`సెల్ఫీలు, మద్దూరు వడ’ వ్యూహంతో సుమలత ప్రచారం

(బి వెంకటేశ్వర మూర్తి)

బెంగుళూరు: మండ్య లోక్ సభ స్థానంలో ఎన్నికల విజయం కోసం నటి సుమలత `సెల్ఫీలు, మద్దూరు వడ’ల రణతంత్రం అమలు చేస్తున్నారు. ఇదేం రణతంత్రం రా బాబూ ఇంతదాకా ఎక్కడా విననూ లేదే అని ఆశ్చర్యపోతున్నారా?

నిజమే మరి, కొమ్ములు తిరిగిన రాజకీయ ఉద్దండ పండితులకు సైతం తల తిరిగిపోయేలా ఎన్నికల్లో ఆమె అమలు చేస్తున్న ఈ రణతంత్రం కనీవినీ ఎరుగనిది. అప్పుడప్పుడు ఏవో ఒకట్రెండు సినిమాలు చేయడం తప్ప మిగతా సమయాల్లో హీరో అంబరీష్ ఇంటి పట్టున భర్త అభిమానులకు అతిథి సత్కారాలు చేసుకునే అమాయకురాలిగా సుమలతను అంచనా వేస్తే ఆమె ఎన్నికల ప్రత్యర్థులతో సహా అందరూ పప్పులో కాలేసినట్టే లెక్క.

ఇకపోతే ఇప్పుడామె అనుసరిస్తున్న సెల్ఫీలు, మద్దూరు వడల రణతంత్రం దగ్గరకు వస్తే, కన్నడ చిత్రరంగంలో అత్యధిక స్థాయిలో అభిమానులు కలిగి ఉన్న స్టార్ హీరోలు దర్శన్, యశ్ టాపు లేని ఓపెన్ వ్యాన్ లలో మండ్య జిల్లాల్లో ఊరూరా తిరుగుతూ సుమలత అక్క కోసం నిర్విరామంగా ప్రచారం చేస్తున్నారు. వీరి కష్టం వృథా పోకూడదన్న సంకల్పంతో, వారి ప్రచారయాత్రల్లో పాల్గొంటున్న వేలాది మంది అభిమానుల జయజయధ్వానాలను వోట్లుగా మార్చుకోవాలన్న లక్ష్యంతో స్టార్ లకిద్దరికీ ఆమె రెండు మూడు ట్రిక్కులు నేర్పారు. వాటిని తుచ తప్పకుండా అమలు చేయాలని కోరారు.

ప్రచారానికి వెళ్లిన ప్రతి పల్లెలోనూ వీలైనంత ఎక్కువ మందితో సెల్ఫీలు దిగడం ఓ ట్రిక్కు. సెల్ ఫోన్ లేకుండా క్షణమైనా బతకడం సాధ్యం కాని నేటి యుగంలో యవతరంలో సెల్ఫీల మీదున్న మోజు తెలిసిందే. అందునా అభిమానతారలతో సెల్ఫీ అంటే పల్లెల్లోని యువతరానికి అంత సులభంగా లభించే అవకాశం కాదు.

ఆ సెల్ఫీ బతుకులో చెరిగిపోని స్మృతిగా మిగిలిపోతుంది. ఇంటి దగ్గరికొచ్చి ఇంతటి వరాన్ని ప్రసాదించిన అభిమాన తారల పట్ల పొంగి పొరలే కృతజ్ఞతా భావం వాళ్లను పోలింగ్ బూత్ వద్దకు నడిపించి వోటుగా రూపాంతరం చెందగలదని సుమలత వ్యూహం. ప్రచారం సందర్భంగా ఎవరడిగినా సరే సెల్ఫీలు మాత్రం నిరాకరించవద్దనీ, పైగా ప్రతి ఊళ్లోనూ కనీసం పది పదహైదు నిమిషాలు సెల్ఫీలకు కేటాయిస్తూ సాగిపోవాలని సుమలత దర్శన్, యశ్ లకు సూచించారు.

మరోవైపు సుమలతకు ప్రత్యర్థి గా పోటీ చేస్తున్నది సాక్షాత్తు ముఖ్యమంత్రి కుమారస్వామి కుమారుడు నిఖిల్ గౌడ కాగా సహజంగానే జెడిఎస్ వ్యూహకర్తలు వక్కళిగుల కులం వోట్ల ఆసరాతో విజయానికై పథకాలు రచిస్తున్నారు. వక్కళిగులకు రాజకీయ పీఠాధిపతి దేవేగౌడ అనడంలో రెండో అభిప్రాయానికి తావు లేదు. కులం కట్టుబాటుకు తుచ తప్పకుండా కట్టుబడే ముసలీ ముతకా వోట్ల కోసం ప్రయత్నించీ లాభం లేదని కచ్చితమైన అవగాహనతో ముందుకు వెళుతున్న సుమలత వక్కళిగుల్లోనూ కులం అంటు సోకని అభ్యుదయ భావాలు గల యువతరం వోట్ల కోసం తారల ద్వారా ప్రచారం సాగిస్తున్నారు. ప్రచారయాత్రల్లో యువతరం, మహిళలకు అధిక ప్రాధాన్యం ఇవ్వవలసిందిగా ఆమె వారిద్దరినీ కోరారు.

మండ్య జిల్లాలోని మద్దూరు శాసనసభా నియోజకవర్గ కేంద్రం మద్దూరు పేరుతో సుప్రసిద్ధమైన మద్దూరు వడ కర్ణాటకలో అత్యంత జనప్రియమైన వంటకం. హోళిగ రవ, బియ్యప్పిండి, మైదా, నువ్వులు కలిపి తడిపిన పిండిలో ఉల్లిపాయ ముక్కలు వేసి పల్చటి వడలుగా నూనెలో దోరగా వేయించి తీస్తే కరకరలాడే మద్దూరు వడలు రెడీ.

కొబ్బరి లేదా పుదీనా చట్నీతో వీటిని లాగించడం కన్నడిగులకు చాలా ఇష్టం. అందునా మండ్య జిల్లాలో మరీను. మండ్య జిల్లాలో మద్దూరు వడలు చేసి విక్రయించే వీధి, తోపుడు బండి వ్యాపారులపై ఆరా తీసిన సుమలత ఎన్నికల యంత్రాంగం వీరి సంఖ్య దాదాపు 3,000 దాకా ఉంటుందనీ, రోజుకు 75,000 మంది దాకా వీరి వద్ద వడలు ఆరగిస్తుంటారని అంచనా కట్టింది. ఇలా తినేవారిలో అధిక భాగం బయటివారే అనుకున్నా మండ్య లోక్ సభ వోటర్లు కనీసం ఐదు శాతం దాకా ఉన్నప్పటికీ, మద్దూరు వడల వ్యాపారుల ద్వారా చాప కింద నీరులా నిర్వహించే ప్రచారం వోట్ల పంట పండించగలదని సుమలత అంచనా.

నిజానికి రాజకీయాల్లో సుమలతను తక్కువగా అంచనా వేసే వారెవరూ ఉండరు. లోక్ సభ ఎన్నికల నోటిఫికేషన్ కూడా వెలువడక ముందే, ఎంతో ముందుగానే మండ్య టికెట్ కోసం కాంగ్రెస్ రాష్ట్ర నాయకులతో సంప్రదింపులు జరపడం మొదలుకొని, మండ్య సీటు కోసమే పట్టు బట్టడం, మండ్యలో మంచి పలుకుబడి ఉన్న మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత భారతీయ జనతా పార్టీ నాయకుడు ఎస్ ఎం కృష్ణ, కర్ణాటక రాజ్య రైత సంఘ నాయకుడు కెఎస్ పుట్టణ్ణయ్య వంటి నాయకులను కలిసి వారి సహకారం అర్థించడం వంటి చర్యలను బట్టి ఆమె రాజకీయ పరిణతి అర్థమవుతున్నది.

ముఖ్యమంత్రితో సహా మొత్తం అధికార యంత్రాంగం, మంత్రులు, స్థానిక శాసనసభ్యుల రాజకీయ దాడులను ఎదుర్కొంటూ, అంబరీష్ భార్యననీ, మీ సేవ కోసమే ఎన్నికల బరిలోకి దిగాననీ చెప్పుకొంటూ, అంబి మండ్య కోసం కన్న కలల్ని నిజం చేసే తన ప్రయత్నానికి సాయపడవలసిందిగా కోరుతూ తిట్లు, శాపనార్థాలకు తావు లేకుండా ఎంతో హుందాగా ఆమె సాగిస్తున్న ప్రచారానికి చక్కని స్పందన లభిస్తున్నది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *