రాయలసీమలోనే రాజధాని ఏర్పాటు చేయాలి: బొజ్జా దశరథరామిరెడ్డి

అన్నీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డే చేస్తారన్న భ్రమలు వద్దు
అన్నీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డే చేస్తారన్న భ్రమలు వద్దనీ, అన్ని రంగాలలో వెనుకబడిన రాయలసీమ కు న్యాయం జరుగాలంటే ఇక్కడే రాజధానిని ఏర్పాటు చేయాలని జాతీయ రైతు సంఘాల సమాఖ్య ప్రధాన కార్యదర్శి బొజ్జా దశరథరామిరెడ్డి డిమాండ్ చేసారు.
గురువారం నంద్యాలలో శశి హోటల్ నందు రాయలసీమ సాగునీటి సాధన సమితి ఆధ్వర్యంలో శ్రీబాగ్ ఒడంబడిక – మూడు రాజధానులు, రాయలసీమ అభివృద్ధి అంశంపై విస్తృత స్థాయి చర్చ జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న బొజ్జా దశరథరామిరెడ్డి మాట్లాడుతూ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్వతో ముఖాభివృద్దికి చేపట్టవలసిన అంశాలపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన జి ఎన్ రావు కమిటి శ్రీబాగ్ ఒడంబడిక నేపథ్యంలో అధికార, అభివృద్ది వికేంద్రీకరణ చేయాలని పేర్కొనడాన్ని స్వాగతించారు. రాష్ట్రంలో న్యాయ రాజధాని, శాసన రాజధాని, కార్య నిర్వాహక రాజధాని ఏర్పాటుతో అధికార వికేంద్రీకరణను చేయాలని సంకల్పించడాన్ని స్వాగితిస్తున్నాము అని చెప్పారు.
ఈ సందర్భంగా అధికార వికేంద్రీకరణలో రాయలసీమ మోసపోయిందన్న భావనను సమావేశం ముందుంచారు. శ్రీబాగ్ ఒడంబడిక నేపథ్యంలో రాష్ట్ర రాజధాని లేదా హైకోర్టు ను ఎంచుకునే రాయలసీమకున్న హక్కును విస్మరించారని అన్నారు. హైకోర్టు ను కర్నూలు లో ఏర్పాటు చేస్తూ అమరావతి, విశాఖపట్నంలో హైకోర్టు బెంచ్ ల ఏర్పాటు చేయాలన్న కమిటి రిపోర్ట్ కూడా విస్మయాన్ని గురి చేసిందని అన్నారు. శ్రీబాగ్ ఒడంబడిక లోని అత్యంత కీలకమైన కృష్ణా, తుంగభద్ర నది జలాలలో రాయలసీమకున్న హక్కులను ప్రస్తావించకపోవడం మరియు కోస్తా జిల్లాలకు సమానంగా రాయలసీమ నెల్లూరు జిల్లాలలో అసెంబ్లీ స్థానాలు పెంపు ప్రస్థావన లేకపోవడం బాధాకరం అని అన్నారు. ఈ నేపథ్యంలో రాయలసీమ కు పూర్తి న్యాయం జరగాలంటే రాజధానిని రాయలసీమ లోనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసారు.

జి ఎన్ రావు, అన్ని రాజకీయ పార్టీలు అధినాయకులతో పాటు గౌరవ ఉప రాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు గారు పేర్కొన్న అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలన్న ఆకాంక్షను స్వాగతిస్తున్నాం అని అన్నారు‌. తుంగభద్ర ప్రాజెక్టు కింద హక్కు ఉన్న సుమారు 11 లక్షల ఎకరాలకు నీటిని పంట కాలువలు నిర్మాణం జరగక పోవడం వలన 1953 నుండి సాగునీటిని పొందలేక రాయలసీమ అభివృద్ధి చెందలేక పోయిందన్నారు. తుంగభద్ర ప్రాజెక్టు కింద రాయలసీమలో పంట కాలువల నిర్మాణం జరిగే వరకు కృష్ణా డెల్టా రబీకి ఈ నీటి వినియోగం చేసుకోవడానికి తాత్కాలిక అనుమతులు పొందిందన్నారు. 2019 వ సంవత్సరం వరకు కూడా నిర్మాణాలు పూర్తికాకపోవడం వలన ఈ నీటిని కృష్ణా డెల్టా యదేచ్చగా వాడుకుంటునే ఉందన్నారు. తుంగభద్ర ప్రాజెక్టు కింద 1953 నుండి నేటి వరకు అంటే 66 సంవత్సరాలుగా రాయలసీమ 11 లక్షల ఎకరాల నీటి హక్కు కలగానే మిగిలిందని,. ఈ నీటిని విని యోగించుకోలేక పోవడంతో రాయలసీమ 2019 లెక్కలు ప్రకారం ప్రతి సంవత్సరం సుమారు 8000 కోట్ల రూపాయలు వ్యవసాయ ఉత్పాదన కోల్పోతున్నదని వివరించారు. అదేవిధంగా శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం కృష్ణా పెన్నార్ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టక పోవడం వలన కూడా 20 లక్షల ఎకరాలకు అందవలసిన సాగునీటిని రాయలసీమ పొందలేక పోయిందని , ఈ నీటిని పొందక పోవడంతో 2019 లెక్కలు ప్రకారం ప్రతి సంవత్సరం సుమారు 15000 కోట్ల రూపాయలు వ్యవసాయ ఉత్పాదన రాయలసీమ కోల్పోతున్నదని ఆవేదన వ్యక్తం చేసారు. అంటే గత 63 సంవత్సరాలుగా రాయలసీమ కోల్పోయిన వ్యవసాయ ఉత్పాదన సుమారు 15 లక్షల కోట్ల రూపాయల వ్యవసాయ ఉత్పాదన రాయలసీమ నష్టపోయిందని, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని ఆకాంక్షను వ్యక్త పరుస్తున్న రాజకీయ పార్టీలు, నాయకులు ఈ విషయంపై ప్రత్యేక శ్రద్ధతో పనిచేసి రాయలసీమ నీటి హక్కులను వినియోగించుకునడానికి చేపట్టవలసిన అంశాలపై కృషి చేసి రాయలసీమ అభివృద్ధికి తోడ్పడాలని కోరారు.

ఈ సమావేశంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ మాజీ చైర్మన్ డాక్టర్ నౌమాన్, సీనియర్ వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ రవీంద్రనాథ్, విశ్రాంత ఆంధ్రా బ్యాంకు AGM వి. శివనాగిరెడ్డి, భారతీయ కిసాన్ సంఘ్ నాయకులు వంగాల సిద్దారెడ్డి, న్యాయవాది శంకరయ్య, ప్రజాస్వామ్య పరిరక్షణ హక్కుల వేదిక నాయకులు రామకృష్ణారెడ్డి, రాయలసీమ కో ఆర్డినేషన్ కమిటి సెక్రటరీ రాజు, నందిరైతు సమాఖ్య నాయకులు చంద్రశేఖర రెడ్డి, కే.సి. కెనాల్ పరిరక్షణ సమితి నాయకులు బాలీశ్వర రెడ్డి,మాజీ కౌన్సిలర్ మహమ్మద్ గౌస్, చెరుకూరి వెంకటేశ్వరనాయుడు,ఆల్ మదాడ్ నాయకులు రహీం,TDP బి.సి.సెల్ రాష్ట్ర నాయకులు జిల్లెల్ల శ్రీరాములు, కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి దాసరి చింతలయ్య, ఆత్మకూరు మాజీ MPP మోహన్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.