నీళ్లిచ్చాం,పెట్టుబడి ఇచ్చాం, చెప్పిన పంటే వేస్తేనే మంచిది : మంత్రి పువ్వాడ

ప్రభుత్వం చెప్పిన పంటలు వేస్తేనే ‘రైతు బంధు’ పైసలు వస్తాయని లేదంటే రావనే అపోహలు పెట్టుకోవద్దని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్  రైతులకు చెప్పారు. ప్రయోజనకరంగా ఉండాలనేదే ముఖ్యమంత్రి  అభిమతమని ప్రతికూల పంటలు వేసి రైతులు నష్టపోవొద్దనే ముఖ్యమంత్రి ఇస్తున్న సందేశమని ఆయన వివరణ ఇచ్చారు.
నాలుగు రోజులు కిందట రైతు బంధు  పథకం గురించి ముఖ్యమంత్రి కెసిఆర్ చెప్పిన మాటలు పెద్ద చర్చకు దారి తీశాాయి. ప్రభుత్వం చెప్పిన పంటలు వేస్తేనే రైతుబంధు, ఎవరిష్టం వచ్చినట్లు వాళ్లు పంటలేస్తే రైతుబంధు ఉండదని ముఖ్యమంత్రి చెప్పినప్పటి నుంచి వివాదం మొదలయింది.ఇదేదో రైతుబంధు ఎత్తేసేందుకు ప్లాన్ అనే విమర్శలొచ్చాయి. ముఖ్యమంత్రి అన్నమాటలను నమస్తే తెలంగాణ చాలా స్పష్టంగా రిపోర్టు చేసిది. ఇదిగో రిపోర్టు:
రైతుబంధు కోల్పోవద్దు
ప్రభుత్వం చెప్పిన మేరకు పంటలు వేసే వారందరికీ రైతుబంధు నిరాటంకంగా ఇస్తం. కానీ ప్రభుత్వం చెప్పింది వేయకుండా వేరే పంట వేస్తే వాళ్లకు రైతుబంధు రాదు. వాళ్ల కోసం చేస్తున్న నియంత్రణే ఇది. వరి వెయ్యొద్దని అంటలేం. ఎవరి ఇష్టమొచ్చినట్లు వాళ్లు వేస్తే నష్టపోతారు. మార్కెట్లో మంచి డిమాండున్న పంటలను గుర్తించి ప్రభుత్వమే చెప్తున్నందున రైతులు వాటిని వేస్తే లాభం వస్తది. పంటలు హాట్‌కేకుల్లా అమ్ముడుపోతయి. అర్హుడైన ప్రతి రైతు రైతుబంధు సదుపాయం పొందాలని ప్రభుత్వం కోరుకుంటున్నది. ఇంతకుముందు వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రులు, జిల్లా కలెక్టర్లకు చెప్పినం. నియంత్రిత పద్ధతిలో జిల్లాలో వ్యవసాయాన్ని చేయించి.. ఏ ఒక్క రైతు కూడా రైతుబంధు పొందకుండా ఉండొద్దు, ఇది కలెక్టర్లకు మధ్య పోటీ అని చెప్పినం. రైతులకు నచ్చజెప్పి ప్రభుత్వం చెప్పిన పంటలు వేసి రైతుబంధు పొందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించినం. (Source:NTnews)
దీని మీద ఇపుడు మంత్రి అజయ్ కుమార్ వివరణ ఇచ్చినట్లు కనిపిస్తున్నది.
‘…కాబట్టి పంటల మార్పిడి విధానం రైతులకు అలవాటు కావాలి  పంటల మార్పిడి విధానం అవలంభించడం వల్ల ఎక్కువ దిగుబడి వస్తుంది. ఎరువులు, క్రిమి సంహారక మందుల వాడకంలో కూడా మార్పు రావాలి.  ప్రస్తుతం రైతులకు సరైన అవగాహన లేకపోవడం వల్ల కేవలం వ్యాపారుల మాట నమ్మి వాటిని వాడుతున్నారు. ఏ పంట వేయాలనే దాని మీద  రైతు బంధు వేదికల ద్వారా వారికి అవగాహన కల్పించి, వారిని చైతన్యవంతం చేయాలి. తగిన మోతాదులో ఎరువులు, పెస్టిసైడ్స్ వాడడం వల్ల కలిగే ప్రయోజనాలు రైతులకు తెలపాలి. ఎరువులు ఎక్కువ వాడిన పంటకు అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ ఉండదు. ఈ విషయం కూడా వారికి అర్థమయ్యేట్లు వివరించాలి,’  అని మంత్రి పువ్వాడ అజయ్ చెప్పారు.
శనివారం వివి పాలెం, మంచుకొండ గ్రామం లో నిర్వహించిన రైతు బంధు సమావేశాలలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ముఖ్య అతిధిగా రైతు బంధు మీద వ్యక్తమవుతున్న అపోహల గురించి వివరణ ఇచ్చారు.
‘‘తెలంగాణ  వ్యవసాయంలో సంస్కరణల శకం ఈ ఏడాది వర్షాకాలం పంటతో ప్రారంభమవుతుంది. తెలంగాణలో సాగునీరు ఉంది, పెట్టుబడి ఉంది.. ప్రభుత్వంపై నమ్మకం ఉంది. ఇన్ని సానుకూలతలున్న క్రమంలో ప్రభుత్వం నిర్దేశించిన విధిగానే పంటలు వేసుకోవాలి. వ్యవసాయాభివృద్ధికి స్వల్ప కాలిక, దీర్ఘకాలిక వ్యూహాలు అవలంభిచాలని ప్రభుత్వం నిర్ణయించింది.’’ అని ఆయన చెప్పారు.
ప్రభుత్వం ఆశిస్తున్న విదంగా పంట మార్పులకు శ్రీకారం చుట్టాలని  మంత్రి చెప్పారు.
ఆయన ఇంకా ఏమన్నారంటే…
ప్రపంచంతో పోటీ పడేలా తెలంగాణలో పంటల సాగు జరగాలని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆకాంక్షిస్తున్నారు.  ప్రజల అవసరాలు, మార్కెట్ డిమాండ్లకు అనుగుణంగా తెలంగాణలో జరగాల్సిన పంటల సాగుపై అనుసరించాల్సిన వ్యూహాలను రైతులకు ప్రభుత్వం అందిస్తుంది.
ప్రతీ ఏడాది పరిస్థితులు మారుతుంటాయి. దానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు పంటలు మార్చుకుని వేసుకోవాలన్నది ప్రభుత్వ సూచన అని అన్నారు. కంది, వారి, పత్తి పైనే దృష్టి పెట్టాలని రైతులను కోరారు. కంది ని ఈసారి ప్రభుత్వమే కనీస మద్దతు ధర ఇచ్చి ప్రభుత్వమే కొంటుందన్నారు.
సీతారామ ప్రాజెక్ట్ ద్వారా గోదావరి జలాలను పాలేరు జలాశయంలో పోసి ప్రతి ఎకరాకు నీరు అందించాలని ముఖ్యమంత్రి తగు చర్యలు తీసుకుంటున్నారని అన్నారు
కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ RV కర్ణన్ IAS గారు, జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్ గారు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీ నారాయణ గారు, రైతు బంధు జిల్లా అధ్యక్షులు నల్లమల వెంకటేశ్వర రావు గారు, డీసీసీబీ చైర్మన్ కురాకుల నాగభూషణం గారు, AMC చైర్మన్ వెంకటరమణ గారు, జిల్లా వ్యవసాయ అధికారి ఝాన్సీ లక్ష్మీ కుమారి గారు, తదితరులు ఉన్నారు.