వార్నర్ వస్తున్నాడు పారా హుషార్

(బి వేంకటేశ్వరమూర్తి)

ప్రత్యర్థి జట్టును బట్టి, ఆడుతున్న గ్రౌండును బట్టి రకరకాల కాంబినేషన్ లతో ప్లేయింగ్ లెనవెన్ ను రంగంలో దింపడానికి ఐపిఎల్ టీమ్ లలో అన్నింటి కంటే ఎక్కువ సౌలభ్యం ఉన్న టీమ్ హైదరాబాద్ సన్ రైజర్స్. 2013 నుంచి ఇప్పటిదాకా జరిగిన ఐపిఎల్ టోర్నీల్లో 2016లో ఛాంపియన్ షిప్ గెల్చుకోగా, గతేడాది హైదరాబాద్ రన్నరప్ గా నిలిచింది.

2016, 17 ల్లో అత్యధిక వికెట్లు బుట్టలో వేసుకుని వరసగా రెండు సార్లు పర్పుల్ క్యాప్ ధరించిన భారత పేస్ బౌలర్ భువనేశ్వర్ కుమార్, అటు అంతర్జాతీయంగానూ, ఇటు ఐపిఎల్ లోనూ తాజా లెగ్ స్పిన్ సెన్సేషన్ ఆఫ్ఘనిస్తాన్ కు చెందిన రషీద్ ఖాన్ లు హైదరాబాద్ కు ప్రధాన బౌలింగ్ ఆయుధాలు. మాజీ ఆసీస్ స్టార్ గ్లెన్ మెక్ గ్రాత్ బేసిల్ థంపీపై ప్రశంసల వర్షం కురిపించాడు కానీ అంత అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనేదీ ఈ కుర్రాడి పేరన ఇంకా నమోదు కాలేదు. ఈ సారి వేలంలో రూ 3 కోట్లు కుమ్మరించి కొనుగోలు చేసిన పంజాబ్  ఫాస్ట్ బౌలర్ సందీప్ శర్మను ఏ మాత్రం వినియోగించుకుంటారో చూడాలి.

గత ఏడాది ఎస్ఆర్ హెచ్ తరఫునే 12 పోటీల్లో ఆడి శర్మ 12 వికెట్లు పతనం చేశాడు. భారత బౌలర్లు ఖలీల్ అహ్మద్, సిద్ధార్థ కౌల్ తో పాటు ఆసీస్ ఫాస్ట్ బౌలర్ బిల్లీ స్టాన్ లేక్ పేస్ కాంబినేషన్ లో కీలక పాత్ర వహించనున్నారు. స్పిన్ విభాగంలో ఆఫ్ఘన్ లెగ్, ఆఫ్ స్పిన్ ద్వయం రషీద్ ఖాన్, మహమ్మద్ నబీలకు తోడు బంగ్గాదేశ్ వెటరన్ స్పిన్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ ఉండనే ఉన్నాడు. గతేడాది ఒకటి రెండు మ్యచ్ లలో రషీద్ స్లాగ్ హిటింగ్ లో సైతం అద్వితీయమైన ప్రతిభా పాటవాలు ప్రదర్శించాడు.

బాల్ ట్యాంపరింగ్ లో పట్టుబడి ఏడాది పాటు నిషేధం శిక్షక గురై ఇటీవలే శిక్ష పూర్తి చేసుకున్న ప్రపంచ అగ్రశ్రేణి ఓపెనింగ్ బ్యాట్స్ మన్ డేవిడ్ వార్నర్ జట్టు సారథ్యాన్ని తిరిగి చేపట్టడం జట్టుకు కొత్త జవసత్వాలు తీసుకొస్తున్నది. వార్నర్ లేని లోపాన్ని గత ఏడాది కేన్ విలియమ్ సన్ పూరించగలిగాడు కానీ ప్రస్తుతం అతను భుజం గాయానికి చికిత్స పొందుతున్నాడు.

బహుశ ఈ ఐపిఎల్ లో అతను ఆడే అవకాశం లేదు కాబట్టి సన్ రైజర్స్ రిప్లేస్ మెంట్ కోసం యత్నిస్తున్నది. విదేశీ ఆటగాళ్లలో మార్టిన్ గుప్టిల్, జానీ బెయిర్ స్టో, భారత ఆటగాళ్లలో దీపక్ హూడా, మనీష్ పాండే, రికీ భూయి ల నుంచి మిడిలార్డర్ ను ఎంపిక చేసుకోవలసి ఉంటుంది. యూసుఫ్ పఠాన్, విజయశంకర్ ల ఆల్ రౌండ్ ప్రతిభ ఆపత్సమయాల్లో హైదరాబాద్ ను ఆదుకోగలదు.

ఈ సీజన్ మొదటి మ్యాచ్ లో సన్ రైజర్స్ కోల్ కటాలో కోల్ కటా నైట్ రైడర్స్ ను ఢీ కొంటుంది.

(రచయిత సీనియర్ జర్నలిస్టు, బెంగుళూరు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *