సెన్సేషనల్ న్యూస్: టీడీపీలోకి సీమ పెద్ద తలకాయ

ఏపీ పాలిటిక్స్ మండుటెండల్ని తలపిస్తున్నాయి. పార్టీలు మారుతున్న సీనియర్ నేతలు, కొత్త వ్యక్తులు రాజకీయాల్లోకి ఎంట్రీ ఎక్కడ చూసినా హడావిడే. ఈయన మనకి పనికొస్తాడు పార్టీలోకి తెచ్చుకోవాలి అనుకునేలోపే గద్ద వచ్చి తన్నుకుపోయినట్టు ఆ నాయకుడిని మరో పార్టీ లాగేసుకుంటుంది. ఇక కొందరు నేతలేమో పదవులు ఆశించో లేక అంతర్గత పోరు పడలేకనో లేక మరేదో కారణం చేతనో ఇవాళ ఒక పార్టీలో ఉంటే రేపు మరో పార్టీలో చేరుతున్నారు.

అబ్బబ్బా…ఇలా రోజుకో వ్యవహారం పసందైన విందులా ఉంది రాజకీయ విశ్లేషకులకు, అభిమానులకు, మీడియా జనాలకు. ఈ నేపథ్యంలో రాయలసీమ రాజకీయాల్లో పెద్దింటి పెద్దాయన ఒకరు టీడీపీలోకి వస్తున్నారనే వార్త ఇప్పుడు సంచలనంగా మారింది. ఇంతకీ ఎవరా పెద్దాయన? ఎందుకు పార్టీ మారనున్నారు? ఈ వివరాలు కింద ఉన్నాయి చదవండి.

దివంగత సీఎం కోట్ల విజయభాస్కర్ రెడ్డి కొడుకు, కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి టీడీపీలో చేరనున్నారు అనే వార్త రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. ఈ మేరకు ఇప్పటికే పార్టీ ముఖ్య నేతలు, కోట్ల మధ్య చర్చలు జరిగినట్టు తెలుస్తోంది. స్వయంగా టీడీపీ అధినేత, ఏపీ సీఎం తన ఇంట్లో విందుకు కోట్లను ఆహ్వానించినట్టు అంతర్గత వర్గాల సమాచారం. సోమవారం అనగా ఈరోజు సాయంత్రం చంద్రబాబు ఇంట్లో డిన్నర్ కి భేటీ అవ్వనున్నారు. ఈ సందర్భంగా ఆయన పార్టీలో ఎప్పుడు చేరతారు అనే అంశాలు చర్చకు రానున్నాయి.

ఏపీలో టీడీపీ, కాంగ్రెస్ పొత్తు ఉంటే కోట్ల కర్నూల్ ఎంపీ స్థానానికి పోటీ చేయాలి అనుకున్నారు. కానీ తెలంగాణాలో టీడీపీ-కాంగ్రెస్ పొత్తు విఫలం కావడంతో ఆంధ్రాలో ఎవరికి వారే పోటీ చేయాలి అని నిర్ణయించుకున్నారు. ఇక కాంగ్రెస్ తరపున బరిలోకి దిగితే గెలుపు కష్టం అవుతుందని భావించిన కోట్ల ఈ నిర్ణయానికి వచ్చినట్టు ముఖ్య నేతల సమాచారం.

అంతేకాదు పార్టీ అంతర్గత విబేధాల కారణంగా ఆయన కొద్దీ రోజుల నుండి పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు. ఈ విబేధాల కారణంగానే ఆయన కంగ్రెస్ ను వీడి టీడీపీలో చేరాలి అనుకుంటున్నారని కొందరి వాదన. ఏదిఏమైనా ఈరోజు టీడీపీ అధినేత చంద్రబాబుతో విందు భేటీ అనంతరం మరింత క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అయితే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి పార్టీలో చేరితే టీడీపీలో అంతర్గత విబేధాలు మొదలయ్యే ఛాన్స్ లేకపోలేదు. ఎందుకంటే ప్రస్తుతం కర్నూల్ ఎంపీగా బుట్టా రేణుక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈమె వైసీపీ తరపున ఎన్నికై అనంతరం టీడీపీలో చేరారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఈమె ప్రజల్లో మంచి స్థానం దక్కించుకున్నారు. అటువంటిది అధికార పార్టీలోకి మారక ప్రజలకి మరింత చేరువయ్యారు. ఆమెను కాదని కోట్లకి సీటు వస్తే వివాదాలు తలెత్తే అవకాశం లేకపోదంటున్నారు నేతలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *