నవ్వు వూరకే వస్తుంది, దాచుకోవద్దు ప్లీజ్…

 

సృష్టిలో నవ్వగలిగే ఏకైక ప్రాణి “మనిషే”! అది తెలిసినా మనిషి నవ్వటం తగ్గించేసాడు. ఇప్పుడు 95 శాతం మనుషులు ఒత్తిడిలో ఉన్నారు! అంటే ప్రపంచమంతా ఇప్పుడు ఒత్తిడి లో ఉంది. దీని నివారణకు నవ్వు చక్కటి ఔషధంగా పనిచేస్తుందని మానసిక శాస్త్రవేత్తలు సామాజిక శాస్త్రవేత్తలు అందరు పదే పదే చెబుతున్నారు. అందరూ కూర్చొని నవ్వుకునే పరిస్థితులు ఇప్పుడు కనపడటం లేదు.

చిన్నపిల్లలు రోజుకు 30 సార్లు నవ్వితే పెద్దవాళ్ళు 30 రోజులకు ఒకసారి నవ్వుతున్నారు అని తేలింది. ముఖ్యంగా ఉద్యోగస్తులు ఎక్కువ కాలం పనిచేసే వాళ్లు, ప్రజలతో ప్రత్యక్ష సంబంధం ఉంటూ పనిచేసే వాళ్లు తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారని తేలింది. ప్రజలకు ఇప్పుడు నవ్వటానికి కూడా టైం లేదు.

అసలు నవ్వు అంటే ఏమిటి? యుగాలుగా అందరిని కంగారు పెడుతున్న ప్రశ్న ఇది. నవ్వంటే ఏమీ లేదు ప్రశాంతత. నవ్వంటే ఒక చక్కటి అనుభూతి. నువ్వు అంటే పాజిటివ్ గా ఉన్నాము అనటానికి సూచిక. నవ్వు ఒకప్పుడు నాలుగు విధాల చేటు అనే వారు, ఇప్పుడు ప్రపంచమంతా నవ్వు నలభై నాలుగు విధాల మేలు అంటున్నారు. ముఖంలో ఉన్న కండరాల్లో 60 నుంచి 80 కండరాలు కదిలించాలి, ముఖం చికాగ్గా పెట్టడానికి! అదే నవ్వటానికి ఓ పది పదిహేను కండరాలు కదిలిస్తే చాలు!!
తక్కువ పని ఎక్కువ లాభం.అందుకే సోమరిపోతులు కూడా నవ్వాలన్న మాట!

అంతేకాదు, ఎంత వాడినా, ఎందరికి పంచినా తరగని సంపద నవ్వు. ఫొదుపు పాటించడమెందుకు? విచ్ఛలవిడిగా ఖర్చు చేయండి.

నవ్వడం వల్ల ఉన్న లాభాల్లో కొన్ని:

నవ్వు మీద లియో లిండా యూనివర్సిటీ లో డాక్టర్లు (భార్య భర్తలు) పరిశోధన చేసి నవ్వు అన్నది ఒక “ఎలిక్సిర్” అంటే సర్వరోగ నివారిణి అని తేల్చారు. వారి పరిశోధనలో నిర్ధారణమైన కొన్ని విషయాలు.

* అనేక సమస్యలకు, కొండకచో అనారోగ్యాలకు నవ్వుతూ చెక్ పెట్టవచ్చు.
* గుండె పదికాలాలపాటు పదిలంగా ఉండాలంటే నవ్వటం తప్ప మరో మందు లేదు.
* బాగా నవ్వే వారిలో బిపి గణనీయంగా తగ్గుతుందని తేలిపోయింది
* ముఖం కాంతివంతంగా ఉండడానికి కూడా నవ్వే కారణం
* నవ్వినప్పుడు కార్టిసాల్,ఎపినెఫ్రిన్,డోపాక్ వంటి నెగటివ్ హార్మోన్ల ఉత్పత్తి తగ్గుతుంది.
* నిత్యం నవ్వే వాళ్లకి జీర్ణశక్తి బాగుంటుంది
* ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది.
* టి-లింఫోసైట్స్ పనితనం పెరుగుతుంది
* ఎన్కేఫాలిన్ అనే సహజనొప్పి నివారణ రసాయనం విడుదల అవుతుంది.
* క్యాన్సర్ కణాలను చంపే కిల్లర్ సెల్స్ ఉత్పత్తి పెరుగుతుంది
* టి.సెల్స్ మరియు బి.సెల్స్ ను పెంచుతుంది.
* దంతాలకు, చిగుళ్లకు మంచి వ్యాయామం.
* సీరం కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది.
* కోపానికి మంచి మందు
* శ్వాస సంబంధ సమస్యలను నివారించే “ఇమ్మ్యూనో గ్లోబ్యులిన్” ఏ, బి ల ఉత్పత్తి పెరుగుతుంది
* మానసిక ఉల్లాసం కలుగుతుంది.
* నవ్వడం వల్ల స్నేహితులు పెరుగుతారు- శత్రువులు తగ్గిపోతారు.

ఇలా ఎన్నో లాభాలు ఉన్న “నవ్వు “ అనేది ఎక్కడ చూసినా చౌకగా దొరికే ఒక మాత్ర లాంటిది. చాలామంది కోపం, నిరాశ, నిస్పృహ, ఒత్తిడి వంటి ఖరీదైన మాత్రలను కష్టపడి కొనుక్కుని మరీ మింగుతుంటారు. అంతకన్న చౌకగా దొరికే “నవ్వు “ మందు లాగా వాడితే, ఎన్నో లాభాలు ఉన్నాయి… ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు!

ఈ నేపథ్యంలో ఎక్కడ చూసినా లాఫింగ్ క్లబ్బులు నవ్వుల క్లినిక్కులు, హాస్య కార్యక్రమాలు , హాస్య వల్లరులు వంటి కార్యక్రమాలు క్రమక్రమంగా ఎక్కువ అవుతున్నాయి. మే నెల మొదటి ఆదివారం నవ్వుల దినోత్సవంగా జరుపుకోవాలని ప్రపంచవ్యాప్తంగా అందరూ కలిసి నిర్ణయం తీసుకున్నారు.

మనుషులు అప్పుడప్పుడైనా మనసారా నవ్వాలి లేదంటే , ” నవ్వడం భోగం.. నవ్వించడం యోగం.. నవ్వక పోతే రోగం” అని జంధ్యాల గారు చెప్పిన మాట నిజమవుతుంది.. నవ్వండి.. నవ్వించండి.

 

 

సి.ఎస్.సలీం బాషా,
లాఫ్ తెరపిస్ట్.. లాఫ్టర్ యోగా స్పెషలిస్ట్
9393737937

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *