విశాఖ రైల్వే జోన్ సాధ్యం కాన్నపుడు గుంతకల్ పేరు చెప్పండి

విశాఖకు రైల్వేజోన్ ఇవ్వడం కుదరదని అన్నిరకాల నివేదికలు వ్యతిరేకంగా వచ్చినాయని కేంద్రం చాలా స్పష్టంగా చెప్పంది. అయినా రాష్ట్రం లోని అధికార, ప్రతిపక్షం కక్ష పూనినట్లు విశాఖ తప్ప మరోకటిని పరిశీలించడానికి సిద్దంగా లేవు. విచిత్రమేమిటంటే చట్టంలో అధికారింగా దుగ్గరాజపట్నం ఓడరేవు నిర్మించాలని ఉంది కానీ దాని స్థానంలో మరో ఓడరేవును పరిశీలించాలని రాజకీయ పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయి. మరి విశాఖ జోన్ సాధ్యం కాదని కేంద్రం చెప్పిన నేపథ్యంలో కూడా గుంతకల్లు గురించి పరిశీలించకపోవడం దుర్మార్గం.

రైల్వేజోన్ కు సంబంధించి విభజన చట్టం చెపుతున్నది ఏమిటి రాజకీయ పార్టీలు చెస్తున్నదేంటి?

విభజన చట్టాన్ని కేంద్రం సరిగా అమలు చేయలేదని ఆందోళన చేస్తున్న పార్టీలు తాము మాత్రం చట్టానికి బిన్నమైన డిమాండ్లు చేయడం విచిత్రం. విభజన చట్టం 2014 ప్రకారం విభజిత ఆంద్రప్రదేశ్ కు రైల్వేజోన్ ను పరిశీలించాలని మాత్రమే ఉంది. అంతే కాదు ఉమ్మడి ఆంద్రప్రదేశ్ లో అప్పటికి ఉన్నది సికింద్రాబాదు జోన్ మాత్రమే. వాస్తవానికి విశాఖ సికింద్రాబాదు జోన్ పరిదిలో లేదు. విభజన చట్టాన్ని యథాతదంగా పరిశీలిస్తే సికింద్రాబాదు లోని ఏపీని విభజించి మరో కొత్తజోన్ ను ఏర్పాటు చేయాలి. అలా చేస్తే అసలు విశాఖను పరిగణనలోకి తీసుకోవడం కూడా సాద్యం కాదు. రాయలసీమలోని గుంతకల్లు, విజయవాడను మాత్రమే పరిశీలించాలి. రాజధానిని అమరావతికి ఇచ్చినారు కాబట్టి మరో చర్చకు అవకాశం లేకుండా గుంతకల్లుకు జోన్ ఇవ్వాలి. కానీ అందుకు బిన్నంగా అధికార, ప్రతిపక్ష పార్టీలు తమ స్వార్థం కోసం అసలు చట్టంలోనే లేని విశాఖ రైల్వే జోన్ కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారు.

రాయలసీమ డిక్లరేషన్ చేసిన బిజెపి రైల్వే జోన్ విషయంలో తన నిజాయితీని నిరూపించుకోవాలి.

రాయలసీమకు  ఏమి కావాలి అన్న విషయాలపై బిజెపి  కర్నూలు డిక్లరేషన్ పేరుతో ఒక నివేదికను ఆమోదించింది. రాజకీయపార్టీలు బిజెపి పై తీవ్ర విమర్సలు చేసినా రాయలసీమ ఉద్యమ సంస్థలు వారి నివేదికను స్వాగతించాయి. అలా సీమ ఉద్యమ సంస్థలు  అభివృద్ధి విషయంలో ఏ పార్టీ మంచి చేసినా తమ రాజకీయ అనుబంధాలతో నిమిత్తం లేకుండా తమనిజాయితీని ప్రదర్శిస్తాయి బిజెపి కి రాయలసీమ పట్ల నిజాయితీ లేదని బిజెపి వ్యతిరేక పక్షాలు చేసిన విమర్శలకు సమాధానం చెప్పే అరుదైన అవకాశం బిజెపి కి వచ్చింది. అదేదో త్యాగం కూడా కాదు. కేవలం విభజన చట్టాన్ని కచ్చితంగా అమలు చేయడమే. ఇందుకు రాష్ట్రంతో కూడా సంబందం లేదు నేరుగా కేంద్రం తాను వేసిన కమిటి గుంతకల్లును పరిశీలించితే సరిపోతుంది. తన ముందు ఉన్న అవకాశాన్ని బిజెపి ఉపయోగించుకుని సీమ పట్ల తమకున్ననిజాయితీని నిపూపించుకోవాలి. దుగ్గరాజపట్నంకు ప్రత్యామ్నాయం ఆలోచిస్తున్న బాబు జోన్ విషయంలో ఆలోచించరా. 

విభజన చట్టం 2014 ప్రకారం సీమకు సమీపంలో ఉన్న దుగ్గరాజపట్నం ఓడ రేవును 2018 కల్లా మొదటి దశను కేంద్రం పూర్తి చేయాలని స్పష్టంగా ఉంది. కానీ కేంద్రం సాంకేతిక కారణాలతో సాద్యంకాదని చెపుతూ దాని స్థానంలో మరో ఓడరేవును చూచిస్తే  పరిశీలిస్తామని సలహ ఇచ్చింది. చట్టంలో ఉన్న దుగరాజపట్నం విషయంలో సాధ్యం కానపుడు మరో ప్రతిపాదనతో రండని చూచించిన కేంద్రం అదే చట్టంలో లేని సాధ్యం కాదని తెలిసి కూడా అవసరం, అవకాశం ఉన్న గుతల్లును పరిశీలించకపోగా ప్రత్యామ్నాయం చూపమని రాష్ట్రాన్ని కేంద్రం ఎందుకు అడగదు? మరో ప్రతిపాదనను బాబుగారు కేంద్రం ముందు ఎందుకు పెట్టరు? అటు కేంద్రం ఇటు రాష్ట్రం రాయలసీమ ప్రజలకు సమాధానం చెప్పాలి.

 జగన్ గారు మీరు కూడా వైఖరిని మార్చుకోండి!

 రాయలసీమకు బాబు అన్యాయం చేస్తున్నారని పదే, పదే ఆరోపణలు చేస్తున్న తమరు మాత్రం జోన్  విషయంలో సీమకు చేస్తున్నది అన్యాయం కాదా. ఈ విషయంలో మీరు బాబు కన్నా రెండాకులు ఎక్కువే తిన్నారు. చట్టంలో లేకపోయినా విశాఖ రైల్వేజోన్ అని పేరు పెట్టింది తమరే. ఇపుడు కేంద్రం విశాఖకు రైల్వేజోన్ సాద్యం కాదు అని స్పష్టం చేసిన తర్వాత కూడా మీ వైఖరి మార్చుకుంటారా లేదా చెప్పాలి.రాయలసీమ లోని గుంతకల్లుకు  రైల్వేజోన్ డిమాండుపై మీ వైఖరిని స్పష్టం చేయాలి.

 

రైల్వేజోన్ గా గుంతకల్లుడివిజన్ గా తిరుపతి అత్యంత అనువైన ప్రాంతం. రాష్ట్రంలోనే అత్యంత వెనుకబడిన ప్రాంతం అనంతపురం. ఆంగ్లేయుల కాలంలోనే చెన్నై-ముంబాయి, బెంగళూరు- సికింద్రాబాదు, తిరుపతి-నాగపూర్, గుంటూరు- హుబ్లీ లను అనుసంధానం  చేయడానికి అనువైన ప్రాంతంగా గుర్తించి నాటి  ప్రభుత్వం 1927 లోనే గుంతల్లును డివిజన్ గా చేసింది. 1400 కీ మి పరిది, 130 రైల్లు, రోజూ లక్ష మంది ప్రయాణికులు, ఏటా 11 వందల కోట్ల ఆదాయం కలిగిన డివిజన్ గుంతకల్లు. బెంగుళూరుకు 300 కీ మిచెన్నై కి 450 కి మీ, హైదరాబాదుకు 300 కి మీఅమరావతికి 300 కి మీ, హుబ్లీకి 260 కి మీ దూరం కలిగి దేశంలోని కీలకమైన నగరాలకు మధ్యన ఉన్నది గుంతకల్లు.

తిరుపతి డివిజన్ చేయడంలోనూ పక్షపాతమేనా?

రోజుకు సగటున 50 వేల మంది ప్రయాణికులతో సికింద్రాబాదు తర్వాత ఎక్కువ ఆదాయం కలిగి రాష్ట్రంలోనూ దేశంలోనూ దాదాపు అన్నీ ప్రదాన నగరాలకు రైలు సౌకర్యం కలిగి ప్రపంచ ప్రసిద్ధి గాంచిన తిరుతిని డివిజన్ గా ప్రకటించకపోవడం వివక్ష కాదా. కేవలం 30 కి మీ వ్యవదిలో గుంటూరు, విజయవాడ లను రెండు డివిజన్ లుగా చేసిన కేంద్రం తిరుపతిని డివిజన్ చేయకపోవడం అన్యాయం. విచిత్రమేమిటంటే ప్రస్తుతం గుంటూరు డివిజన్ నష్టాలలో ఉంది.బిజెపి, టిడిపి, వైఎస్ ఆర్ సిపి  ఇలా ప్రతి పార్టీ రైల్వే జోన్ విషయంలో తమ రాజకీయ స్వార్థం కోసం చట్టానికి వ్యతిరేకంగా విశాఖ రైల్వే జోన్ అంటూ రాజకీయాలు చేసి రాయలసీమకు అన్యాయం చేశాయి. ఇప్పటి వరకు మీ రాజకీయాల కోసం వేసిన వేషాలు చాలు. కేంద్రం విశాఖ సాధ్యం కాదు అన్న తర్వాత నయినా కనీస మానవత్వాన్ని ప్రదర్శించాలి. అన్ని విధాలా అవకాశం, అవసరం ఉన్న గుంతకల్లును కేంద్రం ముందు రాజకీయపార్టీలు, ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదన చేయాలి. అలా పార్టీలపై వత్తిడి చేసే విదంగా రాయలసీమ సమాజం ప్రయత్నించాలి.

 

 *యం పురుషోత్తం రెడ్డి, రాయలసీమ మేధావుల పోరం, తిరుపతి 9490493436

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *