ్ద కాలంగా జగన్ పై పూర్తి విశ్వాసంతో తన పని తానూ చేసుకుంటూ, వివాదరహితుడిగా ఉన్న కడప ఎంఎల్ఏ అంజాద్ బాషాకు మైనారిటీ కోటాలో మంత్రి పదవి దక్కుతుందని కొందరు పార్టీ సీనియర్ నాయకులు అంటున్నారు. జిల్లాలో అంజాద్ బాషా లేదా మేడా మల్లికార్జున రెడ్డి లలో ఒకరికి మంత్రి పదవి దక్కే అవకాశం ఉందని, అది మొదటి దశలో ఉంటుందా? లేక మరోసారి విస్తరణలో జిల్లాకు అవకాశం దక్కుతుందా అనే అంశం పై స్పష్టత లేదు. మంత్రి పదవి ఎవరికీ దక్కినా మిగిలిన ఆశావహులకు కూడా తగిన ప్రాధాన్యత లభించ గలదని పార్టీ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
కర్నూల్ జిల్లా పై పెత్తనం ఎవరికో!
రాయలసీమలో అతి కీలకమైన కర్నూలు జిల్లా నుండి మంత్రి పదవులు ఆశిస్తున్న వారు అధికంగా ఉన్నా ధోన్ నియోజకవర్గం నుండి గెలుపొందిన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మొదటి దశలోనే మంత్రి పదవి దక్కించుకుంటారని తెలుస్తున్నది. ఆయన గత టీడీపీ ప్రభుత్వంలో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ గా పని చేశారు. వివాద రహితుడుగా,సౌమ్యుడుగా పేరు పొందారు. ఆయనకే ఆర్థిక శాఖ దక్కుతుందని పార్టీ వర్గాల అంచనా. ఇక ఈ జిల్లా నిండి గెలుపొందిన కాటసాని రాంభూపాల్ రెడ్డి, రామిరెడ్డి, శిల్పా బ్రదర్స్, శ్రీదేవి, కూడా మంత్రి పదవుల ఆశావహులలో ఉన్నారనేది సమాచారం. అలాగే విద్యాధికుడుగా ఉంది కర్నూల్ పట్టణ నియోజకవర్గం నుండి గెలుపొందిన ముస్లిం మైనారిటీ నాయకుడు అయూబ్ ఖాన్ పేరు కూడా ముఖ్యమంత్రి పరిశీలనలో ఉన్నట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి. కడప నుండి అంజాద్ బాషాకు మంత్రి పదవి దక్కక పొతే కర్నూల్ ఎంఎల్ ఏ బుగ్గనతో పాటు ముందు వరసలో ఉంటారట.  ఈ జిల్లాలో పార్టీ ప్రాభవం కాపాడటంతో పాటు, బలమైన ప్రత్యరులైన కెఇ, కోట్ల వర్గాలను కూడా సమర్థ వంతంగా ఎదుర్కోగల నాయకులకు అవకాశం ఇవ్వాలని జగన్ భావిస్తున్నారనేది సమాచారం.
అనంతపురం జిల్లా పై ఆధిపత్యం ఎవరికీ దక్కేనో
అనంతపూర్ జిల్లాలో జేసీ బ్రదర్స్ ను, పరిటాల ప్రాభవాన్ని దీటుగా ఎదుర్కోవడంతో పాటు, వెనుకపడిన ఈ జిల్లాను అభివృద్ధి పధంలో నడపగల ధీటైన నాయకుడికి మంత్రి పదవి కట్టపెట్టాలని ముఖ్యమంత్రి జగన్ భావిస్తున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి. కులాల కుమ్ములాటలకు, వర్గ పోరుకు ప్రసిద్దిచెందిన ఈ జిల్లాలో అనంతపురం నియోజకవర్గం నుండి గెలుపొందిన అనంత వెంకట్రామిరెడ్డికి మొదటి దశలో మంత్రి పదవి దక్కుతుందని అందరు భావిస్తున్నారు.
 అలాగే గాలి జనార్ధన రెడ్డి మద్దతుతో బిసి కోటా కింద కాపు రామచంద్రారెడ్డికి అవకాశం ఉందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
కాగా గత రెండు దశాబ్దాలుగా పరిటాల రవి కుటుంబం వల్ల తీవ్రంగా ఇబ్బంది పడి క్షణం ఒక యుగంగా జీవితం గడిపి, ఇటీవల జరిగిన ఎన్నికలలో పరిటాల వారసుడిని ఓడించి ఎంఎల్ఏ గా గెలిచిన తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కూడా మంత్రి పదవి ఆశావహులలో ఉన్నారని తెలుస్తున్నది.
బిసి కులాల ప్రాబల్యం అధికంగా ఉన్న ఈ జిల్లాలో బిసిలకు జగన్ పెద్ద పీట వేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇకపోతే ఇటీవలి ఎన్నికలలో బాలకృష్ణపై  పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయిన మాజీ ఐజి ఇక్బల్ కు ఎమ్మెల్సీ ఇస్తానని జగన్ ఇటీవల గుంటూరులో ప్రకటించారు. ఒకవేళ అది జరిగితే రెండవ దశలో మైనారిటీ కోటాలో ఆయనకు మంత్రి పదవి దక్కే అవకాశం ఉందని అనుకుంటున్నారు.
చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డికే అగ్ర తాంబూలం
రాయలసీమలో తనదైన ప్రత్యేకత సాధించుకొని, తిరుమలేశుని శిరస్సుపై ధరించిన చిత్తూరు జిల్లాలో ఆశావహులు అనేక మంది ఉన్నా అగ్ర తాంబూలం మాత్రం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికే దక్కుతుందని పార్టీ వర్గాలు, ఆయన అంతేవాసులు ధీమాగా ఉన్నారు. జిల్లాలో రామచంద్రారెడ్డి తో పాటు మాజీ టీటీడీ చైర్మన్, తిరుపతి నియోజకవర్గం నుండి చావు తప్పి కన్ను లొట్ట పోయిన విధంగా గెలుపొందిన భూమన కరుణాకర రెడ్డి, నగిరి ఎంఎల్ ఏ ఫైర్ బ్రాన్డ్ గా గుర్తింపు పొందిన మహిళా నాయకురాలు రోజా, రాజశేఖర రెడ్డికి, జగన్ కు ముఖ్యుడుగా ఉండి, నిరంతరం ప్రజలతో  మమేకమై, గత ఐదు సంవత్సరాలుగా చంద్రబాబు హయాంలో అనేక కష్ట నష్టాలకు గురైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మంత్రి పదవి ఆశిస్తున్నారు. అయితే రామచంద్రారెడ్డికి మొదటి దశలో మంత్రి పదవి దక్కుతుందని, మహిళా కోటా క్రింద రోజాకు కూడా అవకాశం ఉంటుందని పార్టీ వర్గాలు వివరిస్తున్నాయి.
ఏది ఏమైనా చిత్తూర్ నుండి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, అనంతపూర్ నుండి  అనంత వెంకట్రామిరెడ్డి, కర్నూల్ జిల్లా నుండి బుగ్గన రాజేంద్రనాథ రెడ్డి మొదటి దశలోనే మంత్రి పదవులు పొంద గలరని తెలుస్తున్నది. అదే సమయంలో రోజా, మేడా మల్లికార్జున రెడ్డి,కాపు రామచంద్రా రెడ్డి, మరో మైనారిటీ నాయకుడికి కూడా మంత్రి పదవి దక్కే అవకాశం ఉందని తెలుస్తున్నది.
జగన్ తాను తయారు చేసుకున్న జాబితాను అనేక రకాలుగా పరిశీలించుకుంటున్నారని, పీకే తో పాటు తన ముఖ్య సలహాదారుల నుండి, సీనియర్ అధికారుల నుండి కూడా మంత్రివర్గ కూర్పుపై సలహాలు తీసుకుంటున్నారని, అన్ని కోణాల నుండి పరిశీలించి, సంతృప్తి చెందిన తర్వాత ఈ నెల 7న అధికారికమైన మంత్రుల జాబితా బయటకు వస్తుందని పార్టీ వర్గాలు వివరించాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *