మా మంగళగిరి గొప్పదనమింతింత కాదయా?

(అవ్వారు శ్రీనివాసరావు, మంగళగిరి)
నవ్యాంధ్రప్రదేశ్ ప్రస్థుత రాజధాని అమరావతి ముఖద్వారంగా విరాజిల్లుతున్న మంగళగిరిలో యుగయుగాల దేవుడు పానకాలరాయుడు కొలువైవున్నాడు. ఇపుడు తొలిసారిగా డిజిటలయింది. రెండు రోజుల కిందట తెలుగుదేశం పార్టీ తొలి డిజిటల్ మహానాడును నిర్వహించి మంగళగిరి పట్టణానికి మరొక మైలురాయి అందించారు.
 మంగళగిరి అంటేనే గుర్తు కొచ్చేవి రెండు అంశాలు: ఇందులో ఒకటి పానకాల స్వామి అయితే,  రెండో అంశం చేనేత రంగం. మంగళగిరి అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిన రంగమిది.మంగళగరి అంటే ఇంగ్లీష్ లో Auspicious Hill అని అర్థం. మంగళగిరి చేనేత గురించి రష్మి అనే ఔత్సాహిక జర్నలిస్టు ఎంత గొప్పగారా ఇక్కడ చదవండి
 తర్వాత వామపక్ష భావజాల గడ్డగా పేరొందింది. ఆస్తిక, నాస్తిక భావజాలాల కలబోతగా నిత్య చైతన్య ప్రాంతంగా ఉండింది మంగళగిరి.
మరొక విషయం తెలుగువారి గుండె చప్పుడు, చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా పాట పుట్టిందీ గడ్డమీదే.
రాష్ట్ర విభజనాంతరం రాజకీయ పార్టీల ముఖ్య కార్యాలయాలకు వేదికైంది. మొన్నటివరకు అధికారపక్షంగా ఆధిపత్యం వహించి.. నేడు ప్రతిపక్షంగా పోరాటం చేస్తున్న తెలుగుదేశం పార్టీ.. మంగళగిరిలోని తన కేంద్ర కార్యాలయం ప్రారంభానంతరం తొలిసారిగా డిజిటిల్ మహానాడును నిర్వహించింది.

విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు 1982లో  తెలుగుదేశం పార్టీని స్థాపించి నవమాసాలలోనే అధికార పీఠం అధిష్టించిన విషయం విదితమే. దీనికి దీనికి నినాదమై బాట వేసిన పాట ‘చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా.. గతమెంతో ఘనకీర్తి కలవోడా’ ఈ  చైతన్య గీతాలాపనతోనే ఎన్టీఆర్ అధికారంలోకివచ్చారు. ఈ పాట అపుడు పల్లెపల్లెలో మారుమ్రోగింది

టీడీపీ ఆవిర్భావం తర్వాత వరుసగా తొమ్మిది సార్లు (1983, 85, 89, 94, 99, 2004, 09, 14, 19) అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా.. ఐదు పర్యాయాలు అధికార పక్షం, నాలుగుసార్లు విపక్ష పాత్ర పోషించింది. మంగళగిరిలో మాత్రం 1983, 85 ఎన్నికల్లో డాక్టర్ ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు విజయం సాధించి అమాత్యునిగాను అందలమెక్కారు.
ఆ తర్వాత ఎన్నికల్లో మిత్రపక్షాలతో పొత్తుల్లో భాగంగా మంగళగిరి నుంచి 89,94, 99, 2004, 09 ఎన్నికల్లో సీపీఎం, బీజేపీ రెండేసి సార్లు, సీపీఐ ఒకసారి పోటీచేశాయి. 1994 ఎన్నికల్లో మాత్రమే సీపీఎం అభ్యర్థి నిమ్మగడ్డ రామ్మోహనరావు విజయం సాధించారు.
తెలుగుదేశం పార్టీ ప్రచారాస్త్రమైన ‘చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా’ చైతన్య గీతాన్ని రచించిన ప్రముఖ కమ్యూనిస్టు యోధుడు వేములపల్లి శ్రీకృష్ణ (1917-ఏప్రిల్ 8,2000).

మంగళగిరి నియోజకవర్గం నుంచి రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందడం విశేషం. అంతేకాదు శాసనసభలో ఆయన ప్రతిపక్ష నేతగాను కొనసాగారు. ఇక ‘చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా’ గేయాన్ని తన గళంతో ఎలుగెత్తి చాటిన సంగీత నేపథ్య గాయకుడు బి.గోపాలం చరమాంకం మంగళగిరితో ముడిపడింది.
Srikrishna Facebook picture
రాష్ట్ర విభజనాంతరం 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గంజి చిరంజీవి పోటీ చేసి కేవలం 12 ఓట్ల స్వల్ప తేడాతో పరాజయం పాలయ్యారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో స్వయంగా టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు లోకేశ్ రంగంలోకి దిగారు. కాని ఆయన విజయవంతం కాలేదు.
స్థూలంగా ఎన్నికల చరిత్ర ఇలా కొనసాగింది. ఇప్పుడు కరోనా నేపథ్యంలో మంగళగిరిలో తొలిసారిగా నిర్వహించిన మహానాడుకు సాంకేతిక సహకారం తోడవడం విశేషం.
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ తొలినాళ్లలో ఉద్యోగ ప్రస్థానం మంగళగిరి సబ్ రిజిస్ట్రార్ గా మొదలవ్వగా, మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్షనేత చంద్రబాబు మంగళగిరి నియోజకవర్గంలోనే నివాసం ఉంటున్నారు.. ఆయన తనయుడు లోకేశ్ మంగళగిరి పార్టీ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. అలా
మంగళగిరితో ఎందోరో పూర్వపునేతలకు, అధినేతలకు ఎన్టీఆర్, చంద్రబాబు, భావి నేత లోకేశ్ లకు అనుబంధం.. ఇదంతా మంగళాద్రి క్షేత్రపాలకుడి లీలేనేమో!

(అవ్వారు శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్టు  మంగళగిరి.ఈ వ్యాసం టిడిపి మహానాడు సందర్భంగా రాసినది)