బిజెపిని ఎలా ఢీ కొనాలో ప్రియాంకకు తెలుసా?

 

ప్రియాంక గాంధీ  ఫుల్ టైం రాకీయాల్లోకి రావడంతో ఒక వైపు కాంగ్రెస్ కార్యకర్తులు సంబరాల్లో మునిగిపోయి ఉంటే, మరొక వైపు  సార్వత్రిక  ఎన్నికలకు మూన్నెల్లే మయం ఉన్నపుడు ప్రియాంకను కీలకమయిన తూర్పు ఉత్తర ప్రదేశ్ కాంగ్రెస్ ఇన్ చార్జ్ ను చేసి  పార్టీ సాహసం చేసిందా? అనే ప్రశ్న వినబడుతూ ఉంది. ఇది చాలా రిస్కీ జాజ్ అని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు.

కాంగ్రెస్ నాయకత్వంలో ఈ జంకు కనిపించడం లేదు.  ఆమె సమర్థవంతురాలిగా,  ఉత్తర ప్రదేశ్ తరహా బిజెపి రాజకీయాలకు జడిసే మనిషి కాదని చెబుతున్నారు. ఎందుకంటే, 1999లొో ఉత్తర ప్రదేశ్లో కేంద్రంలో బిజెపి అధికారంలో ఉన్నపుడే  ఆమె ఎన్నికల  ప్రచారం చేసి విజయవంతమయ్యారు. ఇపుడిదే పునారవృతమంది. కేంద్రంలో రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వాలున్నాయి. అలాంటపుడు ఎలా  ప్రచారం చేయాలో ఆమెకు తెలుసన్న ధీమా పై స్థాయి నాయకత్వంలో కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ లో ఎం జరిగిందో, జరుగుతున్నదో చూద్దాం.

125 ఏళ్ల చరిత్రగల కాంగ్రెస్ పార్టీ 2019 పార్లమెంటు ఎన్నికలకు ముందు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించింది. కాంగ్రెస్ విజయావకాశాలను గొప్పగా పెంచుకునేందుకు వీలుగా ప్రియాంక గాంధీ వద్రాను రాజకీయగోదాలోకి తీసుకువచ్చింది. రెండు దశాబ్దాలుగా కాంగ్రెస్ కు ఆధిపత్యం వహిస్తున్న శ్రీమతి సోనియాగాంధీ ఈ విషయంలోనూ తన రాజకీయ చతురత ప్రదర్శించారు. ప్రియాంక రాజకీయ రంగ ప్రవేశానికి ఇదే సరైన సమయం అని భావించారు. నిజానికి ప్రియాంక గాంధీ కాంగ్రెస్ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనాలని, కీలక పదవులు చేపట్టాలని, పార్టీ ప్రచారం పగ్గాలు చేపట్టాలని చాలా కాలంగా పార్టీ కార్యకర్తలు, నాయకులు డిమాండ్ చేస్తూ వచ్చారు. కానీ, సోనియా గాంధీ ప్రియాంక రాజకీయాల్లోకి రావడం పట్ల కాస్త విముఖత చూపారు. కుటుంబానికే పరిమితం చేశారు. అయితే, ఇంతవరకు  రాయ్ బరేలీ, అమేధీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ప్రచారానికే ప్రియాంక సేవలను వినియోగించుకున్నారు.

ఇందిరాగాంధీ పోలికలు ఎక్కువగా ఉన్నప్రియాంక రాజకీయ ప్రచారం చేపడితే, మహిళలు, బడుగు బలహీనవర్గాలను ఆకట్టుకోగలరనే భావన జనంలో ఉంది.అదే విధంగా ఆమె వస్తే అగ్రకులాల వోట్ల కూడా రావచ్చనే అశ కూడా కాంగ్రెస్ లో ఉంది. దీనితో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ  ఉత్తరప్రదేశ్ లో ముఖ్యంగా తూర్పు ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ కార్యదర్శిగా నియమించారు. ప్రియాంక వచ్చే ఎన్నికల్లో తూర్పు ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రధాన ప్రచారకురాలిగా దృష్టి కేంద్రీకరించాల్సి ఉంటుంది. తూర్పు ఉత్తరప్రదేశ్ లోనే ప్రధాని నరేంద్రమోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాశి, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రాతినిథ్యం వహిస్తున్న గోరఖ్ పూర్ నియోజకవర్గాలు ఉన్నాయన్నది గమనించాల్సిన విషయం.

ఇంత కాలం ప్రియాంక రాజకీయ ప్రవేశాన్ని కాదన్న సోనియాగాంధీ ఇప్పుడు ఎందుకు అంగీకరించారంటే అందుకు చాలా కారణాలు ఉన్నాయి. సోనియా మొదటి నుంచి రాహుల్ గాంధీనే కాంగ్రెస్ ప్రధాన నేతగా నిలపాలని భావించారు. రాహుల్ తోపాటు ప్రియాంకను రంగప్రవేశం చేయిస్తే, ఇద్దరూ  నాయకత్వానికి పోటీ పడుతున్నారనే భావన కాంగ్రెస్ శ్రేణులలో కలిగే అవకాశం ఉన్నందున ప్రియాంకను దూరం పెట్టారు. ఈ ఐదారు ఏళ్లలో రాహుల్ గాంధీ ఎంపీగా, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ అధ్యక్షుడుగా ఒక్కో మెట్టు ఎదుగుతూ వచ్చారు. రాజకీయవేత్తగా రాటుదేలారు. రాహుల్ పార్టీ ఉపాధ్యక్షుడుగా, ప్రెసిడెంట్ గా ఉన్న సమయంలో కాంగ్రెస్ వరుస ఓటములు చవిచూసింది. ఐరెన్ లెగ్ అనే పేరు పడింది. కానీ, ఇటీవల కాలంలో అటు కర్ణాటకలోనూ, ఇటు రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్ లలో కాంగ్రెస్ విజయ పరంపర సాధించడంతో ఆ అపకీర్తి తొలగింది. ఈ రాష్ట్రాల్లోపార్టీని విజయ పథంలో నిలపడంలో రాహుల్ నిర్విరామంగా కృషి చేసి కాంగ్రెస్ శ్రేణులందరి మన్ననలు పొందాడు. బలమైన రాజకీయ వేత్త అని తనను తాను నిరూపించుకున్నాడు. అంతే కాదు. ప్రధాని మోడీపై విమర్శనాస్త్రాలు సంధించడంలో ముందంజలో నిలిచి ప్రపంచ ప్రజలందరి దృష్టి ఆకట్టుకున్నాడు.రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలులో అవినీతిపై రాహుల్ చేసిన ప్రసంగాలు, సంధించిన విమర్శనాస్త్రాలు.. అధికార పార్టీకి  ముచ్చెమటలు పట్టించాయి.

ఇప్పుడు ప్రియాంక రాజకీయప్రవేశం చేయడం వల్ల రాహుల్ కు సహాయంగానే ఉంటుంది తప్ప పోటీ అన్న ప్రసక్తి రాదు. అందువల్లనే ప్రియాంక రాజకీయ రంగ ప్రవేశానికి ముహూర్తం కుదిరింది. ఉత్తరప్రదేశ్ లో ఇటీవల కాంగ్రెస్ ప్రాముఖ్యాన్ని బేఖాతర్ చేస్తూ, సమాజ్ వాదీ పార్టీ, బహుజన సమాజ్ పార్టీ ప్రత్యేక కూటమిగా ఏర్పడ్డాయి. కాంగ్రెస్ అడగకపోయినా కేవలం 2 సీట్లు( రాయ్ బరేలీ, అమేధీ) ముష్టి వేస్తున్నట్లు ఆపార్టీకి కేటాయించి ఓ విధంగా 125 ఏళ్ల పార్టీని అవమాన పరిచాయి. ఈ అవమానాన్ని సోనియాగాంధీ, రాహుల్ గాంధీ తీవ్రంగానే పరిగణించారనడానికి ఈ నిర్ణయం మరో ఉదాహరణ.

ఉత్తరప్రదేశ్ లో గెలిచిన పార్టీ కేంద్రంలో అధికారపీఠాన్ని దక్కించుకుంటుందన్న నానుడి ఉంది. నిజమైన రాజకీయ రంగస్థలి ఇది. యూపీలో మొత్తం 80 పార్లమెంటు సీట్లు ఉంటే, 2014లో భారతీయ జనతాపార్టీ 71 స్థానాలను, సమాజ్ వాదీ పార్టీ 5 స్థానాలను, కాంగ్రెస్ 2 స్థానాలను, అప్నాదళ్(ఎన్డీఏ) 2 స్థానాలను గెలుచుకున్నాయి. ఈ బలంతోనే బీజేపీ కేంద్రంలో అధికారం దక్కించుకుంది.  2009లో కాంగ్రెస్ యూపీలో 21 స్థానాలను గెలుచుకున్నా.. కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. అందువల్లనే ప్రియాంక గాంధీ వద్రాకు 2019లో ఉత్తరప్రదేశ్ లో ఎన్నికల ప్రచార బాధ్యతలను అప్పగిస్తున్నట్లు అర్థమవుతోంది.

ప్రియాంకకి రాజకీయ  ప్రచారం కొత్త కాదు. 1999లో రాయ్ బరేలీలో సతీష్ శర్మ నిలబడినపుడు  ఆమె ప్రచారం చేశారు. అపుడు నెహ్రూ కుటుంబానికే  చెందిన అరుణ్ నెహ్రూ, సంజయ్ సింగ్ (ఇపుడు కాంగ్రెస్ లో ఉన్నారు) బిజెపి తరఫున క్యాంపెయిన్ చేశారు. దీనిని తప్పికొట్టడంలో ప్రియాంక విజయవంతమయ్యారు. సతీష్ శర్మ గెలిచారు. ప్రచారంలో ఆమె హేమా హేమీలను చూసి జడిసి పోతుందనే అనుమానం ఎవరిలోనూ లేదు. అందుకే చాలా  మంది ఆమె 1999 చరిత్ర మళ్లీ సృష్టిస్తారని కూడా రాస్తున్నారు.

ప్రియాంక  ప్రచార బాధ్యత వహించే తూర్పు ఉత్తరప్రదేశ్ లో దాదాపు 30 లోక్ సభ నియోజకవర్గాలు ఉంటాయి. వాటిలో వారణాశి, గోరఖ్ పూర్ తో పాటు, తన ముత్తాత గారు జవహర్ లాల్ నెహ్రూ ప్రాతినిథ్యంవహించిన అలహాబాద్  నియోజకవర్గం కూడా ఉన్నాయి. తూర్పు ఉత్తరప్రదేశ్ లో ఎన్నికల ప్రచార బాధ్యతలను ప్రియాంక చేపడితే, పశ్చిమ ఉత్తరప్రదేశ్ ప్రాంతంలో ఎన్నికల ప్రచార బాధ్యతలను మరో యువనేత జ్యోతిరాజిత్య సింధియా నిర్వహిస్తారు. ప్రియాంక, జ్యోతిరాదిత్య సింధియా ప్రచారం చేపడితే రాష్ట్రంలో యువత ను ఆకట్టుకునే అవకాశం ఉంది. కులం కీలక పాత్రవహించే యూపీలో ఎస్పీ, బీఎస్పీ కూటమి యాదవులు, దళిత ఓటర్లు ముస్లీంలను ఓటు బ్యాంక్ గా భావిస్తున్నాయి. ప్రియాంక కాంగ్రెస్ ప్రచార బాధ్యతలు చేపడితే, ఆ ఓటర్లతో పాటు, బీజేపీకి కీలక ఓట్ బ్యాంక్ గా ఉన్న రాజ్ పుట్ లు, బ్రాహ్మణులు, ఇతర అగ్రవర్ణాలను, సాంప్రదాయ ఓటర్లను ఆకట్టుకుని కాంగ్రెస్ ను తిరిగి కేంద్రంలో అధికారంలోకి తీసుకువచ్చే అవకాశాలు ఉన్నాయి.

 

    47 ఏళ్ల ప్రియాంక గాంధీ వద్రా రాజకీయ రంగ ప్రవేశంపట్ల కాంగ్రెస్ శ్రేణులలో నాయకుల్లో హర్షాతి రేకాలు వ్యక్తమవుతుంటే, భారతీయ జనతా పార్టీ సహజంగానే వ్యతిరేక వ్యాఖ్యలు చేసింది. ఎస్పీ, బీఎస్పీ కాస్త కంగు తిన్నా.. స్వాగతించాయనే చెప్పాలి. యూపీఏ కూటమి లోని ఇతర పార్టీలు, కాంగ్రెస్ అనుకూల పార్టీలు కూడా హర్షం ప్రకటిస్తున్నాయి. ప్రియాంక తొలిసారిగా అధికారికంగా రాజకీయాల్లో అడుగు పెడుతున్నా… ఉత్తరప్రదేశ్ ప్రజలకు ఆమె సుపరిచితురాలే. తన తండ్రి రాజీవ్ గాంధీ అమేధీ నుంచి పోటీ చేసినప్పటి నుంచి ఆమె ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ వచ్చారు. రాయ్ బరేలీ, అమేధీలో సోనియాగాంధీ, రాహుల్ గాంధీ పలుసార్లు విజయం సాధించడంలో కీలకపాత్ర వహించారు. ప్రస్తుతం సోనియాగాంధీ అనారోగ్యం కారణంగా రాజకీయాలకు దూరంగా ఉండాలని భావిస్తున్నారు. రాహుల్ ను కాంగ్రెస్ అధ్యక్షుడిని చేసింది కూడా అందుకే. 2019లో సోనియా గాంధీ పార్లమెంటుకు పోటీ చేయరాదని భావిస్తున్న కారణంగా ప్రియాంక ఈ సారి రాయ్ బరేలీ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసే వీలున్నది.

 

    భారత రాజకీయాల్లో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ చెరగని ముద్రవేశారు. ఆమె సమ్మోహనా శక్తి అపూర్వం. ఇందిరాగాంధీ పేదల పాలిట పెన్నిధిగా పేరు పొందారు. గరీబీ హటావో వంటి ఎన్నో కీలక పథకాలు చేపట్టి పేద,బడుగు, బలహీన వర్గాల్లో ప్రేమాదరణ పొందారు. అప్పటికీ, ఇప్పటికీ ఆ పేద వర్గాల్లో ఇందిరమ్మ మీద ప్రేమ తగ్గలేదు. ఇందిరాగాంధీ పోలికలు ఎక్కువగా ఉన్న ప్రియాంక కూడా అదే విధంగా ఓటర్లను ఆకట్టుకోవచ్చు. కాంగ్రెస్ ప్రచారంలో కీలక పాత్ర వహించవచ్చు. మరో మూడు నెలల్లో పార్లమెంటు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రియాంకను రాజకీయగోదాలోకి తీసుకువస్తూ కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయం ప్రత్యర్థి పార్టీలకు అశని పాతమే. ఈ కొత్త బెడదను ఎదుర్కొనేందుకు భారతీయ జనతా పార్టీతో పాటు, అన్ని ప్రత్యర్థి పార్టీలు తమతమ వ్యూహాలను మార్చుకోక తప్పదు. మాయావతి వంటి వారు కూడా తమ ఓటు బ్యాంక్ కాపాడు కొనేందుకు తంటాలు పడాల్సిందే.

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *