తెలంగాణపై మళ్లీ బుసకొట్టిన చంద్రబాబు

చంద్రబాబు నాయుడు పేరు వినగానే ఎవరు భయపడతారో లేదో కానీ తెలంగాణ ప్రజలు మాత్రం కచ్చితంగా భయపడతారు. ఒకరు కాదు ఇద్దరు కాదు తెలంగాణ జాతి మొత్తానికి చంద్రబాబు అంటే భయం ఉంది. దానికి ప్రత్యక్ష ఉదాహరణే 2018 డిసెంబరులో తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ముందస్తు ఎన్నికలు. తెలంగాణలో టిఆర్ఎస్ పాలన పట్ల చాలా సెక్షన్లు తీవ్రమైన వ్యతిరేకతతో ఉన్నాయి. కానీ ఆ వ్యతిరేకత చంద్రబాబు రీఎంట్రీ డేంజర్ అనే ఒకే ఒక్క అస్త్రంతో కేసిఆర్ రూపుమాపి ఓట్ల వర్షం కురిపించుకున్నారు. తిరిగి గద్దెనెక్కారు. చంద్రబాబును బూచిగా చూపించి కేసిఆర్ 88 సీట్లతో విజయకేతనం ఎగురవేశారు. దీన్నిబట్టి చూస్తే ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా చంద్రబాబు అనే పర్సనాలిటీ వందకు వంద శాతం తెలంగాణకు వ్యతిరేకం అని మూడు నెలల క్రితమే తెలంగాణ ప్రజలు సుస్పష్టమైన తీర్పు వెలువరించారు.
చంద్రబాబు తెలంగాణకు వ్యతిరేకం అనేదానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. వాటి జోలికి వెళ్లడం కంటే ప్రస్తుతం ఏం జరుగుతుందనే విషయాన్ని ఒకసారి పరిశీలిద్దాం… ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు సోమవారం రాత్రి చిత్తూరులో రోడ్ షో నిర్వహించారు. రాత్రి పది గంటల వరకు ఆయన ప్రసంగం సాగింది. ఈ సమయంలో పోలవరం ముంపు మండలాల అశాన్ని ప్రస్తావించారు. అంతేకాదు పనిలో పనిగా భద్రాచలం మాదే అని సంచలన కామెంట్ వదిలారు. 7 పోలవరం ముంపు మండలాలను ఎపిలో విలీనం చేయకపోతే తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం కూడా చేయను అని డిమాండ్ చేయడంతో విధిలేని పరిస్థితుల్లో కేంద్రం అంగీకరించి 7 మండలాలు ఆంధ్రాకు ఇచ్చారని గుర్తు చేశారు. ఆ 7 మండలాలను కేసిఆర్ ఇప్పుడు తెలంగాణకు ఇవ్వాలని మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఆ 7 మండలాలు కావాలని అడిగితే భద్రాచలం కూడా మాదే అంటం అని వివాదాస్పద కాెమెంట్స్ చేశారు. 7 మండలాలు అడిగితే మాత్రం భద్రాచలంలో ఆంధ్రాకు వాటా ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేశారు.

ఈ లంకె దేనికో ?

చంద్రబాబు రోడ్ షో జరిగింది ఏ ఆంధ్రా జిల్లాల్లోనో కాదు రాయలసీమలో. భద్రాచలానికి, పోలవరం పరిధిలో ముంపు బాధిత  మండలాలకు పెద్దగా లంకె లేదు. కానీ చంద్రబాబు చిత్తూరులో ఈ స్టేట్ మెంట్ ఎందుకిచ్చారబ్బా అన్నదానిపై భిన్నరకాల వాదనలు వినబడుతున్నాయి. తెలంగాణలో చంద్రబాబును బూచిగా చూపించి ఏవిధంగా అయితే ముందస్తు ఎన్నికల్లో కేసిఆర్ అధ్బుతమైన లబ్ధి పొందారో అదే పాలసీని చంద్రబాబు ఎపిలో ప్రయోగిస్తున్నట్లు తేలతెల్లమైపోయింది. తెలంగాణలో నాలుగున్నరేళ్ల టిఆర్ఎస్ పాలనలో నిరుద్యోగులు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. ఉద్యోగ వర్గాల్లోనూ అదే పరిస్థితి. కానీ ఓటింగ్ దగ్గరకు వచ్చేసరికే చంద్రబాబును బూచిగా చూపెట్టడంతో విధిలేని పరిస్థితుల్లో జనాలు టిఆర్ఎస్ వైపు మొగ్గు చూపారని అనేక విశ్లేషణలు చెబుతున్నాయి.
ఇప్పుడు చంద్రబాబు కూడా కేసిఆర్ ఎత్తిన పల్లవే అందుకున్నట్లు కనబడుతున్నది. అందుకే అయినదానికి కానిదానికి కేసిఆర్ ను టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తున్నారు. ఎపి రాజకీయాల్లో వేలు పెట్టం… కాలు పెట్టం అని గులాబీ బాస్ లు అంటున్నప్పటికీ కేసిఆర్ ను వదల బొమ్మాలీ అన్నట్లు విమర్శలు గుప్పిస్తున్నారు బాబు. తాజాగా ఎపిలో అసెంబ్లీకి, పార్లమెంటుకు ఎన్నికలు జరగబోతున్నాయి. కానీ తెలంగాణలో మాత్రం కేవలం పార్లమెంటుకు మాత్రమే ఎన్నికలు ఉన్నాయి. అయితే ఎపిలో రెండు ఎన్నికలకు పోటీ చేస్తున్న టిడిపి తెలంగాణలో మాత్రం కాడి కింద పడేసింది. ఈ ఎన్నికలకు దూరంగా ఉంటున్నట్లు తెలంగాణ టిడిపి అధ్యక్షులు ఎల్.రమణ ప్రకటించారు. ఎలాగూ తెలంగాణాలో దుకాణం సర్దుకుపోక తప్పదని భావించిన చంద్రబాబు ఇక్కడ పోయినా ఆంధ్రాలో గిట్టుబాటు కావాలనే ఉద్దేశంతోనే తెలంగాణపై బుసలు కొడుతున్నారన్న వాదన వినిపిస్తోంది.
అసలు 7 మండలాలు గుంజుకున్నప్పుడే భద్రాచలం కూడా మాదే అనే విషయాన్ని చెప్పవచ్చు కదా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అప్పట్లో కేంద్రంలో అనుకూలమైన మోదీ గవర్నమెంటే ఉంది కాబ్టటి భద్రాచలం కూడా కావాలని పట్టుపట్టవచ్చు కదా? అప్పుడు మౌనంగా ఉండి కేవలం ఎన్నికల సమయంలో కొత్త చిచ్చు రేపడం పట్ల తెలంగాణవాదుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. రెండు ప్రాంతాలు రెండు కండ్లు అంటూ రెండు కండ్ల థియరీ చెప్పిన చంద్రబాబు ఇప్పుడు ఒక కన్ను పాలసీని ఫాలో అవుతున్న తీరు తెలంగాణవాదులకు పుండు మీద కారం చల్లినట్లు అయితున్నది.
ఇప్పుడు భద్రాచలం మాదే.. భద్రాచలంలో వాటా కావాలని డిమాండ్ ను తెరమీదకు తీసుకొస్తే తెలంగాణ పెద్దలు తిరుపతిలో మాకు వాటా కావాలనే డిమాండ్ ను తెర మీదకు తీసుకురారన్న గ్యారెంటీ ఏమిటి? అదే జరిగితే మరోసారి రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్రమైన వైషమ్యాలు పొడసూపే ప్రమాదం లేకపోలేదు. తెలంగాణ ఏర్పాటుకు ముందు తర్వాత… నెలకొన్న వైషమ్యాలు ఇప్పుడిప్పుడే తొలగిపోతున్నవేళ బాధ్యతాయుతమైన నేతగా, జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన నాయకుడిగా ఉన్న చంద్రబాబు ఇలాంటి కామెంట్స్ చేయడం పట్ల రాజకీయ పరిశీలకులు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. మానిపోతున్నగాయాలను మళ్లీ గిల్లడం వెనుక కేవలం ఓట్ల ఆశ తప్ప మరొకటి లేదని తేలిపోయిందంటున్నారు.
మరి చంద్రబాబు చిత్తూరు సాక్షిగా లేవనెత్తిన భద్రాచలం వివాదం ఏరకమైన మలుపులు తిరుగుతుందో చూడాలి.

ఈ వార్త కూడా చదవండి…

https://trendingtelugunews.com/new-tensions-for-trs-party/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *