ఆర్టీసి సమ్మె మీద ఆగ్గిఫైరైన కెసిఆర్, మూడు రోజుల్లో బస్సులన్నీ నడపాల్సిందే…

ముఖ్యమంత్రి కెసిఆర్ రవాణా శాఖ అధికారులక, పోలీసులకు పెద్ద పరీక్ష పెట్టారు. మూడు అంటూ  మూడు రోజుల్లో నిలిచిపోయిన ఆర్టీసి బస్బసులు  వందకు వంద శాతం నడిచి తీరాలని షరతు పెట్టారు.

దీనికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు వెంటనే  చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఈ రోజ జరిగిన సమీక్షా సమావేశంలో అధికారులను ఆదేశించారు.

తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్‌ చేస్తూ కార్మికులు చేపట్టిన సమ్మె ఉధృతంగా  కొనసాగుతోంది. సమ్మెను ఇంకా ఉద్ధృతం చేసేందుకు ఆర్టీసీ కార్మిక సంఘాల ఐకాస కార్యాచరణ ప్రకటించింది. ఇందులో భాగంగా ఈనెల 19న తెలంగాణలో బంద్‌ పాటించాలని పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలోొ కెసిఆర్ అల్టిమేటమ్ జారీ చేశారు.

బస్సులు వందకు వంద శాతం పునరుద్ధరించడానికి కొద్ది రోజులు పట్టే అవకాశం ఉండడంతో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఉండేందుకు రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు దసరా సెలవులను ఈ నెల 19 వరకు పొడిగిస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు.

‘‘ఆర్టీసీలో నూటికి నూరు శాతం బస్సులను పునరుద్ధరించాలి. దీనికోసం అసవరమైన సిబ్బందిని వెంటనే తీసుకోవాలి. రిటైర్డ్ ఆర్టీసీ డ్రైవర్లు, రిటైర్డ్ పోలీస్ డ్రైవర్లను ఉపయోగించుకోవాలి. బస్సులు, భారీ వాహనాలు నడిపిన అనుభవం కలిగిన వారిని పనిలోకి తీసుకోవాలి. అధికారులు రేయింబవళ్లు పని చేయాలి.  మూడు రోజుల్లో గడువిస్తున్నాను. వందకు వంద శాతం బస్సులు నడిచేలా చూడాలి’’ అని సిఎం ఆదేశించారు.

అంతేకాదు, తాను చేసిన ఆర్టీస పునర్వ్య వస్థీకరణను కూడా ఇపుడే అమలుచేయాలని ఆయన ఆదేశించారు.

‘‘ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించిన ప్రకారం ఆర్టీసీలో 50 శాతం (5,200) సంస్థ సొంత బస్సులు నడపాలి. ఇందుకు అవసరమైన సిబ్బదిని వెంటనే నియమించాలి. 30 శాతం(3,100) అద్దె బస్సులు నడపాలి. ఇందులో ఇప్పటికే 21 శాతం ఉన్నాయి. మరో 9 శాతం బస్సుల కోసం వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలి. 20 శాతం(2,100) ప్రైవేటు బస్సులకు స్టేజీ క్యారేజీలుగా రూట్ పర్మిషన్లు ఇవ్వాలి. దీనికోసం అవసరమైన కసరత్తు చేయాలి’’ అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

చట్ట విరుద్ధంగా జరుగుతున్న సమ్మెను ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ గుర్తించదని, సమ్మె చేస్తున్న వారితో చర్చలు కూడా జరపదని సిఎం మరోమారు స్పష్టం చేశారు.

 విధులకు గైర్హాజరైన వారిని తిరిగి ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి ఉద్యోగాల్లో చేర్చుకునే ప్రసక్తే లేదని కూడా సిఎం ప్రకటించారు.

సమ్మెలో పాల్గొనకుండా విధులు నిర్వర్తిస్తున్న వారికి సంబంధించిన సెప్టెంబర్ మాసం జీతాలు చెల్లించాలని అధికారులను ఆదేశించారు.

50 శాతం ఆర్టీసీ బస్సులు నడపడానికి అవసరమైన సిబ్బందిని వెంటనే నియమించాలని, 30 శాతం బస్సులను అద్దె ప్రాతిపదికన, 20 శాతం ప్రైవేటు బస్సులకు స్టేజీ క్యారేజీలుగా రూట్ పర్మిట్లు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

 వారం రోజులుగా మొక్కవోని ధైర్యం ప్రదర్శిస్తూ కార్మికులు         చేస్తునన ఆర్టీసీ సమ్మె వల్ల ఉత్పన్నమైన పరిస్థితులపై ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం ప్రగతి భవన్ లో సమీక్ష సమావేశం నిర్వహించారు.

మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే బాల్క సుమన్, సీనియర్ అధికారులు సునిల్ శర్మ, నర్సింగ్ రావు, సందీప్ సుల్తానియా, ట్రాన్స్ పోర్టు జాయింట్ కమిషనర్లు పాండురంగ నాయక్, సి.రమేశ్, మమతా ప్రసాద్, డిటిసిలు ప్రవీణ్ రావు, పాపారావు, ఆర్టీసీ ఇ.డి.లు టివి రావు, యాదగిరి, వినోద్, వెంకటేశ్వర్లు, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.

‘‘యూనియన్ నాయకుల పిచ్చిమాటలు నమ్మి కార్మికులు అనధికారికంగా గైర్హాజరయి తమంతట తామే ఉద్యోగాలు వదులుకున్నారు. అంతే తప్ప ఎవరినీ ఎవరు డిస్మిస్ చేయలేదు. గతంలో ఎన్నడూ లేని విధంగా సూపర్ వైజర్లను కూడా సమ్మెలోకి లాగారు. యూనియన్ నాయకులు అత్యంత బాధ్యతా రహితంగా వ్యవహరించి 48 వేల మంది ఉద్యోగాలు పోయేలా చేశారు. విధులకు హాజరుకాని వారిని తిరిగి విధుల్లోకి తీసుకునే అవకాశమే లేదు. వారితో చర్చలు జరిపే ప్రసక్తే లేదు, ఆ ప్రశ్నే ఉత్పన్నం కాదు. పండుగ సమయంలో ప్రజలను ఇబ్బందులకు గురిచేసి, ఆర్టీసీని నష్ట పరిచిన కార్మికులను క్షమించే ప్రసక్తే లేదు. అసలు వారు చేస్తున్నది సమ్మె కానే కాదు. అది చట్ట విరుద్ధమైన ప్రజలకు అసౌకర్యం కల్పించే చర్య మాత్రమే. ఈ విషయంలో ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తుంది. విధులకు హాజరైన ఉద్యోగులు, కార్మికుల సెప్టెంబర్ నెల జీతం వెంటనే విడుదల చేస్తాం’’ అని ముఖ్యమంత్రి ప్రకటించారు.

‘‘అర్థరహిత డిమాండ్లతో, చట్ట విరుద్ధంగా కార్మికులు చేస్తున్న సమ్మెకు రాష్ట్రంలో కొన్ని రాజకీయ పక్షాలు మద్దతు ఇవ్వడం అనైతికం. ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తూ, న్యాయ సమ్మతం కాని కోర్కెలతో సమ్మె చేసే వారికి మద్దతిచ్చే రాజకీయ పక్షాలకు ప్రజల మద్దతు లేదు. అసలు రాష్ట్రంలో సరైన ప్రతిపక్షమే లేదు. రాష్ట్రంలో పరిస్థితి నాదాన్ దుష్మన్ అనే విధంగా ఉంది. రాజకీయ ప్రయోజనం కోసం గోతికాడి నక్కల్లా ఎదురు చూస్తున్నాయి. వారి ఆశ ఫలించదు. సమ్మెకు మద్దతు ఇస్తున్న పార్టీలకు ప్రజల నుంచి చీత్కారం తప్పదు. గతంలో అనేక విషయాల్లో తప్పుడు వైఖరి అవలంభించడం వల్లే వారు ప్రజల మద్దతు కోల్పోయారు. ఆర్టీసీ విషయంలో కూడా అలాగే జరుగుతుంది. ఇక్కడ ఆర్టీసీ కార్మికులు కోరుతున్న డిమాండ్లలో వేటిని కూడా ఆయా రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అమలు చేయడం లేదు. ప్రజలు ఈ విషయాన్ని గమిస్తున్నారు’’ అని ముఖ్యమంత్రి విమర్శించారు.

‘‘బిజెపి నాయకులు ఇక్కడ బాగా మాట్లాడుతున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ఇండియన్ రైల్వేస్ ను ప్రైవేటీకరిస్తున్నది. ఎయిర్ లైన్స్ ను ప్రైవేటీకరించింది. చివరికి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ను కూడా ప్రైవేటీకరించింది. రైళ్లను ప్రైవేటీకరిస్తున్నది. వివిధ ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడులు ఉపసంహరించుకోవడం ద్వారా నిధులు సమకూర్చుకుంటామని కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లోలోనే చెప్పింది. అక్కడి వారి ప్రభుత్వం ఇలా చేస్తుంటే, ఇక్కడి ఆ పార్టీ నాయకులు మాత్రం అందుకు విరుద్ధంగా మాట్లాడుతున్నారు’’ అని కేసీఆర్ అన్నారు.

‘‘ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని యూనియన్లుగా చెప్పుకునే వారు ప్రకటిస్తున్నారు. ఉదృతం చేసినా, పిల్లిమొగ్గలు వేసినా ప్రభుత్వం చలించదు. బెదిరింపులకు భయపడదు. బస్సులు నడిపి, ప్రజలకు రవాణా సౌకర్యం కల్పించే విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తుంది. బస్సులను ఆపి, బస్టాండ్లు, బడ్ డిపోల వద్ద అరాచకం చేద్దామని చూస్తే సహించేది లేదు. గుండాగిరి నడవదు. ఇప్పటి వరకు ప్రభుత్వం కాస్త ఉదాసీనంగా ఉంది. ఇకపై కఠినంగా వ్యవహరిస్తుంది. బస్ స్టాండ్లు, బస్ డిపోల వద్ద ఎవరు బస్సులను ఆపినా, విధ్వంసం సృష్టించినా వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది’’ అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

సమీక్ష సమావేశం నుంచే ముఖ్యమంత్రి కేసీఆర్ డిజిపి మహేందర్ రెడ్డితో ఫోన్లో మాట్లాడారు. ‘‘ప్రతీ ఆర్టీసీ డిపో, బస్టాండ్ల వద్ద పోలీసు బందోబస్తును పెంచండి. అన్ని చోట్ల సిసి కెమెరాలు పెట్టండి. మహిళా పోలీసులను కూడా బందోబస్తు కోసం వినియోగించండి. నిఘా పోలీసులనూ ఉపయోగించండి. ప్రజలను ఇబ్బందులకు గురిచేసే వారిని, బస్సులను ఆపేవారిని, ఇతర చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడే వారిని గుర్తించి, కేసులు పెట్టి,కోర్టుకు పంపాలి. ఉద్యమం పేరిట విధ్వంసం చేస్తే ఉపేక్షించాల్సిన అవసరం లేదు’’ అని డిజిపిని సిఎం ఆదేశించారు.

‘‘మూడు నాలుగు రోజుల్లోనే వందకు వంద శాతం ఆర్టీసీ బస్సులు నడుస్తాయి. అప్పటి వరకు విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల సెలవులను ఈ నెల 19 వరకు పొడిగిస్తున్నం. సిలబస్ నష్టపోకుండా భవిష్యత్తులో రెండో శనివారం విద్యా సంస్థలు నడపాలి. అవసరమైతే ఇతర సెలవులను తగ్గించుకోవాలి. 21వ తేదీ నుంచి అన్ని బస్సులు అందుబాటులోకి వస్తాయి. బస్ పాస్ విషయంలో ఒక్క విద్యార్థి కూడా బాధ పడొద్దు. కాబట్టి బస్ పాసులున్న విద్యార్థులు యధావిధిగా తమ విద్యాసంస్థలకు వెళ్లవచ్చు’’ అని సిఎం ప్రకటించారు.