ఇంటర్ పేపర్ కరెక్షన్ పై మంత్రి ఆదిమూలపు క్లారిటీ

ఇంటర్మీడియట్ పరీక్షల మూల్యాంకనానికి సంబంధించిన విధివిధానాలపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్  అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

మే 11 నుండి ఇంటర్మీడియట్ పరీక్షల మూల్యాంకన ప్రక్రియ ప్రారంభించాలని ఆయన అధికారులను ఆదేశించారు.

తొలుత ఆరెంజ్, గ్రీన్ జోన్ జిల్లాల్లో మూల్యాంకన ప్రక్రియ, లాక్ డౌన్ అనంతరం రెడ్ జోన్ జిల్లాల్లో మూల్యాంకన ప్రక్రియ మొదలుపెట్టనున్నట్టు తెలిపారు.

13 జిల్లాల్లోనూ మూల్యాంకన కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. మూల్యాంకన ప్రక్రియ ముగిసేవరకు సిబ్బందికి భోజన, వసతి సౌకర్యాలు కల్పిస్తామన్నారు.

ప్రతి రోజూ రెండు షిప్టుల్లో మూల్యాంకన ప్రక్రియ కొనసాగుతుందన్నారు. కోవిడ్-19 జాగ్రత్తలు పాటిస్తూనే మూల్యాంకన ప్రక్రియకు ఏర్పాట్లు చేస్తామన్నారు.

ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాలు పాటించాలని సూచించారు.

జూన్ చివరి నాటికి ఇంటర్మీడియట్ బోర్డు వెబ్ సైట్ లో ఆన్ లైన్ తరగతులు, వీడియో పాఠాలు, ప్రాక్టికల్స్ కు సంబంధించిన వీడియోలు అందుబాటులోకి తెస్తామన్నారు.