సీమ సత్యాగ్రహాన్ని విజయవంతం చేయండి

(యనమల నాగిరెడ్డి)
రాయలసీమ సమస్యలను పరిష్కరించడానికి, అవసరాలను తీర్చడానికి చేపట్టవలసిన చర్యల గురించి పాలకులకు, ప్రభుత్వం పెద్దల దృష్టికి తేవడం కోసం అనంతపురం జిల్లా కేంద్రంలో ఈ నెల 16 న జరుగుతున్న సీమసత్యాగ్రహం లో పాల్గొని విజయవంతం చేయాలని రాయలసీమ ఉద్యమ సంఘాల సమన్వయ సమితి నాయకులు రాంకుమార్, శ్రీనివాసులు, రామక్రిష్ట్న  అఖిలభారతకిసాన్ సంఘ్ నాయకులు ప్రభాకరరెడ్డి సంయుక్తంగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
రాయలసీమ సమస్యలు తీర్చడం కోసం నవంబర్ 16, 1937లో అప్పటి కోస్తా, రాయలసీమ ప్రాంత నాయకులు కుదుర్చుకున్న శ్రీభాగ్ ఒప్పందాన్ని ఆతర్వాత వచ్చిన పాలకులు, నాయకులు చెత్తబుట్ట పాలు చేశారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
ఆ ఒప్పందాన్ని మరోసారి నాయకులకు గుర్తు చేయడానికి, సీమవాసులు ఎదుర్కొంటున్న సాగు, తాగు నీటి వెతల గురించి మరో సారి పాలకుల దృష్టికి తేవడానికి  చేపట్టిన ఈ సత్యాగ్రహ దీక్షలో విరివిగా పాల్గొని సీమకు సంఘీభావం తెలపాలని వారు కోరారు. 
రాష్ట్రం  సమగ్రాభివృద్ధి చెందాలంటే రాయలసీమ కూడా మిగిలిన ప్రాంతాలతో సమానంగా అభివృద్ధి చెందాలని వారు అభిప్రాయపడ్డారు. వ్యవసాయరంగానికి అవసరమైన నీళ్లు సరఫరా చేయడానికి నిర్మాణంలో ఉన్న అన్ని సాగునీటి ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తీ చేయాలని, ప్రజలు ప్రశాంతంగా బ్రతకడానికి అవసరమైన  వసతులు కల్పించాలని, విద్యా , ఉపాధి, పారిశ్రామిక రంగాలలో ప్రాధాన్యమిచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని వారు కోరారు. 
 రాయలసీమ వాసుల న్యాయమైన కోరికలకు నేటికి ప్రాతిపదికగా నిలచిన శ్రీభాగ్ ఒప్పందం స్ఫూర్తిగా పాలకులు ఈ ప్రాంతానికి శాసనసభలో సమాన ప్రాతినిధ్యం కల్పించాలని, ఇప్పటికైనా సీమ అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలు రచించి అమలుకు శ్రీకారం  చుట్టాలని కోరుతూ ఈ సత్యాగ్రహం నిర్వహిస్తున్నామని వారు తెలిపారు. ఈ దీక్షను విజయవంతం చేయాలని వారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.   
ఫీచర్ ఫోటో చరిత్ర మొత్తం దాగి ఉంది.  ఆ పైన కుడి వైపున ఉన్నది శ్రీబాగ్ ప్యాలస్. అది కాశీనాధుని నాగేశ్వరరావు పంతులు గారి ఇళ్లు. ఇదే విధంగా శ్రీబాగ్ ఒప్పందం మీద సంతకాలు చేసిన రాయలసీమ, ఆంధ్ర ప్రాంత నాయకుల  ఫోటోలున్నాయి ఒక్కటి తప్ప. శ్రీబాగ్ ఒప్పందంలోని అంశాలు కూడా ఉన్నాయి.