వికారి నామ ఉగాది శుభాకాంక్షలు, వికారి అంటే…

వికారి-నామ-సంవత్సర-శుభాకాంక్షలు.వికారి అనే పేరు విని ఏమిటిది అని ఎవరూ ముఖం చిట్లించుకొనవలసిన పని లేదు.vఅదేమీ చెడ్డ పేరు కానే కాదు.ధనము కలిగినవాడు ధని.బలము కలిగినవాడు బలి. (బలిచక్రవర్తి తెలుసుగా)చక్రము కలిగినవాడు చక్రి (విష్ణువు)శూలము కలిగిన వాడు శూలి (శివుడు)హస్తము అంటే తొండము కలిగినది హస్తి. (అంటే ఏనుగు)అదే పరంపరలో వికారము కలిగినది/కలిగినవాడు వికారి అన్న మాట.మరి వికారము అనేది చెడ్డపేరు కాదా?కాదు.

ఆకారము అనే పదాన్ని ఆకృతి అని కూడా అంటాము.అలాగే, వికారము అనే పదాన్ని వికృతి అని కూడా అంటాము.వికృతి అనగానే తెలుగు వ్యాకరణంలో ప్రకృతి – వికృతులు గుర్తుకు వచ్చాయా? రథము అనే ప్రకృతి పదానికి అరదము అనే పదం వికృతి. బ్రహ్మ అనే ప్రకృతి పదానికి బొమ్మ అనే పదం వికృతి. విష్ణువు అనే ప్రకృతిపదానికి వెన్నుడు అనే పదం వికృతి. ఇలా చాలానే చదువుకున్నాం కదా? ఈ విధంగా వికృతిపదాలు ప్రకృతి నుండి వచ్చినవే తప్ప, వేరే కావు.

కాని, ఇది భాషకు సంబంధించిన ప్రకృతి-వికృతి సంబంధం.దర్శనశాస్త్రాన్ని అనుసరించి ఈ కనిపిస్తున్న, మన తర్కానికి గాని, మన ఊహకు గాని అందుతున్న ఈ సమస్తవిశ్వము కూడా వికృతే! దీనికి మూలమైన ప్రకృతి మన కంటికి కూడా కనబడదు.

“మూలప్రకృతిరవికృతిః. మహదాద్యాః ప్రకృతివికృతయః సప్త. షోడశకస్తు వికారః.” అని సాంఖ్యకారికలలో (3) ఈశ్వరకృష్ణుడు చెబుతాడు.ఒక్క మాటలో చెప్పాలంటే ప్రకృతి అంటే వేరొకదాని పుట్టుకకు ఆధారభూమిగా ఉండేది. వికృతి అంటే, వేరొకదానినుండి ఉద్భవించేది. ప్రకృతివికృతులు అంటే, తాము స్వయంగా వేరొకదానినుండి పుడుతూ మరొకదాని పుట్టుకకు కారణమయ్యేవి అన్నమాట.అటువంటి మూలప్రకృతి (కేవల ప్రకృతి) ఒక్కటే ఉందట.

ప్రకృతివికృతులు ఏడు ఉన్నాయట.కేవలవికృతులు పదహారు ఉన్నాయట.కేవలవికృతులు పదహారు అన్నారు కదా?ఆ వికృతులు ఏమిటో తెలుసా?అందులో మొట్టమొదటిది మనస్సు.తరువాత, కన్ను ముక్కు చెవి వంటి జ్ఞానేంద్రియాలు ఐదు,కాళ్లు చేతులు వంటి కర్మేంద్రియాలు ఐదు,భూమి, గాలి, నీరు వంటి పంచభూతాలు ఐదు.(1+5+5+5=16)అర్థమైందా?ఈ మనస్సు, ఈ పంచభూతాలు, ఈ పంచ జ్ఞానేంద్రియాలు, ఈ పంచకర్మేంద్రియాలు – ఇవన్నీ వికృతులు. అంటే వికారాలు. ఈ వికారాలతో తయారైనదే శరీరం. ఈ వికారాలు కలిగినది వికారి.
వికారి అంటే ఎవరు? మనమే. కాబట్టి, వికారి నామ సంవత్సరం అంటే మన సంవత్సరమే.

సరే, ఇంతకీ మనం ఎవరం?ఛాందోగ్యోపనిషత్తులో ఒక కథ ఉంది. ఆరుణి అని ఒక గొప్ప జ్ఞాని ఉన్నాడు. అతడికి శ్వేతకేతువు అని ఒక కుమారుడు ఉన్నాడు. అతడు గురుకులానికి వెళ్లి విద్యాభాసం చేసి వచ్చాడు. అపుడు వారి నడుమ ఒక గొప్ప సంభాషణ జరిగింది.”నాయనా శ్వేతకేతూ, ఏ ఒక్కదాన్ని తెలుసుకుంటే అన్నీ తెలుసుకున్నట్టే అవుతుందో దానిని నువు తెలుసుకున్నావా?”శ్వేతకేతువుకు ఆశ్చర్యం కలిగింది.“లేదు నాన్నగారూ, అదేమిటో చెప్పండి” అని అడిగాడు.
అపుడు ఆరుణి చక్కగా వివరించి చెప్పాడు –“యథా సోమ్య, ఏకేన మృత్పిండేన సర్వం మృణ్మయం విజ్ఞాతం స్యాత్। వాచారంభణం వికారో నామధేయో మృత్తికేత్యేవ సత్యమ్।।’ (ఛాందోగ్యం 6.1.4)కుండ, మూకుడు, కడవ, తొట్టి వంటి వస్తువులు తయారు అవుతున్నాయి. అవన్నీ మట్టితోనే తయారు అవుతున్నాయి. అదే మట్టితో రాజు బొమ్మ, రాణి బొమ్మ, గుర్రం బొమ్మ, ఏనుగు బొమ్మ, తయారు అవుతున్నాయి. వాటి ఆకారాలు వేరు, వాటి పేర్లు వేరు. వాటి ఉపయోగాలు కూడా వేరే. అయినప్పటికీ వాటి మూలపదార్థం ఒకటే. అదే మట్టి. కాబట్టి, ఆ మట్టి స్వభావాన్ని తెలుసుకుంటే, దానితో చేయబడిన, చేయబడుతున్న, చేయబడబోతున్న సమస్తవస్తువులను గూర్చి సమగ్రంగా తెలుసుకున్నట్టే” అని చెప్పాడు ఆరుణి.ఆ వస్తువులన్నీ వికారాలు.వాటికి ఆ మట్టి మూలపదార్థం.ఈ వికారాలన్నీ కూడా మట్టిముద్దకంటె అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తాయి.అయినప్పటికీ, ఆ వికారాల ఆయుష్కాలం తీరినతరువాత అవి నెమ్మదిగా కలసిపోయేది తమ మూలపదార్ధంలోనికే. (అయితే ఆ మట్టి కూడా, మూలప్రకృతి నుండి పుట్టుకొచ్చిన వికారమే అని మరచిపోరాదు.)అలాగే, ఉంగరము, గొలుసు, కంకణము మొదలైన నగలన్నీవికారాలు.వాటికి బంగారం మూలపదార్థం.ఒక పెద్ద మఱ్ఱి చెట్టు ఉంది. దానికి విశాలంగా విస్తరించిన బోలెడు కొమ్మలున్నాయి. బోలెడు ఊడలు ఉన్నాయి.లెక్కపెట్టడం మొదలు పెడితే మనకు ఆయాసం కలిగించేంత సంఖ్యలో ఆకులు ఉన్నాయి. పండ్లు ఉన్నాయి. పండ్లలో విత్తనాలు ఉన్నాయి. ఇవన్నీ వికారాలు. ఆ విత్తనాలలో మళ్లీ ఇంత పెద్ద మఱ్ఱి చెట్లు అనేకం దాక్కుని ఉన్నాయి. ఆ విత్తనాలలో ఆ మఱ్ఱిచెట్లను మనం చూడలేము. ఐనప్పటికీ, అవి ఉన్నమాట సత్యం. అవి ఆ విత్తనాలలో అత్యంత సూక్ష్మపదార్థరూపంలో దాక్కుని ఉన్నాయి. ఆ సూక్ష్మాతిసూక్ష్మమైన పదార్థమే మూలప్రకృతి అని చెప్పవచ్చు. అది క్రమంగా కాలానుగుణంగా విస్తరిస్తుంది.అయితే, తనంత తానుగా విస్తరించే శక్తి దానికి లేదు. చైతన్యంతో కలసినపుడే అది అలా విస్తరిస్తుంది.అలాగే ఈ సమస్తవిశ్వం కూడా వికారం. ఇది తనంత తానుగా విస్తరించలేదు. దీనికి మూలం మూలప్రకృతి. ఆ మూలప్రకృతి కూడా చైతన్యంతో కలసినపుడు విశ్వంగా విస్తరిస్తుంది. ఆ చైతన్యపదార్థాన్ని సాంఖ్య దర్శనంలో పురుషుడు అంటారు. (ఇక్కడ పురుషుడు అంటే మగవాడు అని అర్థం కాదు.)మనం ఎవరం అని అనే ప్రశ్నకు సమాధానం అదే.
మనం పురుషులం.చైతన్యస్వరూపులం.(పైన చెప్పినట్లుగా ఇక్కడ ఆడ-మగ అనే తేడాలు లేవు. పురుష అనేది చైతన్యపదార్థానికి ఒక సాంకేతికనామం మాత్రమే.) మనం వికారాలు కలిగి ఉండడం చేత మాత్రమే మనం వికారి అనబడతాము.ఆరుణి చెప్పిన కథలో వలె, మన నామరూపాలు కూడా వికారాలే.నన్ను నేను శ్రీనివాసులు అనే పేరుతో పరిచయం చేసుకున్నాను కాబట్టి, మీరందరూ నన్ను ఆ పేరుతో పిలుస్తున్నారు. మొదట్లోనే నా పేరు వేంకటేశులు అనో రామయ్య అనో చెప్పుంటే, మీరు నన్ను అదే పేరుతోనే పిలిచేవారు కదా?కాబట్టి, నామం వ్యావహారికసత్యమే తప్ప, పారమార్థికంగా అసత్యం అని తెలుస్తోంది. అవునా?

అలాగే, నా తిండిని బట్టి నా రూపం, అంటే ఒడ్డు, పొడుగు, బరువు మొదలైనవి ఉంటాయి. నేను నివసించే ప్రదేశాన్ని బట్టి నా రంగు ఉంటుంది. ఈవిధంగా, రూపం కూడా వ్యావహారికసత్యమే తప్ప, పారమార్థికసత్యం కాదు అని తెలుస్తోంది కదా?నా మనస్సు కూడా వ్యావహారికమే. నా మనసు ఆంధ్రప్రదేశ్ లో ఉంది కాబట్టి, నేను ఈ ప్రదేశం గురించే ఆలోచిస్తాను. ఇక్కడ మంచి జరిగితే సంతోషిస్తాను. ఇక్కడ బాగులేదు అనుకుంటే బాధపడతాను.నా మనస్సు ఇక్కడ కాకుండా ఎక్కడో పసిఫిక్ సముద్రంలో ఒక అందమైన దీవిలో ఉందనుకోండి. అక్కడి సుఖాలను అక్కడి బాధలను మాత్రమే నా మనస్సు అనుభవిస్తుంది. కాబట్టి, మనం సుఖాలు, బాధలు అనుకుంటున్నవి అన్నీ కూడా మన మనసు పడుతున్న వికారాలే. అవి కూడా వ్యావహారికసత్యాలే కాని, పారమార్థికసత్యాలు కావు.మనకు ఇన్ని వికారాలు ఉన్నాయి కదా, అందుకే మనం వికారి అయినాము.

ఇటువంటి రకరకాల వికారాలు వదులుకోగలిగితే, మనం మనంగా, (శుద్ధచైతన్యస్వరూపంగా) ఉంటాము అనేది సాంఖ్యదర్శనశాస్త్రం చెబుతుంది.మోక్షం అంటే అదే అని వారు చెబుతారు.అయితే, మోక్షం కావాలంటే, ముందు మనం వికారి అని తెలుసుకోవాలి. అప్పుడే, మన వికారాలు ఏమిటో మనం తెలుసుకొనగలం. అవి తెలిస్తేనే, వాటిని వదిలించుకొనేందుకు ప్రయత్నించగలం. చైతన్యస్వరూపులం కాగలం.వికారము అనే పదాన్ని కురూపత్వము అనే అర్థంలో కూడా వాడుతారు.వికారి అంటే కురూపి (సౌందర్యవిహీనుడు) అన్నమాట.”ఓ పార్వతీ! శివుడు విరూపాక్షుడు కదా? కాబట్టి వికారి కదా? మరి అటువంటివాడిని ఎందుకు నువు ఇష్టపడ్డావు?” అని అడిగితే పార్వతికి కోపం వచ్చింది.తగిన సమాధానం చెప్పింది.అలా అడిగినవాడు స్వయంగా మారువేషం వేసుకొచ్చిన శివుడే అనుకోండి. ఆ ముచ్చటలు కాళిదాసుని కుమారసంభవంలో ఉన్నాయి. ఎప్పుడైనా ఆ మాటలు ఒకసారి చూద్దాం.

మానవులు ఏమైనా తక్కువ తిన్నారా?భౌతికంగా వికారులైనవారిని చూసి నవ్వే మానసికవికారులు కూడా ఉంటారు.జనకమహారాజు సభలో ప్రవేశించిన అష్టావక్రమహర్షిని చూసి అక్కడ ఉన్న పండితులు నవ్వారట. అపుడు, అష్టావక్రుడు కూడా నవ్వాడట. “మేము నవ్వితే దానికి ఒక అర్థం ఉంది, మరి నువ్వెందుకయ్యా నవ్వావు?” అని వారు అడిగారట.కండ్లు ఉండవలసిన స్థానంలో ముక్కు, ముక్కు ఉండవలసిన స్థానంలో చెవులు, – ఇలా ఉంటే అది వికారం కదా? అలాగే, ఈ సభలో ఉన్న వికారాన్ని చూసి నవ్వాను అన్నాడట అష్టావక్రుడు.ఈ సభలో నీకేమి వికారం కనిపించింది? అని వారు అడిగారట. క్షత్రియుల దృష్టి ఆయుధాల మీద  ఉంటుంది. పండితుల దృష్టి శాస్త్రజ్ఞానం మీద ఉంటుంది. కాని, ఇక్కడున్న వారు నా శాస్త్రజ్ఞానాన్ని చూడలేకపోయారు. కేవలం నా చర్మాన్ని చూసి నవ్వారు. అందుకని వారు చర్మకారులే.పండితాసనాలలో పండితులు ఉండాలి. కాని, ఈ సభలో అక్కడ చర్మకారులు కూర్చున్నారు. అందువల్ల, ఈ సభ నాకు వికారంగా కనబడింది. అందువల్ల నవ్వాను పొమ్మన్నాడు అష్టావక్రుడు.దాంతో అందరికీ బుద్ధి వచ్చిందట. అష్టావక్రునికి అందరూ క్షమాపణలు చెప్పుకున్నారు. (ఇక్కడ చర్మకారుడు అనేది వెక్కిరింపు మాట కాదు. కన్ను ఉండవలసిన చోట ముక్కు ఉంది అన్నామనుకోండి. అది ముక్కును వెక్కిరించినట్టు కాదు కదా?).

ఒడిషా బెంగాలు ప్రజలు ‘వ’ అనే అక్షరాన్ని ‘బ’ అని పలుకుతారు. వంగదేశాన్ని బంగదేశం అంటారు. రవీంద్ర అనకుండా రబీంద్ర అంటారు. అలాగే వారు ‘వికారి’ అనే పదాన్ని ‘బికారి’ అని పలుకుతారేమో. అపుడు అర్థం మారిపోదా? ఆయా ప్రాంతంలో పలుకుబడి అలాగే ఉంటుంది కాబట్టి, అర్థం మారిపోదు.సరే, ఇంతకూ మన భాషలో బికారి అంటే ఏమిటి? బికారి అంటే బిచ్చగాడు, ఇల్లూవాకిలీ లేని వాడు, అనాథ, పేదవాడు అనే నానార్థాలలో మన తెలుగువారు ఆ పదాన్ని వాడుతూ ఉంటారు.కాని, నిజానికి బే-కార్ అనే రెండు పదాల కలయిక అది. ‘బేషరతు’ అంటే షరతులు లేకుండా అనే అర్థం మనకు తెలుసు కదా? అలాగే, ‘బేకార్’ అంటే పనిలేనివాడు అని అర్థం. అంటే, చేయడానికి పని లేనివాడు అని అర్థం కాదు. వాడిని నిరుద్యోగి అని కాస్త మర్యాదగా పిలుస్తారు. బేకార్ అనేది ఒకరకంగా తిట్టు. చేయడానికి పని ఉన్నప్పటికీ, చేయకుండా జులాయిగా తిరిగేవాడిని అలా తిడతారు.నిరుద్యోగులకు అది ఇస్తాం ఇది ఇస్తాం అని చెప్పే మన రాజకీయనాయకులకు ఈ తేడా తెలిస్తే బాగుంటుంది అని ఆశిద్దాం.భౌతికమైన వికారాల కంటె, మనోవికారాలు చాల శక్తిమంతమైనవి. ప్రేమ, కరుణ, వాత్సల్యము, మొదలైనవి కూడా శాస్త్రం ప్రకారం మనోవికారాలే. అయినప్పటికీ, వ్యవహారంలో వాటిని మంచి వాటిగా పరిగణిస్తారు.కాని, మరికొన్ని మనోవికారాలు చెడ్డవి అని వ్యవహారం. కామ-క్రోధ-లోభ-మోహ-మద-మాత్సర్యాలు మనోవికారాలే. ఇవి తగుమాత్రంలో అందరికీ ఉంటాయి. సాధువులు మాత్రం మంచివని, చెడ్డవని తేడా చూపకుండా, సమస్తమనోవికారాలను వదిలించుకోవాలని ప్రయత్నిస్తారు.మంచివైనా చెడ్డవైనా మితిమీరితే మాత్రం చాల ప్రమాదం.

రాయలసీమలో ఎవరైనా అతిగా ప్రవర్తిస్తే, “యేమిరా ఆ మనిషి శానా యికారాలు బడతా ఉండాడే?” అని అంటారు. అతి సర్వత్ర వర్జయేత్ అనే విషయం అందరికీ తెలిసిందే కదా?ప్రేమ అనే మనోవికారం మంచిదని మనం అనుకుంటాం. కాని, దుర్యోధనుడి మీద ధృతరాష్ట్రుడు అతి ప్రేమ చూపినందువలన ఆ దుర్యోధనుడు ఎలా చెడిపోయాడో మహాభారతం చెప్పింది.కామం అనే మనోవికారం చెడ్డదని మనం అనుకుంటాం. కాని, “ధర్మావిరుద్ధో భూతేషు కామోऽస్మి భరతర్షభ” (ధర్మవిరుద్ధం కాని కామాన్ని నేనే అర్జునా) అని శ్రీకృష్ణుడు అర్జునుడితో చెప్పాడు.గంగను స్వర్గం నుండి భూమికి దించాలి అనే కామంతో (కోరికతో) భగీరథుడు ఎంతో గొప్ప ప్రయత్నం చేసి, సఫలుడై, సమస్తప్రజలకు చాల మేలును చేకూర్చాడని రామాయణం వర్ణిస్తుంది.ఈ రామాయణమహాభారతాలను మనం ఇతిహాసాలుగా పరిగణిస్తాము. అంటే చరిత్ర అన్నమాట. అయితే, పాశ్చాత్యులు వచ్చి వాటిని మైథాలజీ అనేశారు. అంటే కట్టుకథలు అని.అస్తు. వారికైనా మనకైనా యద్భావం తద్భవతి.

అందువలన, వికారాలు స్వతః మంచివి అని చెడ్డవి అని ఉండవు. వాటితో మనం చేసే వ్యవహారాలను బట్టి అవి మంచివా చెడ్డవా అని లోకులు నిర్ణయించే పరిస్థితి వస్తుంది. అధికమాత్రంగా ఉన్నవాటిని మనం వదిలించుకోవాలి. మనం స్వయంగా అటువంటి వికారాలను వదిలించుకొనలేకుంటే రామదాసుని, హనుమంతుని త్రికరణశుద్ధిగా స్మరిద్దాం. ఆయన వదిలించగలడు. హనుమంతుడే ఎందుకు అంటే, హనుమంతుడే మరి! బురదగుంటలో పడినవాడిని పైకి లాగాలి అంటే, ఆ బురదగుంటలో లేకుండా బయట ఉన్నవారే శరణ్యం కదా, అలాగన్న మాట.తులసీదాసమహాకవి హనుమాన్ చాలీసా మొదలుపెట్టే ముందు హనుమత్స్మరణం చేశాడు.’బుద్ధిహీన తను జానికై సుమిరౌ పవనకుమారబల బుద్ధి బిద్యా దేహు మొహి హరహు కలేశ బికార'(దోహా 2)(ఓ పవనకుమారుడా! హనుమన్! నన్ను నేను ఒక తెలివితక్కువవాడిగా పరిగణించుకుని, నిన్ను స్మరిస్తూ శరణు వేడుతున్నాను. నాకు బలాన్ని, బుద్ధిని, విద్యను ప్రసాదించు. నా కష్టాలను, నా వికారాలను హరించు).తులసీదాసు ప్రార్థన ఫలించింది. అతడు మహాకవులలో ఒకడుగా కీర్తింపబడ్డాడు. భక్తాగ్రగణ్యుడిగా పరిగణింపబడ్డాడు. ఆవిధంగా వికారాలను వదిలించగల శక్తి, ఆసక్తి రెండూ మెండుగా ఉన్న స్వామి హనుమంతుడు కదా, అందుకని అతనిని ప్రార్థించాలి. పైగా మరికొన్ని రోజులలో శ్రీరామనవమి కూడా రానుంది మరి!క్రొత్త సంవత్సరం వేళ, మన ప్రార్థన కూడా తప్పక ఫలిస్తుంది.ఈ వికారినామ సంవత్సరంలో వారికి, వీరికి అని కాకుండా, అందరికీ సకలశుభాలు ఆనందాలు కలగాలని ఆకాంక్షిస్తున్నాను.

-డా. శ్రీనివాసకృష్ణ పాటిల్ (బ్లాగ్ వన విహంగ నుంచి)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *