టిడిపి, వైసిపి పార్టీల అవిశ్వాస తీర్మానం మీద అనుమానాలు

ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం అన్యాయం చేసిందని అందుకు గాను ఏపీకి చెందిన అధికార టిడిపి , ప్రతిపక్ష వైసిపి లు వేరు వేరుగా అవిశ్వాస తీర్మానా లు  ప్రవేశపెట్టాయి. అయితే కేంద్రం ఉధ్దేశపూర్వకంగా సాంకేతిక కారణాలను చూపుతూ సభను వాయిదా వేస్తూవస్తున్నది. ఈ క్రమములో కేంద్రం పార్లమెంటరీ సాంప్రదాయాలను ఉల్లంఘిస్తున్న తీరును డిల్లీ కేంద్రంగా ఎండగట్టాల్సిన బాద్యత ఇరు పార్టీల మీద ఉంది. కానీ అందుకు భిన్నంగా తాము కేంద్రంపై అవిశ్వాసాన్ని పెడుతున్నామన్న విషయాన్ని కూడా మరచి పరస్పరం ఒకరిని ఒకరు నిందించుకుంటూ పలుచన అవుతున్నారు.ఫలితంగా పార్టీల ‘అవిశ్వాసం’ ప్రజల విశ్వాసాన్ని క్రమేనా కోల్పోతున్నది.

తాము చేస్తే పోరాటం ఇతరులు చేస్తే మాత్రం సావాసం అంటున్న టిడిపి

గడిచిన నాలుగు సంవత్సరాలుగా కేంద్రంతో రాజకీయంగా సావాసం చేసిన అధికార టిడిపి నెల రోజుల క్రితమే తెగదెంపులు చేసుకుంది. విడిపోయినారో లేదో ఆ మరుక్షణమే యుద్ధం ప్రకటించారు. ఏ ప్రభుత్వం అయినా ఒక రాష్ట్రానికి సాయం చేయాలన్నా లేదా అన్యాయం చేసినా అది ఒక రోజులో జరగదు. ఇపుడు ఏపీ విషయంలో కేంద్రం వ్యవహరించిన తీరు కూడా అంతే. 2014 నుంచి 15, 16, 17 ఇలా వరుస బడ్జెట్ లో రాష్ట్రానికి తగిన సాయం చేయడంలో కేంద్రం విఫలమైంది. పరోక్షంగా టిడిపి కూడా పెదవి విరిచిన సందర్భాలు అనేకం ఉన్నాయి. కానీ నాడు వారు కేంద్రంతో రాజకీయంగా కలిసి ఉన్నారు కనుక గట్టిగా సమర్థించి నారు. నేడు అదే కేంద్రంతో విడిపోయినారు కాబట్టి అంతే గట్టిగా విమర్శలు చేస్తున్నారు. ఆ విమర్శలు కూడా రాష్ట్రానికి చేసిన అన్యాయంపై మాత్రమే కాకుండా ఇతర అంశాలపైనా చేస్తున్నారు. అమిత్ షా కుమారుడి అవినీతి వ్యవహరం, తమిళనాడులో నాడు, నేడు కేంద్రం చేస్తున్న రాజకీయాలపై కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. మరి ఆ ఘటనలు జరిగి చాలా రోజులు అయింది మరి ఇపుడే ఎందుకు చేస్తున్నట్లు? కేవలం రాజకీయంగా ఉన్న అనుబంధం ఆదారంగా మీరు వ్యవహరిస్తారు అన్నమాట. అవిశ్వాసం మొదట ప్రవేశపెట్టడానికి పూనుకున్నది వైసిపి. ప్రారంభంలో విభేదించి తర్వాత మద్దతు అని ప్రకటించి నేడు వారే స్వయంగా నోటీసులు ఇస్తున్నారు. ఈ సందర్బంలో కూడా కేంద్రం చేసిన సాయం, అవిశ్వాసంపై నిర్ణయం తీసుకోవడంలో కేంద్రం అనుసరిస్తున్న పద్ధతులపై కాకుండా కేంద్రంతో ప్రతిపక్ష వైసిపి ఎలా వ్యవహరిస్తున్నది అన్న విషయాలపై దృష్టి పెడుతున్నారు. అందుకు ఒక ఉదా. విజయసాయి రెడ్డి ప్రధాని కార్యాలయంలో ఎందుకు ఉన్నారు, వారికి ఎందుకు నమస్కరిస్తున్నారు లాంటి అప్రధానమైన అంశాలను చర్చకు పెడుతున్నారు. కేంద్రాన్ని రాష్ట్ర ప్రజల ముందు దోషిగా చూపి అలాంటి కేంద్రంతో సావాసం చేసే పార్టీగా వైసిపి ని ప్రజల ముందు నిలబెట్టాలన్న ఆలోచన తప్ప మరోటి లేనట్లుగా టిడిపి రాజకీయం చూస్తుంటే అర్థం అవుతుంది. ఆ పని చేయడానికి డిల్లీకి వెళ్లి అవిశ్వాసం పెట్టాలా ?

మోది పై అవిశ్వాసం పెట్టి చంద్రబాబును విమర్శించాలా?

ప్రతిపక్ష వైసిపి కూడా కేంద్రం పై అవిశ్వాసం తీర్మాణాన్ని పెడుతూనే అవకాశం దొరికినపుడల్లా చంద్రబాబును ముద్దాయిగా చూపే ప్రయత్నం చేస్తున్నది. మోదీతో వైసిపి సన్నిహితంగా ఉంటుంది అని టీడీపీ ఒక వైపు విమర్శలు చేస్తుంటే అందుకు ప్రతిగా మీరే వారితో స్నేహంగా ఉంటున్నారు అన్న విమర్శలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. తాము మోదీతో సావాసం చేయడంలేదని గట్టిగా ఒక సారి చెపితే సరిపోతుంది. కానీ దానికి ప్రతిరోజూ వివరణ ఎందుకు ఇవ్వాలి. అధికార టిడిపి ఎన్నిసార్లు వివరణ ఇచ్చినా ఉద్దేశపూర్వకంగానే అసత్యాలు చెపుతున్నకారణంగా తాము వివరణ ఇవ్వాల్సి వస్తుందని వైసిపి మాట్లాడవచ్చు. నేడు వైసిపి రాజకీయంగా కేంద్రంతో లేదు. కానీ పదే పదే టిడిపి వారిపై విమర్శలు ఎందుకు చేయగలుగుతుంది. కేంద్రంతో నేడు అధికారికంగా వైసిపి స్నేహం చేయకపోయినా దాదాపు కీలకమైన సందర్భంలో కేంద్రానికి మద్దతు పలికింది. అంతే కాదు విజయసాయిరెడ్డి వివిద సందర్భాలలో మాట్లాడుతున్న పద్ధతిని పరిశీలిస్తే తమ రాజకీయ ప్రత్యర్ది తమను విమర్శించడానికి అవకాశం కల్పించే విధందా ఉందనడంలో సందేహంలేదు. ఒక ప్రభుత్వంపై అవిశ్వాసం పెడుతున్నారంటే అన్నివిధాల ఆ ప్రభుత్వానికి పాలించే నైతికత లేదని అర్థం. అలాంటి మార్గాన్నీ ఎంచుకున్న వైసిపి ప్రధానికి సంస్కారం ఉందని, కేంద్రం హోదా ఇస్తుందన్న నమ్మకం ఉందని ( విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకే లికితపూర్వకంగా కేంద్రం సభలో హోదా ఇచ్చేది లేదని ప్రకటించింది) హోదా ఇస్తుందని మాట్లాడటం వలన తన ప్రత్యర్థులకు అవకాశం కల్పించినట్లు అవుతున్నది. అంతే కాకుండా పదే పదే కేంద్రంతో బాబు ఇంకా అవకాశం ఉంటే కలిసి ఉండటానికి ప్రయత్నిస్తున్నారన్న విమర్శలు అర్థరహితం. బాబుగారి నీజాయితీ వేరు చేస్తున్న రాజకీయం వేరు. కేంద్రంతో బాబు విడిపోవడానికి బలమైన కారణం రాష్ట్రానికి చేసిన అన్యాయం కన్నా మారుతున్న రాజకీయ సమీకరణలే ప్రదానం. ఈ విషయాన్ని అమిత్ షా గుర్తించినారు కానీ వైసిపి మాత్రం ఇంకా గుర్తించినట్లులేదు. కేంద్రంపై అవిశ్వాసం పెట్టి డిల్లీలో బాబును విమర్శించాల్సిన పనిలేదు,దాని వల్ల పెద్ద ప్రయోజనం కూడా ఉండదు. అలా అని బాబుగారు చేస్తున్న తప్పులు లేవా అంటే చాలానే ఉన్నాయి. కేంద్రాన్ని ప్రశ్నించే సమయంలో బాబును విమర్శించడం అంత మంచిది కాదు. బాబు చేసిన తప్పులను మాట్లాడాలంటే అందుకు వేదిక అసెంబ్లీ. వద్దు అనుకుంటే ఆంద్రప్రదేశ్ రాష్ట్రమే వేదికగా మాట్లాడవచ్చు, డిల్లీకి వెళ్లి అవిశ్వాసం పెట్టనవసరంలేదు.

రెండు పార్టీలకు కేంద్రంలోనీ అదికార పార్టీ రాష్ట్రంలో తన రాజకీయ ప్రత్యర్ది కాదు. కనుకనే టిడిపి, వైసిపిలు కేంద్రం పై యుద్ధం కాకుండా ఇరువురు పరస్పరం తామే యుద్ధం చేసుకుంటున్నాయి. అవిశ్వాసం తీర్మాణం ప్రయోజనాలు రెండు 1. అవకాశం ఉంటే ప్రభుత్వాన్ని పడగొట్టడం 2. అది సాధ్యం కాకపోతే ప్రజలలో విశ్వాసాన్నీ పొందటం. పార్లమెంటులో చర్చకు రావడం అనుమానంగా ఉంది. వచ్చినా అది విజయం సాధించదు. కనుక ప్రధమ లక్ష్యం నెరవేరదు. రెండు పార్టీలు పరస్పరం చేసుకుంటున్న విమర్శల కారణంగా ప్రజల విశ్వాసాన్ని కూడా పొందలేని పరిస్దితి టిడిపి వైసిపి పార్టీలది.

-మాకిరెడ్డి పురుత్తం రెడ్డి
9490493436

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *