పార్టీ మారే ఆలోచనలో మాజీ కేంద్రమంత్రి: అలెర్ట్ అయిన వైసిపి

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీలో చేరేందుకు నేతలు ఆసక్తి చూపుతున్నారు. గత కొద్దీ రోజులుగా ఆ పార్టీలోకి వలసల పరంపర కొనసాగుతూనే ఉంది. ఇటీవలే అధికార పార్టీలోని పలువురు సీనియర్ నేతలు టిడిపికి గుడ్ బై చెప్పి వైసిపి తీర్ధం పుచ్చుకున్నారు. కాగా మరో సీనియర్ రాజకీయ నాయకుడు వైసీపీలో చేరే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఆ వివరాలు కింద చదవండి.

కాంగ్రెస్ మాజీ కేంద్రమంత్రి, సీనియర్ బీజేపీ నేత కావూరి సాంబశివరావు పార్టీ మారేందుకు సిద్ధమైనట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీ తరపున 5 సార్లు లోక్ సభకు ఎన్నికయ్యారు కావూరి. కాంగ్రెస్ హయాంలో కేంద్రమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేశారు.

2014 ఏప్రిల్ లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆయన మేలో భారతీయ జనతా పార్టీ కండువా కప్పుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో బీజేపీపై పూర్తి వ్యతిరేకత నెలకొంది. దీంతో రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పార్టీ మారాలని కావూరి సాంబశివరావు డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. అయితే ఆయన వైసీపీలో చేరాలి అనే ఆలోచనలో ఉన్నట్టు వైసీపీకి సంకేతాలు వెళ్లినట్టు సమాచారం.

దీంతో అలెర్ట్ అయిన వైసిపి అధినేత జగన్… విజయసాయిరెడ్డిని కావూరి సాంబశివరావుతో సంప్రదింపులు జరపవలసిందిగా ఆదేశించారు. జగన్ ఆదేశాల మేరకు విజయసాయిరెడ్డి కావూరితో భేటీ అయ్యారు. ఈ భేటీలో కావూరి తాను ఏలూరి పార్లమెంటు టికెట్ ఆశిస్తున్నానని, టికెట్ పై హామీ ఇస్తే వైసీపీలో చేరడానికి సిద్ధమని క్లియర్ గా చెప్పినట్టు సమాచారం.

టీడీపీకి కంచుకోటలుగా ఉన్న గోదావరి జిల్లాల్లో పార్టీ బలపడాలి అంటే బలం, బలగం ఉన్న సీనియర్ నేతలు పార్టీకి కీలకం. ఈ నేపథ్యంలో సుదీర్ఘ కాలంగా రాజకీయాల్లో ఉన్న నేత, అందునా మాజీ కేంద్ర మంత్రి కావడంతో ఆయన ఎంట్రీ పార్టీకి మరింత బలాన్ని చేకూరుస్తుందని వైసిపి అధిష్టానం భావిస్తున్నట్టు తెలుస్తోంది.

మీకు పార్టీలో తగిన గౌరవం ఉంటుందని, ఏలూరు పార్లమెంటరీ టికెట్ విషయం ఖచ్చితంగా దృష్టిలో ఉంచుకుంటామని అధిష్టానం కావూరికి భరోసా ఇచ్చినట్టు ముఖ్య నేతల సమాచారం. మరో రెండు మూడు రోజుల్లో కావూరి సాంబశివరావు బీజేపీని వీడి వైసిపి కండువా కప్పుకోనున్నట్టు తెలుస్తోంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *