నేను ఎందుకు వెయ్యాలి ఓటు ? ఈసి కి సూటి ప్రశ్న

తెలుగు రాష్ట్రాల్లో పార్లమెంటు ఎన్నికలకు ఎన్నికల కమిషన్ భారీ ఏర్పాట్లే చేసింది. పండుగ వాతావరణంలో ఎన్నికలు జరిపేందుకు ఈసి కసరత్తు చేస్తోంది. ‘‘అటెండర్ నుంచి మొదలుకొని ఐఎఎస్ దాకా, గల్లీ లీడర్ నుంచి మొదలుకొని ఢిల్లీ లీడర్ దాకా, సెలబ్రిటీ నుంచి మొదలుకొని మేధావుల దాకా అందరూ… ఓటేయండి ఓటేయండి… అంటూ ఉపన్యాసాలు దంచికొడుతున్నరు. ఓటేస్తే మీ భవిష్యత్తు అట్ల… ఓటేస్తే మీ బతుకులు ఇట్ల… ఆహా ఓటు… ఓహో ఓటు’’ అని నానా రకాలుగా ఊరించేలా ప్రచారం చేస్తున్నరు. ఇంతవరకు బాగానే ఉంది… కానీ ఓటేసిన తర్వాత గెలిచినోడు ఏ గడ్డి అయినా కరువొచ్చా? పావలాకు, అర్థకు అమ్ముడుపోవచ్చా? మనం ఓటేసి గెలిపించినోడు మన కండ్ల ముందే నిస్సిగ్గుగా పార్టీ కండువాలు కింద పడేసి అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ కండువాలు కప్పుకుని పల్లకీలో ఊరేగొచ్చా? అలాంటి ప్రజా ప్రతినిధిని అధికారంలో ఉన్న పార్టీలు బరిబత్తల (నగ్నంగా) బర్లను కొనుక్కున్నట్లు కొనుక్కోవచ్చా?

అంటే ఈ సమయంలో అడ్డంగా అమ్ముడుపోయినవాళ్లను, కొనుగోలు చేసిన పాలక పార్టీలను కట్టడి చేయడంలో రాజ్యాంగ సంస్థలు నీరుగారిపోయాయి. ఈ సంక్లిష్ట సమయంలో ఓటేయండి… ఓటేయండి అని ఊకదంపుడు ప్రచారం చేస్తున్నవాళ్లను చూస్తుంటే వాళ్ల మీద జాలి కలుగుతున్నది. ఈ పరిణామాలు చూస్తుంటే నిజాయితీగా ఓటేసిన సామన్యుడి గుండెలు రగిలిపోతున్నాయి. అసలు నేనెందుకు ఓటేయాలబ్బా అన్న ధర్మ సందేహం నా అంతరాత్మను వేధిస్తున్నది.

మాది నల్లగొండ జిల్లాలోని ఒక పల్లెటూరు. డిసెంబరులో జరిగిన ముందస్తు ఎన్నికల్లో మా నియోజకవర్గంలో మంచిపేరు తెచ్చుకున్నాడన్న కారణంగా ఒక నాయకుడికి నేను ఓటేశాను. ట్రక్కు గుర్తు కారణమో లేక అధికార పార్టీ ఎమ్మెల్యే మీద జనాల్లో వ్యతిరేకత కారణమో కావొచ్చు… మొత్తానికి నేను ఓటేసిన నాయకుడైతే గెలిచారు. ఆయన గెలిచిన తర్వాత మా నియోజకవర్గ ప్రజలకు, మా గ్రామ ప్రజలకు ప్రతిపక్షంలో ఉండైనా సరే నిధుల వరద పారిస్తాడని అనుకున్నాము. తెలంగాణ ఉద్యమ కాలంలో ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ హరీష్ రావు, ఈటల రాజేందర్ లాంటి వాళ్లు నియోజకవర్గాన్ని కంటికి రెప్పలా కాపాడుకున్నట్లు, అభివృద్ధిలో అధికార పార్టీ ఎమ్మెల్యేల నియోజకవర్గాల కంటే ఎక్కువగా ముందున్నట్లు గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే మా నాయకుడు కూడా అలాగే ప్రతిపక్షంలో ఉండే నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటుపడతాడని ఆశపడ్డాము.

కానీ ఏమైంది?

పెళ్లి చేసుకున్న జంటలో ఆడ కానీ, మగ కానీ కాళ్ల పారాణి ఆరకముందే కట్టుకున్న వారిని వదిలేసి పక్కవారితో కాపురం పెడితే ఎలా ఉంటదో మా నాయకుడు కూడా అలాగే గెలిచిన పార్టీని వదిలేసి అధికార పార్టీకి అమ్ముడు పోయిండు. నిజాయితీగా ఓటేసిన నాలాంటి ఓటర్ల గుండెల్లో గునపాలు గుచ్చి జంప్ చేసిండు. పోనీ నిజంగానే అధికార పార్టీలో ఉంటేనే అభివృద్ధి చేస్తామన్న యావ ఉంటే మేము వేసిన ఓటు ద్వారా వచ్చిన ప్రజాప్రతినిధి అనే పదవికి రాజీనామా పెట్టి ఆమోదం పొందిన తర్వాత పార్టీ మారితే బాగుండేది. కానీ తాళిబొట్టు మెడలో ఉంచుకునే పక్కవాడితో సంసారం చేసినట్లు వ్యవహరించడం ఎంతవరకు సమంజసం.

రాజ్యాంగ సంస్థలేం చేస్తున్నాయో?

చట్టాలు అధికార పార్టీలకు చుట్టాలు అన్నట్లు ఎప్పటినుంచో నానుడి ఉంది. అధికార పార్టీ ఏది చేసినా చెల్లుబాటు అవుతుందన్న ధోరణి సామాన్య ప్రజలకు ఆగ్రహాన్ని తెప్పిస్తున్నది. ఒక పార్టీలో గెలిచినవారు పార్టీ మారితే మారిన మరుక్షణమే అనర్హత వేటు వేయాలి… అని ఉపరాష్ట్రపతిగా ఉన్న వెంకయ్యనాయుడు ఇటీవల మంచిమాట చెప్పారు. కానీ ఆయన సూచన ఎక్కడ అమలవుతున్నది. తెలుగు నేల మీద వైఎస్ అధికారంలో ఉన్న కాలం నుంచీ ఈ పార్టీ మారుడు కల్చర్ ప్రాచుర్యంలోకి వచ్చింది. వైఎస్ సిఎంగా ఉన్న రోజుల్లో టిఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి, బండారు శారారాణి, దుగ్యాల శ్రీనివాసరావు, శనిగరం సంతోష్ రెడ్డి, కంభంపాటి లక్ష్మారెడ్డి, సోయం బాపూరావు, కాసిపేట లింగయ్య, మందాడి సత్యనారాయణరెడ్డి లాంటి ఎమ్మెల్యేలంతా టిఆర్ఎస్ అసమ్మతి ఎమ్మెల్యేలుగా ప్రాచుర్యం పొందారు. ఆ కాలంలో వీరు అధికారికంగా కాంగ్రెస్ కండువా కప్పుకోలేదు కానీ… గులాబీ బాస్ కేసిఆర్ ఇచ్చిన బీఫామ్ మీద గెలిచి ఆయనను ప్రతిరోజు పొల్లు పొల్లు తిట్టేవారు. అధికార కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా, టిఆర్ఎస్ అధినేత కేసిఆర్ కు వ్యతిరేకంగా మాట్లాడేవారు. వారంతా అమ్ముడుపోయారని, వారి మీద వేటేయాలని అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న టిఆర్ఎస్ గట్టిగా కొట్లాడింది. వైఎస్ తీరు మీద కేసిఆర్ అగ్గి మీద గుగ్గిలమైండు. ఆ రకంగా అమ్ముడుపోయినట్లు ప్రచారం పొందిన ఎమ్మెల్యేల మీద స్పీకర్ కు ఫిర్యాదు చేసింది టిఆర్ఎస్. అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడైనా స్పీకర్ అంటే అధికార కుర్చీ మీద కూర్చున్నవారి కనుసన్నల్లో నడిచేవారే అన్న పేరు ఉండనే ఉంది. అలాంటి సమయంలో నిజామాబాద్ జిల్లాకు చెందిన కె.ఆర్.సురేష్ రెడ్డి స్పీకర్ గా ఉన్నారు. ఆయన వ్యక్తిగతంగా చాలా మంచివాడే అని పేరుంది. కానీ ఏం చేస్తాం. వైఎస్ వత్తిడి కారణమే కావొచ్చు… టిఆర్ఎస్ అసమ్మతి ఎమ్మెల్యేల మీద వేటు వేయకుండా సాగతీశారు. చివరి రోజుల వరకు సాగదీసి పదవీ కాలం ముగిసేసమయంలో వారిమీద నిర్ణయం తీసుకున్నారు. అప్పటికే వారంతా రాజీనామాలు చేసేశారు. ఇలా ఉమ్మడి రాష్ట్రంలో ఒక పార్టీతో పెళ్లి, మరో పార్టీతో సంసారం కథ షురూ అయింది.

ఇక తెలంగాణ వచ్చిన తర్వాత వైఎస్ ఏలు పెడితే నేను కాలు పెడతా అన్నట్లు వేగంగా పరిగెత్తారు టిఆర్ఎస్ అధినేత కేసిఆర్. ఇక విభజిత ఆంధ్రా సిఎం చంద్రబాబు నాయుడైతే సన్నాయి నొక్కులు నొక్కుతూనే ఏలు, కాలు ఏం ఖర్మ నేను మొత్తమే మునుగుతా అని అందులో పొర్లిండు. తెలంగాణ ఏర్పడిన కొత్తలో 63 మందితో టిఆర్ఎస్ సర్కారు కొలువుదీరింది. పార్టీ ఫిరాయింపుల భయం కేసిఆర్ కు కలిగింది. ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఓటుకునోటు బాగోతం బయటకు రావడం, రేవంత్ రెడ్డి నోట్ల కట్టలతో వీడియోలకు చిక్కడం జరిగిపోయాయి. అప్పుడు ప్రతిపక్షంలో ఎమ్మెల్యేల సంఖ్య ఎక్కువగా ఉంటే కోటీశ్వరులైన సీమాంధ్ర  పెట్టుబడిదారులు తన సర్కారును కూలగొడతారని భయపడ్డారు. అందుకే ఆపరేషన్ ఆకర్ష్ కు తెర తీసి ప్రతిపక్షాన్ని మొత్తానికి మొత్తం కొల్లగొట్టేశారు. సిపిఐ పార్టీని లేకుండా చేశారు. బిఎస్పీని లేకుండా చేశారు. టిడిపి శాసనసభాపక్షాన్ని లేకుండా చేశారు. కాంగ్రెస్ నుంచి పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలను గుంజిపారేశారు. అంతేకాదు మరీ అసహ్యం కలిగించే విషయం ఏమంటే? ప్రతిపక్ష టిడిపిలో గెలిచిన తలసాని శ్రీనివాస్ యాదవ్ కు ఏకంగా మంత్రి పదవిని కట్టబెట్టడం.  ఇలా ప్రతిపక్షంలో ఉన్నవారంతా అధికార పార్టీలోకి పోతున్న తీరుపై ప్రతిపక్ష పార్టీలు స్పీకర్ కు ఫిర్యాదు చేసినా స్పీకర్ గా ఉన్న మధుసూదనాచారి చూసీ చూడనట్లు వ్యవహరించారు. నా పరిశీలనలో ఉంది… సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటాను అనుకుంటూ చెప్తూ వచ్చారే తప్ప ఏ నిర్ణయం తీసుకోలేకపోయారు. తుదకు అసెంబ్లీ రద్దు అయిపోయింది.

ఇక ఆంధ్రాలో చంద్రబాబునాయుడు మరీ విలువలు దిగజారి ప్రవర్తించారు. అంతకముందు వరకు వైఎస్ తన ఎమ్మెల్యేలను అంగడిలో బర్లను కొన్నట్లు కొంటున్నారని మాట్లాడారు. తెలంగాణ విడిపోయిన తర్వాత కేసిఆర్ బర్ల కొన్నట్లే ఎమ్మెల్యేలను కొంటున్నారని మాట్లాడారు. తర్వాత ఏమైందో ఏమో చంద్రబాబు కూడా ఆపరేషన్ ఆకర్ష్ కు తెర తీశారు. వరుసపెట్టి వైసిపి ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్నారు. మరీ హేయమైన చర్య ఏమంటే? ఫిరాయింపుదారుడైన ఒక్క తలసానికి కేసిఆర్ మంత్రి పదవి ఇస్తే చంద్రబాబు ఏకంగా నలుగురు ఫిరాయింపు ఎమ్మెల్యేలను మంత్రులుగా చేశారు. ఇలా రాజకీయ వ్యభిచారం రోజురోజుకూ పాతుకుపోతున్నవేళ నాలాంటి సామాన్య ఓటరం ఓటేసి ఏం లాభం అన్న ఆవేదనకు గురవుతున్నాడు.

రజత్ కుమార్ మరీ దారుణం

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా ఉన్న రజత్ కుమార్ మీద తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. ఆయన గులాబీ గూటిలో చిక్కిన చిలుక అన్న విమర్శలున్నాయి. ఆయన రెండు సందర్భాల్లో తన నిస్సహాయతను వ్యక్తం చేశారు. ప్రజాధనంతో నిర్మితమైన ప్రగతి భవన్ లో పార్టీ కార్యకలాపాలు జరుగుతున్నాయని ప్రతిపక్ష నేతలు ఫిర్యాదు చేస్తే… ‘‘నేను అక్కడికి వెళ్లి వాటిని ఆపగలనా’’ అంటూ ఆయన ప్రశ్నించడం నిస్సహాయతకు ఒక నిదర్శనమైతే… ముందస్తు ఎన్నికల వేళ సుమారు 20లక్షల ఓట్లు గల్లంతయ్యాయి. వాటి విషయంలో ఒక ఎన్నికల అధికారి హోదాలో క్షమాపణలు చెప్పి చేతులు దులుపుకున్నారు. ఈ రెండు విషయాల్లో రజత్ కుమార్ అభాసుపాలయ్యారు.

కిం కర్తవ్యం…

ఓటేయండి… ఓటేయండి అని చెబుతున్నవారు ఓటేసిన తర్వాత నాయకులు ఎలా ఉంటారు? వారు నిబంధనల ప్రకారం ఉండకపోతే ఏండ్ల తరబడి చర్యలు లేకపోతే సామాన్యుడైన ఓటరు ఓటేసి తీవ్ర నైరాశ్యానికి, ఆవేదనకు గురి కావాల్సిందేనా? అసలు పార్టీ ఫిరాయింపుల చట్టానికి ఎందుకు పదును పెట్టరు. స్పీకర్లు పక్షపాతంగా వ్యవహరిస్తుంటే ఎందుకు వారిని శక్తిమంతులుగా తయారు చేయరు? న్యాయస్థానాల్లో కేసులు ఏండ్ల తరబడి నానుతూ ఉంటే ఓటు హక్కు కలిగిన భారతీయ పౌరుడు కండ్లప్పగించి చూడడమే పరిష్కారమా?

నోటా కూడా ఉంది కదా? అనొచ్చు…

పైన ఉన్న అభ్యర్థులెవరూ నచ్చని పక్షంలో నోటా అనే దాన్ని కూడా ఎన్నికల కమిషన్ తీసుకొచ్చింది. ఇది బాగానే ఉన్నా… విలువల పెంపు కోసం ఏమాత్రం పనికొస్తలేదు. పైన ఉన్న అభ్యర్థులు నచ్చకపోతే నోటాకు వేస్తాం… కానీ పైన ఉన్న అభ్యర్థులు నచ్చి ఓటేస్తే… వారు తెల్లారే పార్టీ మార్చితే నోటా ఎక్కడ నిలువరిపజేస్తున్నది?

ఈ మౌలిక ప్రశ్నలకు జవాబు ఎప్పుడు దొరుకుతుందో? అప్పటి వరకు ఓటేసిన నాలాంటి సామాన్యుడు బలహీనుడై కుంగిపోవాల్సిందేనా?

 

– రచయిత : ఎ.సంజయ్

(ఈ వ్యాసంలోని అభిప్రాయాలు రచయిత వ్యక్తిగతమైనవి)

(ఫొటో : ద న్యూస్ మినట్ నుంచి సేకరించినది)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *