చాన్నాళ్ల తర్వాత మళ్లీ కూత పెట్టిన తెలంగాణ ఎక్స్‌ప్రెస్

 లాకౌ డౌన్ వల్ల మూగవోయిన రైళ్లు మళ్లీ కేక వేసి రారమ్మని దేశ ప్రజలను పిలుస్తున్నాయి. కరోనా వల్ల మార్చి 25న మొదలయిన లాక్‌డౌన్‌తో రెండు నెలలకు ఈ రైళ్లన్నీ  షెడ్లకే పరిమితమయ్యాయి ఇపుడు  మళ్లీ ఒళ్లు విరిచుకుని పట్టాలెక్కుతున్నాయి.
ఇంటి దారి పట్టిన లక్షలాది మంది వలస కార్మికులను తరలించేందుకు  నడుస్తున్న కొన్ని శ్రామిక్ రైళ్లు తప్ప రెన్నెళ్లుగా  రైళ్ల రాకపోకలు స్తంభించిపోయా. ప్రజల ప్రయాణాలను బంద్ చేయడంతో రైళ్లు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. ఇపుడు కేంద్రం లాక్ డౌన్ నియమాలను సడలించడంతో ఇపుడు రైల్వేస్టేషన్ లన్నీ మళ్లీ జనంతో కలకలలాడటం మొదలయింది.
తొలివిడతగా  లాక్‌డౌన్‌ సడలింపులతో రాజధాని రైళ్లు తప్ప  దాదాపు మిగతా రైళ్లన్నీ పట్టాలెక్కాయి.
జూన్ 1న తొలి రోజు దేశవ్యాప్తంగా రెండు వందల రైళ్లు ప్రయాణాలు మొదలు పెడుతున్నాయి.  సుమారు లక్షా 45 వేల మంది తమ గమ్యస్థానాలకు వెళ్లనున్నారు.
అటు సికిందరాబాద్ కేంద్రంగా పనిచేసే  దక్షిణమధ్య రైల్వే పరిధిలో ఎనిమిది రైళ్లు నడుస్తున్నాయి. హైదరాబాద్ – న్యూఢిల్లీ మధ్య నడిచే తెలంగాణ ఎక్స్‌ప్రెస్ తొలి కూత పెట్టింది.
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌తో పాటు ఎనిమిది రైళ్లు ఇవే:  సచ్‌ఖండ్, దానాపూర్, గోల్కొండ, హుస్సేన్ సాగర్, ఫలక్‌నుమా, రాయలసీమ, గోదావరి ఎక్స్‌ప్రెస్,తెలంగాణ ఎక్స్ ప్రెస్‌.
వీటితో పాటు దురంతో ఎక్స్‌ప్రెస్‌, హజ్రత్‌ నిజాముద్దీన్, కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌ వంటి రైళ్లు కూడా దక్షిణ మధ్య రైల్వే పరిధి మీదుగా రాకపోకలు సాగిస్తాయి.
ఈ నెలాఖరు వరకు 25 లక్షల 82 వేల మంది రిజర్వేషన్‌ చేయించుకున్నట్టు రైల్వే అధికారులు ప్రకటించారు.
భౌతిక దూరం నిబంధన నేపథ్యంలో కేవలం రిజర్వేషన్‌ చేసుకున్న ప్రయాణికులను మాత్రమే అనుమతించనున్నారు. టికెట్ ఉన్నవారు మాత్రమే స్టేషన్లో కి రావాలి.
వెయిట్ లిస్ట్ జారీ చేసినా కేవలం రిజర్వేషన్‌ కన్ఫాం అయినవారిని మాత్రమే స్టేషన్ లోకి అనుమతిస్తారు.  జూన్‌ 29 నుంచి తత్కాల్ బుకింగ్ కూడా మొదలవుతుందని రైల్వే శాఖ ప్రకటించింది.
అటు సికింద్రాబాద్, హైదరాబాద్ రైల్వే స్టేషన్లలో ఆహారశాలలను కూడా ఓపెన్ చేశారు. అయితే కేవలం పార్శిల్ సర్వీసులకు మాత్రమే అనుమించారు.
ఇక, కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రయాణికులకు కఠిన నిబంధనలు అమలు చేస్తోంది రైల్వే శాఖ. ప్రయాణికులు 90 నిమిషాలకు మందే స్టేషన్‌కు రావాలనే నిబంధన విధించింది.
అంతేకాకుండా, మాస్కులు ధరిస్తేనే ప్రయాణానికి అనుమతిస్తున్నారు. అటు స్టేషన్లలో భౌతిక దూరం పాటించేలా మార్కింగ్ చేశారు.
ఆరోగ్య పరీక్షలు చేసిన తర్వాత మాత్రమే ప్రయాణికులను అనుమతిస్తున్నారు. అటు కరోనా అనుమానితుల కోసం ప్రతి రైళ్లో మూడు పీపీఈ కిట్లు అందుబాటులో వుంచారు.
సికింద్రాబాద్, హైదరాబాద్, లింగంపల్లి, విజయవాడ, గుంటూరు, తిరుపతి వంటి ప్రధాన స్టేషన్లతో పాటు రైళ్లు ఆగే అన్ని స్టేషన్లలో తగిన కరోనా పరీక్ష ఏర్పాట్లు చేశారు.