అమరావతి వాదంలో రాయలసీమ వ్యతిరేకత ఉంది

రాయలసీమ గురించి మాట్లాడితే విభజనవాదం- అమరావతి గురించి మాట్లాడితే జాతీయవాదమా ?

 బిజెపి కర్నూలు రాయలసీమ డిక్లరేషన్ చేసిన రోజునుంచి బిజెపి ని విమర్శించే పేరుతో అమరావతి నేతలు రాయలసీమ ఆకాంక్షలపై దాడిని రోజు రోజుకు పెంచుతున్నారు. బిజెపి ని రాజకీయంగా విమర్శించినా , రాష్ట్రానికి వారు చేయాల్సిన సాయంపై గట్టిగా నిలదీసినా అభ్యంతరం లేదు. కానీ ఆ మాటున సీమ సమస్యలు ప్రస్తావించిన ఒక్క కారణంతోనే అక్కసు వెల్లగక్కడం అందుకు రాష్ట్రంలోని దాదాపు అన్నిపార్టీలు( వై సీ పీ మాత్రం ఇంకా తన వైఖరిని వెల్లడించలేదు) వంతపాడటం మాత్రమే మాకు అభ్యంతరం. 

చరత్రలోకి వెల్లవలసిన అవసరం లేదు కానీ రాయలసీమ గురించి మాట్లాడిన వారు వేర్పాటు వాదులా ? అమరావతి వాదులు విభజనవాదులా  అన్న విషయంపై మాత్రం ఒక్క ఉదాహరణను ప్రస్తావించించడం ఇక్కడ సముచితం అవుతుంది. నాడు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉన్నపుడు తొలి ఆంద్రవిశ్వవిద్యాలయం ఎక్కడ ఉండాలన్న విషయం చర్చకు వచ్చినపుడు అనంతలోనా, విజయవాడలోనా అన్న విషయంపై సభలో ఓటింగ్ నిర్వహించినారు. నాటి తమిళనాడు ప్రతినిధుల సాయంతో అనంతలోనే పెట్టాలని సభ తీర్మానించింది. 

కానీ అందుకు బిన్నంగా దాన్ని విశాఖలో ఏర్పాటు చేసిన ఘనులు సర్కారు జిల్లానేతలు. ఇక్కడ రాయలసీమను మోసం చేశారు అంటే విభజనవాదం, అదే చట్ట సభతీర్మాణాన్ని పక్కన పెట్టి తమ ప్రాంతంలో విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పుకుంటే అది జాతీయవాదం అవుతుందా?  అంత ఎందుకు 2014 సమైక్య ఉద్యమంలో మొత్తం ఉద్యమ ప్రతినిధులుగా డిల్లీలో కూర్చుని అమరావతికి నిధులు, పోలవరం జాతీయ ప్రాజెక్టు, విశాఖకు రైల్వేజోన్ , అన్నీ అయిన తర్వాత ప్రత్యేక హోదా లాంటివి చట్టంలో చేసుకుని రాయలసీమ అంశాలు అన్నీ పరిశీలన స్థాయికి దిగజార్చి దగా చేయడం సమైక్యవాదమా  ? నాడు ఉమ్మడి రాష్ట్రంలో వై యస్ ఆర్  దూర దృష్టితో దుమ్మగూడెం టేల్ పాండు పధకాన్ని రూపొందించారు. అది జరిగితే నాగార్డున సాగర్ కు గోదావరి నీటిని తరలించి క్రిష్ణాడెల్టాకు, తెలంగాణకు శ్రీశైలం నీటిని పంపాల్సిన అవసరం లేకుండా ఆ నీటిని రాయలసీమకు అందించాలని పధకాన్ని రూపొందించి దాదాపు 500 పై చిలుకు కోట్లు ఖర్చు పెట్టితే దాన్ని జాతీయ ప్రాజెక్టుగా చేయనీయకుండా( పోలవరానికి అడ్డు వస్తుందని) కుట్ర చేసినది ఎవరు  ? దీన్ని కూడా జాతీయవాదం అంటారా ? అమరావతి మేధావులు వారిని ఏకపక్షంగా బలపరుస్తున్న పార్టీలు సమాధానం చెప్పాలి. ఇలా ప్రతి సందర్భంలో దాగా చేస్తూ అన్యాయం అని మాట్లాడితే అది విభజన వాదం అన్న సెంట్ మెంట్ తో రాజకీయాలు చేస్తున్నారు.

పోలవరం జాతీయ ప్రాజక్టుగా చేయడంలో రాయలసీమ వ్యతిరేక కుట్ర ఉంది

 బిజెపి డిక్లరేషన్ లో రాయలసీమకు కావాల్సింది ఏమిటి అన్న విషయాలను వారు పొందు పరిచినారు. వారు ప్రస్తావించిన విషయాలలో ముఖ్యమైనది. రెండవరాజదాని, హైకోర్టు, సీమకు ప్యాకేజీ, గుండ్రేవుల, రాయలసీమ అబివృద్దికి ప్రత్యేక బోర్డు. వాటిపట్ల మొదట అమరావతి వాదులు, వారిని బలపరుస్తున్న పార్టీలు తమ వైఖరిని వెల్లడించాలి. రాయలసీమ ప్రజల ఆకాంక్షలకు మద్దతు తెలిపి అందులో బిజెపి చేయాల్సినవి, చేయకుండా ఉన్న అంశాలను కచ్చితంగా విమర్శించాలి.  

అంతేగానీ సీమప్రజల ఆకాంక్షలను బిజెపి  ప్రస్దావించడంతోనే వారిపై దాడి చేయడం ఏమిటి. రాజకీయంగా బిజెపి  తో విబేదించడం వేరు, రాయలసీమ అంశం వేరు. ( ఇపుడు మాట్లాడుతున్న వారికన్నా అనేక సందర్బాలలో బిజెపి  కీలక విధానాలపై మేమే విభేదించి మాట్లాడాము) కానీ వారి మీద ఉన్న కోపాన్ని సీమ సమస్యలు ప్రస్తావించినపుడు  దాడి చేయడం అంగీకారం కాదు. అమరావతి ఏకపక్ష అభివృద్ధిని వారు వ్యతిరేకించారు. ఇలానే కొనసాగితే రాష్ట్రం మరోమారు విభజన జరిగే ప్రమాదం ఉందని హెచ్చరించినారు. బహుశా అదే అమరావతి వాదులకు నచ్చి ఉండకపోవచ్చు. అంటే అమరావతి ఏకపక్ష అబివృద్ది వాదాన్ని ప్రశ్నించకూడదు. సీమకు అన్యాయం జరిగినా రాయలసీమ ప్రజలు మా పరిస్థితి ఏమిటి అని అడగకూడదు. అడిగితే విభజనవాదులు అంటూ దాడి చేస్తారు అమరావతి మేధావులు. వారికి మద్దతు ఇస్తాయి రాజకీయ పార్టీలు. అంటే అమరావతి వాదం సమైక్యవాదం  ? రాయలసీమ గురించి మాట్లాడితే అది వేర్పాటు వాదం?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *