హరీష్ రావు ఈ రోజు ఎం చేప్పారంటే…

 బాగా చదవండి. బాగా ఆడండి. సోషల్ మీడియా బారిన పడి మీ జీవితాలు నాశనం చేసుకోవద్దు. సిద్ధిపేట జిల్లా నుంచి రాష్ట్ర క్రీడాకారులుగా ఎదగాలని మాజీ మంత్రి హరీశ్ రావు తన నియోజకవర్గంలోని క్రీడాకారులకు పిలుపునిచ్చారు.
జిల్లా కేంద్రమైన సిద్ధిపేట స్టేడియంలో గురువారం ఉదయం జిల్లా అథ్లెటిక్స్ అసోషియేషన్ ఆధ్వర్యంలో 6వ జిల్లా స్థాయి జూనియర్ అథ్లెటిక్స్ ఎంపికల టోర్నమెంట్ కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది.
ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి హరీశ్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. సిద్ధిపేట జిల్లా నుంచి క్రీడాకారులు చక్కని ప్రతిభ కనబర్చి తెలంగాణ రాష్ట్ర క్రీడాకారులుగా ఎదగాలని ఆకాంక్షించారు.
మూడేళ్లుగా జిల్లా అథ్లెటిక్స్ టోర్నీ నిర్వహిస్తున్న నిర్వాహకులను అభినందించారు. ఇవాళ జరుగుతున్న 6వ జూనియర్ స్థాయి అథ్లెటిక్స్ అసోషియేషన్ టోర్నమెంట్ జరుపుకోవడం, ఇప్పటికే సిద్ధిపేట జిల్లా నుంచి 28 క్రీడాకారులను జాతీయ స్థాయికి వెళ్లడం అభినందించాల్సిన విషయమని పేర్కొన్నారు.
సిద్ధిపేట జిల్లా విద్య, వైద్యం, పదవ తరగతి పరీక్షల్లో రాష్ట్రస్థాయిలో ద్వితీయ స్థానం పొందామని, అదే తరహాలోనే క్రీడలో మొదటి స్థానంతో ఉండాలని కోరారు. పీఈటీల కోరిక మేరకు అథ్లెటిక్స్ ట్రాక్ ను త్వరలోనే పోలీసు పరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేస్తానని భరోసా ఇచ్చారు.
అంతర్జాతీయ స్థాయిలో సిద్ధిపేటలో స్విమ్మింగ్ ఫూల్ నిర్మించినట్లు, స్టేడియం ఆవరణలో అలాగే ఫుట్ బాల్ కోర్ట్, బాస్కెట్ బాల్ కోర్టు, ఇండోర్ షెడ్, హ్యాండ్ బాల్, జిమ్ లను సద్వినియోగమయ్యేలా పీఈటీలు చొరవ చూపాలని సూచించారు.
ఆరోగ్య సిద్ధిపేటకు పీఈటీలు చొరవ తీసుకుని సిద్ధిపేటలోని ప్రతి పౌరుడు ఆరోగ్యంగా ఉండేలా యోగా, వాకింగ్ లను చేయించాలని చెప్పుకొచ్చారు. ఆరోగ్య సిద్ధిపేటలో భాగంగా.. అనారోగ్యాలు రాకుండా పీఈటీలు సమన్వయంగా పిల్లల తల్లితండ్రులను భాగస్వామ్యం చేస్తూ వారిలో చైతన్యం తేవాలని కోరారు. ఈ విషయమై త్వరలోనే పీఈటీలతో ఆరోగ్య సిద్ధిపేటగా తీర్చిదిద్దేందుకు చేపట్టాల్సిన ప్రణాళికలపై సమీక్షిస్తానని, ప్రజా ఆరోగ్య అవసరాలు, వారి అవగాహన కోసం కావాల్సిన, అవసరమైన అంశాల నివేదికలతో సిద్ధంగా ఉండాలని పీఈటీలకు సూచించారు. మనిషి ఏకాగ్రత పెంచడంలో ఫిజికల్ ఫిట్ నెస్ చాలా అవసరం, ఉపయోగకరమైన ప్రధాన కర్తవ్యమని చెప్పుకొస్తూ..
” డోంట్ వేస్ట్ మచ్ టైమ్ ఆన్ సోషల్ మీడియా ” సోషల్ మీడియా బారిన పడి యువత తమ జీవితాలను నాశనం చేసుకోవద్దకు యువతకు పిలుపునిచ్చారు.
అంతకు ముందు మున్సిపల్ ఛైర్మన్ రాజనర్సు మాట్లాడుతూ.. పదేళ్ల కింద సిద్ధిపేటలో క్రీడా మైదానం లేదని, సంగారెడ్డి వెళ్లి వ్యయప్రయాసాలకు గురయ్యేవాళ్లమని.., మాజీ మంత్రి హరీశ్ రావు గారి ప్రత్యేక చొరవతో అద్భుతంగా క్రీడా మైదానం ఏర్పడిందని చెప్పారు. సిద్ధిపేటను అన్నీ రంగాలలో అభివృద్ధి చేశారని, క్రీడలలో కూడా బాగా రాణించి సిద్ధిపేట జిల్లాకు పేరు ప్రతిష్టలు తేవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అథ్లెటిక్స్ అసోషియేషన్ అధ్యక్షుడు పరమేశ్వర్, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.