వైసీపీ కంచుకోటలో టీడీపీకి షాక్: వైసీపీలో చేరిన మాజీ మంత్రి

ఎన్నికలు దగ్గర పడుతున్నవేళ టీడీపీ నుండి సీనియర్ నేతలు బయటకి వెళ్లడం పార్టీ వర్గాల్లో కలకలం రేపుతోంది. పధకాల పేరుతో వైసీపీ కంచుకోటలో కూడా ఓటర్లను తమవైపుకు తిప్పుకోవాలని టీడీపీ అధిష్టానం తిప్పలు పడుతోంది. వైసీపీ బలంగా ఉన్న నియోజకవర్గాల్లో పాగా వేయాలని ప్రయాసపడుతోంటే… కొండ నాలుక కోసం పోతే ఉన్న నాలుక ఊడినట్టు అవుతోంది అధికార ప్రభుత్వం పరిస్థితి. ఈ నేపథ్యంలో వైసీపీ కంచుకోటగా ఉన్న కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. కడప మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత ఒకరు టీడీపీని వీడి వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు. ఈ వార్త ఇప్పుడు రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

ఇటీవలే కడప రాజంపేట ఎమ్మెల్యే టీడీపీని వీడి వైసీపీలో జాయిన్ అయ్యారు. ఇదే బాటలో మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత ఖలీల్ భాషా మంగళవారం సాయంత్రం వైసీపీలో చేరారు. కొద్దిసేపటి క్రితం లోటస్ పాండ్ లో జగన్ తో భేటీ అయ్యారు ఖలీల్. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆయనకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కడప ఎమ్మెల్యే అంజాద్ భాషా, మరి కొందరు వైసీపీ నాయకులు పాల్గొన్నారు.

టీడీపీలో సీనియర్ నేతలు పార్టీ మారడం ఆ పార్టీ అధిష్టానాన్ని కలవరపెడుతోంది. నేతలు ఇలాంటి నిర్ణయానికి రావడం అసంతృప్తి సెగలే ప్రధానంగా ఉన్న కారణంగా వినిపిస్తోంది. ఖలీల్ భాషా పార్టీ మారడానికి కారణం కూడా ఇదే అంటున్నారు ఆయన అనుచరులు. పార్టీలో సరైన గుర్తింపు ఇవ్వడం లేదని ఖలీల్ ఆవేదనకు గురైనట్టు తెలిపారు. కడప అసెంబ్లీ సెగ్మెంట్ పై ఆయన ఆశలు పెట్టుకున్నారు. కాగా ఆ టికెట్ ఇటీవలే కాంగ్రెస్ నుండి టీడీపీలో చేరిన మాజీ మంత్రి అహ్మదుల్లాకు కేటాయిస్తున్నట్టు అధిష్టానం పరోక్షంగా సంకేతాలిచ్చినట్టు తెలుస్తోంది.

కడప అసెంబ్లీ టికెట్ పై స్పష్టత ఇవ్వనందునే ఖలీల్ గత కొద్ది రోజులుగా పార్టీపై అసంతృప్తిగా ఉన్నారు. ఇదే అదునుగా భావించిన కడప వైసీపీ నాయకులు ఆయన్ని వైసీపీలో తీసుకొచ్చే దిశగా పావులు కదిపినట్టు తెలుస్తోంది. ఈ విషయంలో వైసీపీ స్కెచ్ ఫలించింది. టీడీపీ నేతలు బుజ్జగించే ప్రయత్నం చేసినా ఖలీల్ మాత్రం పార్టీ మారాలని స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యారు, పార్టీ మారారు కూడా. ఈ తరుణంలో ఖలీల్ ని పార్టీలోకి ఆహ్వానించిన జగన్ కూడా ఆయనకి పార్టీలో సముచిత స్థానం ఉంటుందని భరోసా కల్పించినట్టు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *