కొనసాగుతున్న సిద్ధేశ్వరం పాదయాత్ర, గ్రామ గ్రామాన ఘన స్వాగతం

(యనమల నాగిరెడ్డి)

ఇటీవల ముగిసిన ఎన్నికలలో కళ్ళు చెదిరే అఖండ విజయం సాధించిన వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటుండగా, కరువు బరువు తో సతమతమతం అవుతూ నిరంతరం జీవన పోరాటం సాగిస్తున్న రాయలసీమ రైతాంగం కాబోయే ముఖ్యమంత్రికి తమ గోడు వినిపించుకోడానికి ఆయన బాటలోనే రంగంలోకి దిగి సిద్దేశ్వరం సాధన కోసం పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. రెండవ రోజు సాగుతున్న ఈ యాత్రకు గ్రామీణ ప్రజలు, ప్రత్యేకించి మహిళలు ఘనంగా స్వాగతం పలుకుతూ, తమ గ్రామ పొలిమేరల వరకూ సాగనంపుతూ తమ సంపూర్ణ మద్దతు తెలియచేస్తున్నారు.

రాయలసీమ సాగునీటి సమితి ప్రారంభించిన సిద్దేశ్వరం అలుగు నిర్మాణ ఉద్యమం ఆ తర్వాత రాయలసీమ ఉద్యమ సంఘాల సమన్వయసమితి నేతృత్వంలో గత మూడు సంవత్సరాలుగా బొజ్జా దశరథ రామిరెడ్డి నాయకత్వంలో కోనసాగుతున్నది.

నిన్న నంద్యాల పట్టణం ప్రధాన వీధుల గుండా పాదయాత్ర సాగి మూలమఠం చేరారు. మజ్జిగ స్వీకరించారు. కొత్తపల్లి గ్రామంలో రైతులు స్వాగతం పలికారు. అనంతరం ఎ.కోడూరు గ్రామం చేరారు. ప్రభాత్ కళాశాలలో మధ్యాహ్నం భోజనం చేసి విశ్రాంతి తీసుకొన్నారు. సాయంత్రం నాలుగు గంటలకు పాదయాత్ర ప్రారంభమైంది. పార్నపల్లె గ్రామంలో మహిళలు వీర కుంకుమతో స్వాగతం పలికారు. గ్రామసభ అనంతరం బండి ఆత్మకూరు గ్రామం , సంతజూటూరు గ్రామాలలో ప్రజలు ఘన స్వాగతం పలికారు. లింగందిన్నె క్రాస్ లో రైతులు స్వాగతించారు. చివరగా పెద్దదేవళాపురం ముగించుకొని అభయాంజనేయ స్వామి అలయంలో భోజనాలు చేసి, రాత్రి విశ్రాంతి తీసుకొన్నారు.

దారి పొడవున గ్రామాల ప్రధాన కూడలలో సీమ నీటి విషయాలను, సిద్దేశ్వరం ఆవశ్యకతను సీమ ప్రజా సంఘాల నాయకులు వివరించారు. గ్రామ నాయకులతో మాట్లాడించారు. 31 న సిద్దేశ్వరం అలుగు వద్దకు అందరం పాల్గొంటామని ఉద్యమ స్ఫూర్తితో పచ్చ జెండా స్వీకరించారు. ఆయా గ్రామాలలో స్వచ్చందంగా చల్లని నీరు, మజ్జిగను పాదయాత్రీకులకు అందచేసారు. కళాకారులు సీమ పాటలతో ఉద్యమానికి ప్రోత్సాహం అందించారు

2016 మే 31న హాజరైన అశేష ప్రజానీకం సమక్షంలో ప్రజల చేత శంఖుస్తాపనకు నోచుకున్న ఈ ప్రాజెక్ట్ ప్రతిపాదనను చంద్రబాబు ప్రభుత్వం పరిశీలిస్తున్నదని టీడీపీ వర్గాలు ప్రచారం చేసినా, ఆ తర్వాత ప్రభుత్వం ఈ ప్రతిపాదనను చెత్తబుట్ట పాలు చేసింది. అప్పటినుండి ప్రతిసంవత్సరం సిద్దేశ్వరం శంఖుస్థాపన చేసిన మీ 31న ఆ ప్రాజక్టు ఆవశ్యకతను, అత్యవసరాన్ని గురించి ప్రభుత్వానికి చెప్పడానికి, ప్రజలకు వివరించడానికి ఉద్యమకారులు దశరధ నేతృత్వంలో ఎదో ఒక కార్యక్రమం చేపట్టి “గొంతు చించుకుంటూ చెవిటి ముందు శంఖం ఊదుతూనే” ఉన్నారు. ఆ క్రమంలో భాగంగా ఈ సంవత్సరం పాదయాత్ర పేరుతొ మరోసారి రైతులు తమ శంఖాలను పూరించారు.

కొన్ని వేలమందితో మంగళవారం నంద్యాలలో ప్రారంభమైన ఈ యాత్ర ఇప్పటికే సుమారు 35 కిలోమీటర్లు పూర్తి చేసింది. ఈ యాత్ర నంద్యాల నుండి ఆత్మకూర్ బస్టాండ్, మూలమట్టం, ఏ. కోడూరు, పార్నపల్లె, బండి ఆత్మకూరు పెద్ద దేవాలాపురం మీదుగా మొదటి రోజు సాగింది. రెండవ రోజు మోత్కురు, బోయరేవుల, వెలుగోడు, 1 ఆర్ తూము, మీదుగా మధ్యాహ్నానికి స్మృతివనం చేరుకున్నది. ఈ రోజు రాత్రికి ఈ యాత్ర నల్లకాల్వ, బ్రహ్మానంతపూర్ ల మీదుగా ఆత్మకూరు చేరుకుంటుంది.

మండే ఎండలలో వందలాదిమంది రైతులతో సాగుతున్న ఈ యాత్రకు గ్రామ గ్రామాన ప్రజలు ఘనంగా స్వాగతిస్తూ, వీడ్కోలు పలుకుతున్నారు. మహిళలు హారతులిస్తూ, వీర తిలకం దిద్దుతూ రైతులకు తమ మద్దతు పలుకుతున్నారు.

కొత్తగా ఏర్పడే జగన్ ప్రభుత్వమైనా తమ గోడు పట్టించుకోవాలని, రాయలసీమ, మహబూబ్ నగర్ అవసరాలు తీర్చగల ఈ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని చేపట్టాలని రైతులు, రైతు సంఘాలు, ఉద్యమ సంఘాలు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *