సిద్ధేశ్వరం అలుగు కట్టిండి, లేదా అనుమతిస్తే జోలె పట్టి కట్టుకుంటాం

(యనమల నాగిరెడ్డి)
రాయలసీమ వాసుల చిరకాల కోరికగా ఉండి నేటికీ తీరని కలగా మిగిలిన సిద్దేశ్వరం అలుగు నిర్మాణాన్ని వెంటనే ప్రారంభించి రాయలసీమ నాలుగు జిల్లాల తో పాటు నెల్లూరు, ఒంగోలు, తెలంగాణాలోని మహబూబ్ నగర్ జిల్లాల ప్రజలకు తాగు, సాగు నీటి కస్టాలు తొలగించాలని రాయలసీమ సాగునీటి సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథ రామి రెడ్డి డిమాండ్ చేశారు. అలాకాకపోతే  ప్రభత్వం అనుమతిస్తే తాము జోలె పట్టి నిధులు సమీకరించి ప్రాజెక్ట్ ను నిర్మించుకుంటామని ఆయన ప్రకటించారు.
సిద్ధేశ్వరం అలుగు నిర్మాణం కోసం 2016 మే 31న రైతులు  శంఖుస్థాపన చేసిన విషయం పాఠకులకు విదితమే. అప్పటినుండి ఈ ప్రాజెక్ట్ సాధన కోసం సాగునీటి సమితి అధ్వర్యంలో వివిధ పద్దతులలో ఆందోళనలు సాగిస్తున్న విషయం కూడా పాఠకులకు తెలుసు. అందులో భాగంగా ఈ సంవత్సరం మే 28 నుండి 31 వరకు నాలుగు రోజుల పాటు నంద్యాల నుండి సిద్దేశ్వరం వరకు 100 కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహించారు. యాత్ర ముగింపు సభలో దశరథ మాట్లాడుతూ ఈ అలుగు నిర్మాణంవల్ల  కృష్ణ, గుంటూరు జిల్లాల ఆయకట్టుకు ఎలాంటి నష్టం వాటిల్లదని, 7 కరువు జిల్లాల ప్రజలకు సాగునీరు, తాగు నీరు అందించడానికి అవకాశాలు మెరుగు పడగలవని ఆయన స్పష్టం చేశారు. కృష్ణా నది నుండి వృధాగా సముద్రంలోకి పోతున్న నీటిని ఒడిసి పట్టి కరువు ప్రాంతాలను ఆదుకోవచ్చునని ఆయన అన్నారు.
గతంలో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి హయాంలో సిద్ధేశ్వరం అలుగుతో పాటు ఓవర్ బ్రిడ్జి నిర్మించడానికి 110 కోట్ల ఖర్చుతో సోమశిల వద్ద శంఖుస్థాపన చేశారని ఆయన గుర్తు చేశారు. ఈ అలుగు నిర్మాణం వల్ల ఈ ప్రాంతం పర్యాటక కేంద్రంగా కూడా అభివృద్ధి చెందుతుందని అన్నారు.
మహారాష్ట్ర నుండి యాత్రకు సంఘీభావం తెలపడం కోసం వచ్చిన అనిల్ కుమార్ మాట్లాడుతూ తమ ప్రాంతం కూడా కృష్ణ బేసిన్ లోనే ఉందని అయినా తాము తాగు, సాగు నీటికి అల్లాడుతున్నామని ఆవేదన వ్యకతం చేశారు. తమ రాష్ట్రంలో ఉన్న కోయినా ప్రాజెక్ట్ నుండి విద్యుత్ ఉత్పత్తి పేరుతొ ప్రతి సంవత్సరం 200 టిఎంసిల నీళ్లు సముద్రం పాలు అవుతున్నాయని, ఈ నీటిని మళ్లిస్తే నీటి కస్టాలు తొలగి పోగలవని అనిల్ అభిప్రాయపడ్డారు. కరువు ప్రాంతాల రైతుల కస్టాలు తొలగించడానికి  జరుగుతున్న ఈ ఉద్యమానికి ఆయన  సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
అనంతపురం జలసాధన సమితి కన్వీనర్, న్యాయవాది రాంకుమార్ మాట్లాడుతూ గత చంద్రబాబు ప్రభుత్వం ప్రకటనలతో కరువు ప్రాంతాలను మోసగించిందని, ప్రస్తుత ప్రభుత్వమైనా  రాయలసీమ కరువును శాశ్వతంగా నివారించడానికి చర్యలు తీసుకోవాలని, అందులో భాగంగా సిద్ధేశ్వరం అలుగు నిర్మాణంతో పాటు సీమలో ఇప్పటికే నిర్మాణంలో ఉన్న అన్ని నీటి ప్రాజెక్ట్ లను పూర్తీ చేసి నీటి వసతి కల్పించాలని విజ్ఞప్తి చేశారు. కరువుకు కన్నతల్లిగా ఉన్న ఈ ప్రాంతమైన ముఖ్యమంత్రి ప్రత్యేక ద్రుష్టి పెట్టాలని ఆయన కోరారు.
రాయలసీమ సమగ్ర అభివృద్ధికి అవసరమైన అన్ని అంశాలతో కలిపి సమగ్ర ప్రణాళిక తయారు చేసి సీమలో గెలుపొందిన 49 మంది ఎంఎల్ ఏ లకు, ఎంపీ లకు అందచేసి వారిని కార్యోన్ముఖులను చేయాలని రాయలసీమ కార్మిక కర్షక సమితి నాయకుడు నాగిరెడ్డి కోరారు. రాయలసీమకోసం  ఆరాటపడుతున్న సంఘాలను, నాయకులను,రైతులను ,రాజకీయపక్షాలను కలుపుకొని సంయుక్తంగా పనిచేయాలని ఆయన కోరారు.  తెలంగాణా ముఖ్యమంత్రి  కేసీఆర్ అందించిన స్నేహ హస్తాన్ని అందుకోవడంలో వెనుకడుగు వేయకుండా, కృష్ట నాదీ జల వివాదాలను సామరస్యంగా పరిష్కరించుకుంటూ, గోదావరి  జలాలను మళ్లించి ఈ ప్రాంతంలో ప్రజలు బ్రతకడానికి తాగునీరు, ఒక్క ఆరుతడి పంటకైనా సాగునీరు అందించడానికి చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రిని కోరారు.
మే 28న ప్రారంభమైన ఈ యాత్రకు గ్రామగ్రామాన ప్రజలు అన్ని వసతులు కల్పిస్తూ నీరాజనం పట్టారు. 100 కిలోమీటర్లమేర సాగిన ఈ యాత్ర రెండు నియోజకవర్గాలలోని 5 మండలాల గుండా సాగి 25 రెవిన్యూ గ్రామాల మీదుగా 31న సిద్దేశ్వరం చేరుకున్నది. ఈ యాత్రలో రాయలసీమ నాలుగు జిల్లాల రైతులయొ పాటు, నెల్లూరు, మహబూబ్ నగర్, కృష్ట్ణ జిల్లాల నాయకులు, మహారాష్ట్ర, ఒరిస్సా రాష్ట్రాల రైతు నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *