కృష్ణా నది మీద ఆంధ్ర ‘లిఫ్ట్’ చెల్లదు, ఆడ్డుకుంటాం: కెసిఆర్ శపథం

శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కృష్ణా నీటి కోసం కొత్త ఎత్తిపోతల పథకం నిర్మించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయించిందని  తెలంగాణ  ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వ్యాఖ్యానించారు.
ఎపి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టానికి విరుద్ధమని  ఈ ప్రాజెక్టును అడ్డుకోవడానికి న్యాయ పోరాటం చేస్తామని కేసీఆర్ ప్రకటించారు.
ఈ ప్రాజక్టుల మీద ముఖ్యమంత్రి  ప్రగతి భవన్ లో సోమవారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. మంత్రులు ఈటల రాజెందర్, మహమూద్ అలీ, శ్రీనివాస గౌడ్, నిరంజన్ రెడ్డి, జగదీష్ రెడ్డి, పువ్వాడ అజయ్, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ లతో పలువురు సీనియర్ అధికారులు సమావేశంలో పాల్గొన్నారు.
ఆయన ఇంకా ఏమన్నారంటే…
తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు ఈ ప్రాజక్టు తీవ్ర భంగం కలిగిస్తుంది.
ఎపి ప్రభుత్వ నిర్ణయంపై వెంటనే కృష్ణా వాటర్ మేనేజ్మెంట్ బోర్డులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఫిర్యాదు చేయాలి.
తెలంగాణ రాష్ట్రాన్ని సంప్రదించకుండానే ఉమ్మడి ప్రాజెక్టు అయిన శ్రీశైలం నీటి విషయంలో నిర్ణయం తీసుకోవడం సరికాదు.
అపెక్స్ కమిటీ ఆమోదం లేకుండా కొత్త ప్రాజెక్టు నిర్మాణం తలపెట్టడం తప్పు.
 ఈ ప్రాజెక్టును అడ్డుకోవడానికి రాజీలేని ధోరణి అవలంభిస్తాం
శ్రీశైలం ప్రాజెక్టు నుంచి మూడు టిఎంసిల నీటిని లిఫ్టు చేసేందుకు  కొత్త ఎత్తిపోతల పథకం నిర్మాణానికి  ఆంధ్రప్రదేశ్ నిర్ణయం.
దీనికి  జీవో కూడా విడుదల చేసింది.
తెలంగాణలో కానీ, ఆంధ్రప్రదేశ్ లో కానీ కొత్త నీటి పారుదల ప్రాజెక్టు నిర్మాణం చేపడితే అపెక్స్ కమిటీ అనుమతి తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఉంది.
 కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అపెక్స్ కమిటీ ఆమోదం తీసుకోలేదు.
శ్రీశైలం ప్రాజెక్టు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ల ఉమ్మడి ప్రాజెక్టు. ఇందులోని నీటిని రెండు రాష్ట్రాలు వాడుకోవాలి. కానీ తెలంగాణ రాష్ట్రాన్ని కనీసం సంప్రదించకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీశైలం ప్రాజెక్టులోని నీటిని లిఫ్టు చేయాలని నిర్ణయించింది.
ఈ కొత్త ప్రాజక్టు వల్ల  ఉమ్మడి పాలమూరు, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలకు సాగు, తాగు నీటి సమస్య ఏర్పడుతుంది.
అందుకే ఈ ప్రాజెక్టు నిర్మాణం జరగకుండా ఆదేశాలు జారీ చేయాలని వెంటనే కె.ఆర్.ఎం.బి.లో ఫిర్యాదు చేస్తాం
కృష్ణా నదిలో రాష్ట్రాల వాటాను తేల్చే విషయంలో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ లో చాలా జాప్యం జరుగుతున్నందున, సుప్రీంకోర్టును ఆశ్రయించాలి.