ఊపు తగ్గని వార్నర్, హైదరాబాద్ 181/3

(బి వెంకటేశ్వర మూర్తి)

కోల్కత: ఇడెన్ గార్డెన్స్ లో ఆదివారం కెకె ఆర్ తో జరిగిన ఐపిఎల్ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 181 పరుగులు చేసింది. ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ 85, విజయ శంకర్ 40 పరుగులు చేశారు.

టాస్ గెల్చిన కెకెఆర్ ఎస్సార్ హెచ్ ని బ్యాటింగ్ కి దించింది. బాల్ ట్యాంపరింగ్ కేసులో ఏడాది పాటు నిషేధం అనుభవించాక తిరిగి రంగ ప్రవేశం చేసిన డేవిడ్ వార్నర్, ఇంగ్లాండ్ కు చెందిన జానీ బార్ స్టోతో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించాడు. ఏడాది అజ్ఞాత వాసం  తనపై మాత్రం ప్రభావం చూపలేదని నిరూపించడానికే అన్నట్టు వార్నర్ మొదటి బంతి నుంచే ధాటిగా ఆడటం ఆరంభించాడు. బౌండరీల మీద బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. రెండో ఓవర్ కే స్పిన్నర్ పీయూష్ చావ్లాను ప్రవేశపెట్టినా లాభం లేకపోయింది. అతని బౌలింగ్ లోనే వార్నర్ రెండు బౌండరీలు కొట్టాడు. మొదట్లో కాస్త తడబడిన బార్ స్టో కూడా క్రమక్రమంగా పుంజుకో సాగాడు.

హైదరాబాద్ స్కోరు ఐదో ఓవర్ దాటే సరికి 50 పరుగులు, ఎనిమిదో ఓవర్ కు 70 పరుగులు దాటింది. వాళ్లిద్దరి దూకుడుకు కళ్లెం వేసేందుకు తన వద్ద ఉన్న అన్ని అస్త్రాలను వినియోగించింది. వార్నర్, బార్ స్టోలను కట్టడి చేసేందుకై  మొదటి ఏడు ఓవర్లలోనే ఫెర్గూసన్, కుల్ దీప్ యాదవ్ లతో సహా కెకెఆర్ మొత్తం ఐదుగురు బౌలర్ లను వినియోగించింది. 10.5 ఓవర్లలో హైదరాబాద్ 100 పరుగులు చేసింది. 33 బంతుల్లో ఎనిమిది బౌండరీలు ఓ సిక్సర్ తో వార్నర్ అర్ధ సెంచరీ పూర్తి చేశాడు.

ఎట్టకేలకు 13వ ఓవర్ లో పీయూష్ చావ్లా బంతిపై బార్ స్టో క్లీన్ బౌల్ అయ్యాడు. అతను 35 బంతుల్లో మూడు బౌండరీలు,  ఓ సిక్సర్ తో 39 పరుగులు చేశాడు. ఆ సరికి హైదరాబాద్ 12.5 ఓవర్లలో 118 పరుగులు చేసింది.

చండ ప్రచండంగా బ్యాటింగ్ చేసి కెకెఆర్ బౌలర్లను చీల్చి చెండాడిన వార్నర్ 53 బంతుల్లో తొమ్మిది ఫోర్ లు, మూడు సిక్సర్లతో 85 పరుగులు చేసిన ఆండ్రీ రసెల్ బంతిని షాట్ కొట్టబోయి రాబిన్ ఊతప్పకు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. 16వ ఓవర్ చివరి బంతిపై వార్నర్ అవుటయ్యేసరికి హైదరాబాద్ 144 పరుగులు చేసింది.

వార్నర్ అవుటయ్యాక హైదరాబాద్ పరుగుల వేగం కాస్త తగ్గింది. అయితే ఆల్ రౌండర్ విజయ శంకర్ దూకుడు పెంచడంతో 20 ఓవర్లు పూర్తయ్యే సరికి హైదరాబాద్ మూడు వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. శంకర్ 24 బంతుల్లో రెండు ఫోర్లు, రెండు సిక్స్ లతో 40 పరుగులు చేశాడు.

(మూర్తి, సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్టు, బెంగుళూరు)

 

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *