కేబీయార్ పార్కులో పీకాక్ ఫెస్టివల్, కెబియార్ పార్క్ నేషనల్ పార్క్ ఎపుడయింది?

హైదరాబాద్ నగరానికి ప్రకృతి మణిహారంగా ఉన్న కాసు బ్రహ్మానందరెడ్డి జాతీయ ఉద్యానవనం (కేబీయార్ పార్క్)లో ఘనంగా నెమలి దినోత్సవం (పీకాక్ ఫెస్టివల్) జరిగింది.
సరిగ్గా 21 సంవత్సరాల క్రితం ఇదే రోజున (3 డిసెంబర్ 1998లో) కేంద్ర ప్రభుత్వం కేబీయార్ పార్కును జాతీయ ఉద్యానవనంగా ప్రకటించింది.
సుమారు 360 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ అటవీ ప్రాంతంలో అరుదైన వృక్ష జంతు జాతులు ఉండటంతో, వాటిని పరిరక్షించటంలో భాగంగా నేషనల్ పార్కుగా డిక్లేర్ చేశారు.
అలాగే ఇక్కడ ఉన్న జంతువులు, పక్షి జాతుల్లో ఎక్కువగా జాతీయ పక్షిగా గుర్తించిన నెమలి ఉండటంతో, కేబీయార్ జాతీయ ఉద్యానవనం ఏర్పాటుకు గుర్తుగా ప్రతీయేటా డిసెంబర్ 3న అటవీ శాఖ పీకాక్ ఫెస్టివల్ నిర్వహిస్తోంది. ఈ పార్కుకు వచ్చే సందర్శకులకు, వాకర్స్ కు ప్రత్యేక ఆకర్షణ ఇక్కడ విరివిగా కనిపించే నెమళ్లే.
గత జంతుగణనలో సుమారు 400 ఉన్న నెమళ్ల సంఖ్య తాజాగా 638కి పెరిగింది. వీటి సంరక్షణ కోసం అటవీ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ముఖ్యంగా చిన్న పిల్లల్లో అడవులు, వన్యప్రాణుల రక్షణపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలను అటవీ శాఖ ప్రతీ యేటా నిర్వహిస్తోంది. వివిధ స్కూళ్ల నుంచి సుమారు వేయి మంది పిల్లలు ఈసారి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఫ్రెండ్న్ ఆఫ్ స్నేక్ సొసైటీ సభ్యులు నిర్వహించిన స్నేక్ షో లు వివిధ రకాల పాములు, అవి వ్యవహరించే తీరును పిల్లలకు వివరించారు. అలాగే అడవులు, జంతువులకు సంబంధించిన వ్యాసరచన, పెయింటింగ్, క్విజ్ పోటీలను నిర్వహించి, విజేతలకు బహుమతులను అందించారు. స్కూలు పిల్లలు పర్యావరణ అంబాసిడర్లుగా వ్యవహరించాలని, జీవవైవిధ్యాన్ని కాపాడుకుంటేనే మనకు మనుగడ అని గుర్తించాలని కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారి అన్నారు. స్కూలు పిల్లలకు వారి రెగ్యులర్ సిలబస్ తో పాటు పర్యావరణం, జంతు సంరక్షణపై టీచర్లు అవగాహన కల్పించాలని హాజరైన టీచర్లను పీసీసీఎఫ్ ఆర్.శోభ ప్రత్యేకంగా కోరారు.
కార్యక్రమంలో హైదరాబాద్ అదనపు పీసీసీఎఫ్ చంద్రశేఖర రెడ్డి, డీఎఫ్ఓ వెంకటేశ్వర్లు, ఓఎస్డీ శంకరన్, వివిధ స్కూళ్లకు చెందిన విద్యార్థులు, టీచర్లు, ఫారెస్టు కాలేజీ విద్యార్థులు, WWF, డెక్కన్ బర్డ్స్ సోసైటీ, కేబీయార్ పార్క్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.