హరీష్ రావ్, నువ్వు తాగిన నీళ్ల ప్రాజక్టు ఎవరు కట్టారో తెలుసా: జగ్గారెడ్డి

తెలంగాణలో కాంగ్రెస్ నిర్మించిన ప్రాజక్టుల మీద బహిరంగ చర్చకు రావలిసిందిగా సంగారెడ్డి ఎమ్మెల్యే తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జగ్గారెడ్డి టిఆర్ ఎస్ మాజీ మంత్రి హరీష్ రావుకు  సవాల్ విసిరారు.
రెండు రోజులుగా హరీష్ రావుకు,  ఎమ్మెల్యేకు మధ్య మాట యుద్ధం నడుస్తూ ఉంది.
తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ ప్రాజక్టులు నిర్మించక పోతే, ఈ రోజు టిఆర్ ఎస్ ముఖ్యమంత్రి ప్రారంభించిన కాళేశ్వరం వల్ల ప్రయోజనం నెరవేరేదే కాదని ఆయన అన్నారు.
ఈ రోజు విలేకరులతో మాట్లాడుతూ గొప్పగా ప్రారంభించిన కాళేశ్వరం నీళ్లు ఎందులో నింపుతున్నారో తెలుసుకోవాలని జగ్గారెడ్డి హరీష రావుకు గుర్తుచేశారు.
‘కాళేశ్వరం నీళ్ళు ఎందులో నింపుతున్నావ్? కాంగ్రెస్ కట్టిన సింగూర్, మంజీరా డ్యామ్ లలోనే కదా. మేము ఎన్ని కట్టినము. నువ్వు ఎన్ని కట్టినవ్? బహిరంగ చర్చ కు రా, అమరవీరుల స్థూపం దగ్గర చర్చిండానికి మేము రెడీ.దమ్ముంటే చర్చకు రా,’ అని జగ్గారెడ్డి సవాల్ విసిరారు.
హరీశ్ రావు తిన్నింటి వాసాలు లెక్కపెట్టేలా మాట్లాడు తున్నారని, నిందలు వేస్తున్నారని మండిపడ్డారు.
‘తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనే. సోనియా గాంధీయే. ఆమె తెలంగాణ ఇస్తేనే మీ కుటుంబానికి ఇన్ని పదవులు వచ్చాయి. అంబేడ్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు పేరు మార్చి కాళేశ్వరం గా ప్రారంభించారు. సింగూర్, మంజీరా, ఎస్ ఆర్ ఎస్ పి, నాగార్జునసాగర్,శ్రీశైలం,దేవాదుల,జూరాల, మంజీరా, ఎల్లంపల్లి, బీమా, నెట్టoపడు,కోయల్ సాగర్, గడ్డన్న వాగు,పెద్దవాగు,అలిసాగర్, గుత్ప, చౌట్ పల్లి కట్టింది మేమే. రాష్ట్రంలో మిగతా డ్యామ్ లన్నీ కట్టింది కాంగ్రెస్ పార్టీనే..కాంగ్రెస్ ముఖ్యమంత్రులే ఈ ప్రాజెక్టు లన్నీ కట్టారు. ఈ విషయం హరీష్ రావు తెలుసుకోవాలె,’ అని ఆయన అన్నారు.
కేవలం ఒక్క కాళేశ్వరం కట్టి మీరు ఇంత ఎగిసెగిసి పడి చేసుకుంటున్నారని అంది మంచిది కాదని జగ్గారెడ్డి మందలించారు.
ఉమ్మడి మహబూబ్ నగర్, ఆదిలాబాద్, వరంగల్,కరీంనగర్ జిల్లాలో ప్రాజెక్టు లను కట్టిందెవరో తెలుసా? కాంగ్రెస్ పార్టీ ఏమి చేయలేదు అని చెప్పి పార్టీనే లేకుండా చేయాలని కుట్ర చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘ హరీశ్ రావు బహిరంగ చర్చకురావాలి. రాకపోతే మేము కట్టిన ప్రాజెక్టుల దగ్గర నేను తీసుకు పోయి చూపిస్తాను, కాంగ్రెస్ పార్టీ కి చరిత్ర లేకుండా చేయాలని రాజకీయ కుట్ర చేశారు. మేము ప్రాజెక్టులను అడ్డుకోవాలని చెప్పలేదు.దాంట్లో జరిగిన అవినీతి గురించి భట్టి ప్రశ్నించారు,’ అని ఆయన అన్నారు.
‘హరీష్ రావు చెత్త మాటలు మాట్లాడకు.మీకు కెసిఆర్ కు ఏమైనా పర్సనల్ గా ఉంటే మీ ఇంట్లో చూసుకోండి. హరీష్ రావూ! నీలాగా గుంతలు నేను తవ్వను, స్ట్రెయి ట్ ఫార్వార్డ్ గా ఉంటాను. ఇంకో సారి కాంగ్రెస్ పార్టీ డ్యామ్ లు కట్టలేదు అంటే మేము ఉరుకోము.జాగ్రత్త హరీష్ రావు,’ అని హెచ్చరించారు.
‘ కాళేశ్వరం నీళ్లు ఇంకా రాలేదు కదా, ఇప్పటి దాకా సిద్దిపేట జనాలు ఏ నీళ్లు తాగారు. కాంగ్రెస్ పార్టీ కట్టిన సింగూర్ డ్యామ్ నీళ్లు తాగే ఇంత పెద్ద వాడివి అయినవని మరచి పోకు. నెహ్రు ఏమి చేసింది కేసీఆర్ ని అడుగు చెపుతడు.’ అని జగ్గారెడ్డి తీవ్రంగతా మందలించారు.