రాజకీయ పద్మవ్యూహంలో రాయలసీమ

రాయలసీమ సాగునీటి సాధన సమితి మరియు రాయలసీమ ప్రజా సంఘాల సమన్వయ వేదిక ఆద్వర్యంలో సెప్టెంబర్ 15, 2019 ఆదివారం నంద్యాల లోని స్థానిక మధుమణి కాన్ఫరెన్స్ హాలు లో రాయలసీమ ప్రజాసంఘాల సమన్వయ వేదిక కన్వీనర్‌ బొజ్జా దశరథరామిరెడ్డి అధ్యక్షతన జరిగిన “రాజకీయ పద్మవ్యూహంలో రాయలసీమ-మన కర్తవ్య, కార్యాచరణ” పై రాయలసీమ నాలుగు జిల్లాలనుండి వచ్చిన ప్రజా సంఘాల నాయకులతో సమాలోచనలు జరిగాయి.
ఈ సదస్సులో క్రింది తీర్మానాలను, కార్యాచరణను ఏక గ్రీవంగా ఆమోదించడం జరిగింది.
రాజకీయ పార్టీల స్వార్థ రాజకీయాలు, అధికారలాలసవల్ల రాయలసీమ గత అనేక దశాబ్దాలుగా బలి పశువు అయింది. మద్రాసు రాష్ట్రం నుండి ప్రత్యేక తెలుగు రాష్ట్రం గా ఏర్పడటానికి జరిగిన పోరాటాలు, అప్పట్లో రాయలసీమ, కోస్తాంధ్ర నాయకుల మద్య కుదిరిన పెద్దమనుషుల ఒప్పందం “శ్రీబాగ్ ఒడంబడిక” అమలులోనూ రాయలసీమ ప్రాంతం రాజకీయ నాయకుల వలన తీవ్రంగా నష్టపోయింది.
జాతీయ రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, బిజేపి, CPI,CPI(M ) లు గత ఏడు దశాబ్దాలుగా రాయలసీమ కు తీరని ద్రోహం చేసాయి. ప్రాంతీయ ప్రయోజనాలకోసం ఏర్పడినామని చెప్పుకుంటున్న టిడిపి రాయలసీమకు తీరని ద్రోహం చేయగా, రాజకీయ అవసరాలకొసం పుట్టిన వై.యస్.ఆర్ కాంగ్రెస్ కూడా గతంలో వున్న పార్టీల వైఖరినే అనుసరిస్తున్నది.
రాయలసీమ వెనుకబడినదనీ, ప్రజలు కరువు కాటకాలతో సతమతమవుతున్నారనీ, వారిని ఆదుకోవలసిన అవసరం ఉందనీ, అన్ని రాజకీయ పార్టీలు సమావేశాల్లోనూ, పత్రికా ప్రకటనలలోనూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేయడం నాయకులు ఆనవాయితీ గా మారింది.
తీర్మానాలు:
ప్రజల జీవనం నానాటికీ దుర్భరంగా మారిన పరిస్థితులను చక్కదిద్దడానికి రాయలసీమ కోసం చేపట్టి అమలు చేయవలసిన అంశాలపై రాజకీయ పార్టీలు స్పష్టమైన వైఖరి ప్రకటించాలని ఈ సమావేశం ఏకగ్రీవంగా తీర్మనించడమైనది.
అలాగే రాయలసీమ సమస్యల పరిష్కారానికి అన్ని రాజకీయ పార్టీలు తమ కార్యాచరణను ప్రకటించాలని సమావేశం డిమాండ్ చేసింది.
1937 లో రాయలసీమ, కోస్తాంధ్ర పెద్దమనుషులు కుదుర్చుకున్న శ్రీబాగ్ ఒడంబడిక పై రాజకీయ పార్టీలు తమ స్పష్టమైన వైఖరి ప్రకటించాలి.
శ్రీబాగ్ ఒడంబడిక మేరకు రాయలసీమ లో హైకోర్టు ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను కోరుతూ సమావేశం తీర్మానించింది.
శాసనసభలో సంఖ్యా బలం అధికంగా ఉన్న ప్రాంతాలు తక్కువ సంఖ్యా బలం ఉన్న ప్రాంతాలను అన్యాయం చేయకుండా నిరోధించడానికి 1937 లో కుదిరిన శ్రీబాగ్ ఒప్పందం మేరకు రాయలసీమ, నెల్లూరు జిల్లాలకు కోస్తాంధ్ర ప్రాంతంతో సమానంగా శాసనసభ లో ప్రాతినిధ్యం కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతూ సమావేశం తీర్మానించింది.
జల విద్యుత్ ప్రాజెక్టు గా వున్న శ్రీశైలం ప్రాజెక్టును సాగునీటి ప్రాజెక్టు గా మార్చి, రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు, దక్షిణ తెలంగాణ జిల్లాలైన మహబూబ్ నగర్ , నల్గొండ జిల్లాల సాగు, త్రాగునీటి వినియోగం కోసం కేటాయించాలి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టం 2014 షెడ్యూల్11లో చేర్చిన “హంద్రీ-నీవా, గాలేరు- నగరి, తెలుగుగంగ, వెలిగొండ, తెలంగాణ రాష్ట్రములోని కల్వకుర్తి-నెట్టంపాడు” ప్రాజెక్టులకు కావలసినన్ని నిధులు కేటాయించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యుద్దప్రాతిపదికన పూర్తి చేయాలి.
రాయలసీమ లోని అత్యంత కరువు పీడిత ప్రాంతమైన కర్నూలు జిల్లా పశ్చిమ మండలాలు, అనంతపురం జిల్లా, కడప జిల్లాలోని రాయచోటి, లక్కిరెడ్డిపల్లె ప్రాంతాలు, చిత్తూరు జిల్లా లోని మెట్ట ప్రాంతాలు దాదాపు 30 లక్షల ఎకరాల భూమి కేవలం వర్షాదారం పైనే వున్నది. ఈ ప్రాంతంలో సాగునీరు, త్రాగునీరు ఇవ్వడానికి హంద్రీ-నీవా ప్రాజెక్టు కాలువను 33000 క్యూసెక్కుల సామర్థ్యంతో అభివృద్ధి చేయాలి.
పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని ప్రస్తుతము ఉన్న 44000వేల క్యూసెక్కుల సామర్థ్యం నుండి 75000వేల క్యూసెక్కుల సామర్థ్యానికి పెంచాలి. దీనికి అనుసంధానం గా వున్న SRMC ప్రధాన కాలువను 75000 వేల క్యూసెక్కుల సామర్థ్యం తో నిర్మాణం చేయాలి.
భానకచర్ల క్రాస్ రెగ్యులేటర్ నుండి వెళ్ళే ప్రధాన కాలువలైన తెలుగుగంగ, SRBC, K.C.కెనాల్, గాలేరు –నగరి, మద్రాస్ కాలువ సామర్థ్యాలను పెంచాలి.
ఈ నీటి నిల్వలకు అవసరమైన రిజర్వాయర్ లను నిర్మించాలి.
50 TMC ల సామర్థ్యం తో సిద్దేశ్వరం అలుగు నిర్మించాలి.
కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు కు రాష్ట్ర ప్రభుత్వం స్థలం కేటాయించాలి. కేంద్ర ప్రభుత్వం SAIL ఆద్వర్యంలో ఉక్కు కర్మాగారాన్ని నిర్మించి స్థానికులకు ఉద్యోగాలను కల్పించాలి.
తుంగభద్ర వరద కాలువ మ్యాలిగనూరు నుండి కొత్తపల్లి మండలం వరకు చేపట్టాలి. RDS కుడి కాలువకు అనుసంధానం గా ఈ కాలువ నిర్మాణం చేపట్టాలి. ఈ కాలువ నిర్మాణం ద్వారా కరువు పీడిత రాయలసీమ లో చెరువులకు నీరందించడం, హంద్రీ-నీవా కు నీటిని అందించే నిర్మాణాలు చేపట్టాలి.
వేదవతి నదిపై గూళ్యం దగ్గర బ్యారేజి నిర్మాణం చేపట్టాలి. ఈ బ్యారేజి నుండి ఎత్తిపోతల తో LLC స్థిరీకరణ చేపట్టాలి. ఆలూరు -మొలగవెల్లి లో 4 TMC ల సామర్థ్యం తో రెండు రిజర్వాయర్ నిర్మాణం చేపట్టి గూళ్యం బ్యారేజి నుండి ఎట్టిపోతలతో నీరు అందించాలి.
కేసి కెనాల్ స్థిరీకరణ కోసం, కర్నూలు నగర త్రాగునీటి అవసరాల కోసం గుండ్రేవుల వద్ద 20 TMC ల సామర్థ్యం తో రిజర్వాయర్ నిర్మించాలి.
రాజధాని ప్రాంతాన్ని “ఫ్రీ జోన్” ప్రాంతంగా ప్రకటించి , రాయలసీమ ప్రాంత యువతకు సమానంగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలి.
రాష్ట్ర విభజన చట్టం లో పేర్కొన్న జాతీయ స్థాయి వ్యవసాయ విశ్వవిద్యాలయం ను కర్నూలు జిల్లా తంగడంచె వద్ద ఏర్పాటు చేయాలి.
AIMS ను అనంతపురం లొ ఏర్పాటు చేయాలి.
రాష్ట్ర స్థాయి కార్యాలయాలను అభివృద్ధి వికేంద్రీకరణ లో భాగంగా రాష్ట్రంలో ని అన్ని జిల్లాలలో సమ ప్రాధాన్యత తో ఏర్పాటు చేయాలి.
కర్నూలు జిల్లా ను సీడ్ హబ్ గా మార్చడానికి APSSDC, APSSCA ఇతర అనుబంధ సంస్థలను కర్నూలు జిల్లా లో ఏర్పాటు చేయాలి.
కడప జిల్లా తుమ్మల పల్లిలో కేంద్ర ప్రభుత్వం ఆద్వర్యంలో నడుస్తున్న యురేనియం, మైనింగ్ అండ్ ప్రాసెసింగ్ యూనిట్ ని తక్షణమే మూసివేయాలి, నల్లమల అటవీ ప్రాంతంలో యురేనియం త్రవ్వకాలకొరకు కేంద్ర ప్రభుత్వ UCIL ( Urenium Corporation Of India Limited ) సంస్థ కిచ్చిన అనుమతులను రద్దుచేయాలి
కార్యాచరణ ప్రతిపాదనలు:
ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినంగా అక్టోబర్ 1 న రాయలసీమలోని అన్ని మండల కేంద్రాలలో, కళాశాలలలో కార్యక్రమాలు నిర్వహించడం.
ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినంగా అక్టోబర్ 1 న నిర్వహించమని అన్ని రాజకీయ పార్టీలకు వినతి పత్రాలు అందచేయ్యడం.
శ్రిబాగ్ ఒడంబడిక దినోత్సవం నవంబర్ 17 వరకు శ్రిబాగ్ ఒప్పందం పై ప్రజా చైతన్య కార్యక్రమాలు అన్ని గ్రామాలలో, పట్టణాలలో, కళాశాలలలో నిర్వహించడం.
శ్రిబాగ్ ఒడంబడికబదిక దినోత్సవం అన్ని జిల్లా కేంద్రాలలో గణంగా నిర్వహించడం. రాజకీయ పార్టీలను MLA, MP, MLC లను ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం.