జగన్ ముందుకు రాయలసీమ డిమాండ్లు…

(యనమల నాగిరెడ్డి)
ముఖ్యమంత్రి వైఎస్  జగన్మోహన్ రెడ్డి ముందకు రాయలసీమ డిమాండ్లను తీసుకువెళ్లేందుకు సీమ నేతలు చర్యలుతీసుకుంటున్నారు.
2019 సార్వత్రిక ఎన్నికలలో రాయలసీమ నుండి అఖండ మెజారిటీతో అత్యధిక సంఖ్యలో గెలిచిన ఎంఎల్ఏలు, ఎంపీల ద్వారా ముఖ్యమంత్రికి ఈ ప్రాంతం గోడు వినిపించడానికి  రాయలసీమ ఉద్యమసంఘాల సమన్వయ వేదిక ప్రణాళిక సిద్ధం చేసింది.
అందులో భాగంగా సీమ లోని నాలుగు జిల్లాల నుండి ఎక్కడికక్కడ ఉద్యమకారులు ఈ వినతి పత్రాలను ప్రజాప్రతినిధులకు అందచేసి ప్రాంత అవసరాలను గురించి వారికి వివరించడం, సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సమితి సమన్వయకర్త బొజ్జా  దశరథ రామిరెడ్డి నిర్ణయించారు.
ఈ ప్రాంతాన్ని సంక్షోభం నుండి బయట పడవేయడానికి ఇక్కడి  సహజవరుల సక్రమ వినియోగానికి విధానాలు రూపొందించడం, గతంలో చేసుకున్న ఒప్పందాలను గౌరవించి  నిర్మాణంలోఉన్న ప్రాజెక్టులను పూర్తిచేసి నీళ్లు కేటాయించి  ఈ ప్రాంత అభివృద్ధికి నిర్దిష్ట కార్యాచరణ చేపట్టాలని వారు ఆ వినతి పత్రంలో కోరారు.
ఇవీ డిమాండ్లు
1.రాయలసీమలోని సుమారు 90 లక్షల ఎకరాల వ్యవసాయ యోగ్య భూమికి, ఈ  ప్రాంతంలో నిర్మించిన పెద్ద, మద్య, చిన్న నీటి ప్రాజక్టుల ద్వార కేవలం 19.27 లక్షల ఎకరాలకు (వ్యవసాయ యోగ్య భూమి లో 21.41 శాతం) మాత్రమే సాగునీటి వసతి కలుగ చేసినా,అందులో  సగ భాగానికి   కూడా  నీరు సరఫరా చేయడం లేదు. గత పది సంవత్సరాలలో ఇక్కడ  సాగునీరు పొందిన భూములు కేవలం 7.98 లక్షల ఎకరాలు (వ్యవసాయ యోగ్య భూమిలో 8.86 శాతం) మాత్రమే.
2. కరువు సీమకు, రాష్ట్రంలోని మిగిలిన మెట్టప్రాంతాలకు వై ఎస్ రాజశేఖర రెడ్డి  ముఖ్య మంత్రిగా 2004 లో  జలయజ్ఞం ద్వారా కృష్ణ నది మిగుల జలాలపై  “హంద్రీ – నీవా, గాలేరు – నగరి, వెలిగొండ, తెలుగు గంగ చేపట్టారు. నదీజలాల వివాదంలో చిక్కుకున్న ఈ ప్రాజెక్టులను ఆడుకోడానికి గోదావరి జలాలను కృష్ణకు   మళ్ళించడమే మార్గమని అందులో భాగంగా ప్రతిపాదించిన పోలవరం ప్రాజక్టు జాతీయ ప్రాజెక్ట్ కాగా, “దుమ్మగూడెం- నాగార్జున సాగర్ టైల్ పాండ్” ప్రాజక్టును ప్రక్కన పెట్టారు.
3.  శ్రీశైలం నిర్మించినపుడు నిర్ణయించిన పద్దతిలో   కనీస నీటి మట్టాన్ని  854 అడుగులకు పునరుద్దరించాలి. శ్రీశైలం  బాక్ వాటర్ నుండి ఎస్ ఆర్ బి సి, తెలుగు గంగ, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా సీమకు నీళ్లిచ్చే అవకాశం కలిగించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ లొ  రాయలసీమ ప్రాజక్టులకు చట్టబద్దంగా ఆ నీటిని కేటాయించాలి.
4. పులిచింతల నిర్మాణం ద్వారా  54 టిఎంసిల కృష్ణ నీటిని, చింతలపూడి ద్వారా ఆదా అయ్యే 32 టిఎంసిల కృష్ణా జలాలను, “పట్టిసీమ ద్వారా ఆదా అయిన 45 టి ఎం సిలను”, శ్రీశైలం రిజర్యయర్ కు క్యారి రిజర్వుగా ట్రిబ్యునల్ కేటాయించిన  60 టి ఎం సి ల నీటిని రాయలసీమకు చట్టబద్దంగా కేటాయించాలి.   అలాగే  కృష్ణా జలాలలను ప్రాంతాల వారీగా  పునః పంపిణి చేయాలి.
5. దుమ్ముగూడెం నాగార్జున సాగర్ టైల్ పాండ్ ప్రాజక్టును జాతీయ ప్రాజక్టుగా మార్పించాలని, ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలలో కృష్ణా, తుంగభద్ర నదులపై నిర్మాణంలో ఉన్న అన్ని  ప్రాజక్టులకు నికర జలాల కేటాయించడానికి శ్రీశైలం రిజర్వాయర్ కు దిగువనున్న ప్రాజక్టులకు గోదావరి జలాలు మళ్ళించే విధంగా నిర్ణయాలు తీసుకోవాలి.
6. గతంలో కేటాయించిన నీటిని సక్రమంగా అందించడానికి 20 టిఎంసిల సామర్థ్యంతో  “గుండ్రేవుల రిజర్వాయర్”, తుంగభద్ర  “ఎగువ సమాంతర కాలువ”, “వేదివతిపై బ్యారేజి నిర్మాణంతో పాటు ఎత్తిపోతల పథకం”,  ఆలూరు, మొలగవెల్లిలలో 4 టి ఎం సి ల సామర్థ్యంతో రిజర్వాయర్లు నిర్మించాలల.  సిద్దేశ్వరం అలుగు నిర్మించి,  “హంద్రీ నీవా ప్రధాన కాలువ సామర్థ్యాన్ని  8000 క్యూసెక్కులకు పెంచాలి.
7.శ్రీభాగ్ ఒప్పందం మేరకు   అంధ్రప్రదేశ్ రెండవ రాజధాని,  హైకోర్ట్  రాయలసీమలో ఏర్పాటు చేయాలి. కోస్తా ప్రాంతంతో సమానంగా రాయలసీమ ప్రాంతానికి ప్రజా ప్రతినిధుల ప్రాతినిధ్యం పెంచాలి.  పారిశ్రామిక అభివృద్దికి హైద్రాబాద్ – కర్నూలు – బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్, చెన్నై – తిరుపతి – బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ లను ఏర్పాటు చెయ్యాలి. మైనింగ్ యూనివర్శిటీని సీమలో నెలకొల్పాలి . గతంలో రాయలసీమలోఉన్న  మార్కాపురం రెవిన్యూ డివిజన్ ను కలపి సీమను 10 జిల్లాలుగా విభజించాలి.
8. చిత్తూరు జిల్లా మన్నవరంలో ప్రారంభమై నిలిచిపోయిన బెల్ & ఎన్టిపిసిని కొనసాగించాలి.
9.  రాజధాని ప్రాంతాన్ని  ఫ్రీజొన్ చేసి రాయలసీమ వాసులకు కూడా సమాన ఉద్యోగ అవకాశాలు కల్పించాలి.
10. ముఖ్యమంత్రి ప్రకటించిన విధానం మేరకు ఇక్కడ ఉన్న  TTD లాంటి  ధార్మిక సంస్థలలో పాటు అన్ని సంస్థలలో 75% ఉద్యోగాలు  స్థానికులకే ఇవ్వాలి.