ఆ ఒక్క ఓవర్ త్రో తలరాతలు మార్చేసింది!

(బి వి మూర్తి)
స్టోక్ అనే వర్బ్ కి థర్డ్ పర్సన్ సింగులర్ ప్రెజెంట్ టెన్స్ లో ఎస్ అక్షరం తోడై `స్టోక్స్’ అవుతుంది. ఇంధనం అందించు, మండించు, రెచ్చగొట్టు అనే అర్థాలు గల పేరు పెట్టుకున్న బెన్ స్టోక్స్ నిన్న తన పేరును ముమ్మూర్తులా సార్థకం చేసుకున్నాడు. నిన్నటి ప్రపంచ కప్ లో స్టోక్స్ రాజేసిన మంట క్రికెట్ బతికి ఉన్నంత దాకా ఆరిపోకుండా అలా మండుతూనే ఉంటుంది.
న్యూజిలాండ్ తో జరిగిన ప్రపంచ కప్ తుదిసమరం చివరి ఓవర్ లో ఇంగ్లండ్ కు 15 పరుగులు అవసరం.
బౌల్ట్ వేసిన మొదటి రెండు బంతుల్లో స్టోక్స్ కు ఒక్క పరుగూ రాలేదు. మూడో బంతిపై సిక్సర్.
నాలుగో బంతిపై ఫుల్ టాస్ ని మిడ్ వికెట్ లోకి డ్రైవ్ చేసిన స్టోక్స్ శరవేగంతో మొదటి పరుగు పూర్తి చేసి రెండో పరుగుకోసం స్ట్రైకింగ్ ఎండ్ కు దూసుకొస్తున్నాడు.
బ్యాట్ ను ముందుకు చాపి, ఫీల్డర్ విసిరిన బంతితో పోటీ పడుతూ, తనను తాను క్రీజులోకి విసిరేసుకున్నాడు. స్టోక్స్ బ్యాట్ లో అదెంతటి ఆకర్షణ శక్తో తెలీదు గానీ బంతి మరోసారి నేరుగా అతని బ్యాట్ కు తలబాదుకుని బౌండరీ లోకి పారిపోయింది. స్టోక్స్ పరిగెత్తిన రెండు, ఈ విచిత్రమైమన ఓవర్ త్రో బౌండరీ కలిసి మొత్తం ఆరు పరుగులు.
ఇక రెండు బంతుల్లో మూడు పరుగులు అవసరం.
అయిదో బంతిపై ఆదిల్ రషీద్ రనౌట్. స్టోక్స్ షాట్ ని సాంట్నర్ ఫీల్డ్ చేసి బౌలింగ్ ఎండ్ లో బౌల్ట్ కి త్రో చేశాడు. అదే  గనుక స్ట్రైకింగ్ ఎండ్ కి బంతి విసిరి ఉంటే బహుశ స్టోక్స్ అవుటై ఉండేవాడు. రెండో పరుగులో రనౌట్ కనుక ఒక పరుగూ వచ్చింది, చివరి బంతిపై కూడా స్టోక్స్ కి స్ట్రైకింగ్ ఛాన్స్ దొరికింది.
చివరి బంతిపై రెండు పరుగులు చేస్తే విజయం. ఒక్క పరుగైతై టై. ఈ సారీ ఇంకో రనౌట్. మార్క్ వుడ్ రనౌట్. స్టోక్స్ మాత్రం కాదు. అందుకే స్టోక్స్ అజేయుడు. నూటికి నూరు పాళ్లూ అజేయుడు. మంటను మరింతగా భగభగా మండింపజేయడమే కానీ ఆరిపోనివ్వని అజేయుడు స్టోక్స్. ఈ రనౌట్ తో మ్యాచ్ మొదటి సారి టై అయింది.
తనకు తెలియకుండా, తన ప్రమేయం లేకుండా, తన బ్యాట్ కు తగిలి ఓవర్ త్రోగా బౌండరీ రావడంపై స్టోక్స్ అప్పటికప్పుడే, గ్రౌండ్ లో ఆ క్షణంలోనే న్యూజిలాండ్ కెప్టెన్ విలియమ్సన్ కు క్షమాపణలు చెప్పుకున్నాడు. నిబిడాశ్చర్యంలో నిస్సహాయంగా నిల్చున్న విలియమ్సన్ వేపు చూస్తూ, బ్యాట్ ను గుండెలకు హత్తుకుని స్టోక్స్ చేతులూపుతున్న దృశ్యాన్ని క్రిక్ బజ్ కామెంటేటర్స్ సరిగానే అర్థం చేసుకున్నారు.
ఫైనల్ ముగిశాక, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకుంటున్న సందర్భంలోనూ ఈ ఓవర్ త్రో గురించి స్టోక్స్ నొచ్చుకున్నాడు. క్రికెట్ ఆడుతున్నంత కాలం, అటు తర్వాత జీవితాంతం ఆ ఓవర్ త్రో సంఘటన తనను ముల్లులా గుచ్చుతూనే ఉంటుందని బాధ పడ్డాడు.
ఎవ్రీ డాగ్ హాజ్ ఇట్స్ డే అన్నట్టు ఈ ఒక్కసారికీ ఒక దిక్కుమాలిన ఓవర్ త్రో ప్రపంచకప్ లో జయాపజయాలను నిర్ణయించింది. అనవసరంగా అందరితో అడ్డదిడ్డంగా చిత్రవిచిత్రమైన భంగిమల్లో తన్నులు తినే ఓ నిర్జీవమైన బంతి కాస్త వెరైటీగా తనకు తానే బ్యాట్ మీదకు వెనుక నుంచి దాడి చేసి పారిపోయి బౌండరీ అవతలి నుంచి చూశారా ఎంత పని చేశానో అన్నట్టు మీసం మెలేసింది.
ఆ ఓవర్ త్రో పుణ్యమా అని నిర్ణీత ఓవర్లలో స్కోరు టై అయింది. ఇది క్లైమాక్స్ అనుకుంటే సూపర్ ఓవర్ లోనూ స్కోర్లు సమం కావడం యాంటీ క్లైమాక్స్. ప్రపంచకప్ రూల్స్ ప్రకారం ఇన్నింగ్స్ లో ఎక్కువ బౌండరీలు కొట్టిన (26-16) ఇంగ్లండ్ విజేత కాగా న్యూజిలాండ్ రన్నరప్ గా మిగిలింది.
క్రికెట్ మాది మా సొంతం అని గర్వపడే ఇంగ్లండ్ ఎట్టకేలకు తన ఆతిథ్యంలోనే మొట్టమొదటి సారిగా ప్రపంచ కప్ గెలుచుకోగలిగింది.
1975 నుంచి ఆరంభమైన వన్ డే ప్రపంచకప్ ను నాలుగు సార్లు తానే నిర్వహించినా, మూడు సార్లు ఫైనల్ కు చేరినా ఇంగ్లండ్ ఇప్పటిదాకా ఒక్కసారి కూడా గెలవలేక పోయింది. నిన్నటి విజయంతో వారి చిరకాల వాంఛితం నెరవేరింది.
నెలన్నర పాటు అభిమానుల్ని ఉర్రూతలూగించిన ప్రపంచ క్రికెట్ పండగ తొలి రోజుల్లో పోటీలు వర్షార్పణమవడం వల్ల కొంత నిరాశ కలిగించినా క్రమక్రమంగా కిక్కు తలకెక్కుతూ చివరికొచ్చేసరికి భారమితి బద్దలవుతుందేమో నన్నంతగా కిర్రెక్కించింది.
మైదానంలో ఆటగాళ్లతో పాటు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానుల్ని వివశుల్ని చేసి, ఉన్నట్టుండి అన్ని అంచనాలను తలక్రిందులు చేసిన ఆ అదృష్టపు ఓవర్ త్రో క్రికెట్ చరిత్రలో చెరగని స్మృతిగా కలకాలం గుర్తుండిపోతుంది.