మాతృభాషే భోధనా భాష : కళ్యాణదుర్గం లో ప్రజా సంఘాల తీర్మానం

ఆంధ్రప్రదేశ్  రాష్ట్ర ప్రభుత్వం తెలుగును బోధనభాషగా తొలగించి ఇంగ్లీషు మీడియంను ప్రవేశపెట్టిన జి.ఒ.సంఖ్య: 81 ని తక్షణం ఉపసంహరించుకోవాలని వివిధ ప్రజాసంఘాలు కోరాయి.
కళ్యాణదుర్గం పట్టణం, జ్యోతిర్మయి జూనియర్ కళాశాలలో మాతృభాష మాధ్యమ హక్కుకై కొనసాగిన సమావేశం జరిగింది.
భారత రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 350- A ప్రకారం మాతృభాష లో చదువుకొనే హక్కును సంరక్షించాలని సమావేశంలో పాల్గొన్నా వారు  కోరారు. అధిక సంఖ్యాక ప్రజల మధ్య ఉండే అల్ప సంఖ్యాక భాషా వర్గాలవారికున్న భాషాహక్కులను కూడా కొనసాగించాలని కోరారు.
ఆధునిక ప్రపంచంలో మార్పులను, అవకాశాలను అందుకోవడానికి ఇంగ్లీషు భాష అవసరమే అయినప్పటికీ , ఇంగ్లీషు భాష వంటబట్టడానికి అవసరమైన శాస్త్రీయ పద్దతులను పాటించాలని కోరారు. మాతృభాషలో కనీస పరిజ్ఞానం ఉన్నప్పుడే ఇతరభాషలను సమగ్రంగా, వేగంగా అందుకోవచ్చని తెలిపారు. సమావేశంలో కొన్ని తీర్మానాలను ఆమోదించారు.
తీర్మానాలు:
1. ప్రాథమిక స్థాయివిద్య మాతృభాషా మాధ్యమంలో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలలో కొనసాగించాలి.
2. ప్రాథమిక విద్యమొత్తం ప్రభుత్వ పాఠశాలల ఆధ్వర్యంలోనే కొనసాగించాలి.
3. మాతృభాష మాధ్యమ హక్కుపై అవగాహన కార్యక్రమాలు కొనసాగించడం.
4. మాతృభాష మాధ్యమ ప్రాధాన్యత- ఆవశ్యకత పై సదస్సు నిర్ణయించడం.
5. మాతృభాష మాధ్యమ సాధన సమితిగా ఈ అంశంపై మద్దతిచ్చేవారందరిని సమన్వయం చేసుకోవడం.
ఈ కార్యక్రమంలో గురజాడ అధ్యయన కేంద్రం దేశం శ్రీనివాసరెడ్డి, విశ్రాంత అధ్యాపకులు మల్లికార్జున, తెలుగు భాషా సంఘం డా.అప్పిరెడ్డి హరినాథరెడ్డి, వినియోగదారుల సంఘం నాయకులు చల్లా కిషోర్, పాత్రికేయులు ప్రసాద్, రైతుసంఘం లక్ష్మిరెడ్డి, విశ్రాంత రెవిన్యూ అధికారి కరణం మల్లికార్జున రావు, సామాజిక నాయకులు శివశంకర్, సుధీర్, ఉపాద్యాయులు అశోక్, నాగశేషారెడ్డి, స్వచ్చంద సంస్థల ప్రతినిధి కార్యకర్త నటరాజ్, జాఫర్ తదితరులు పాల్గొన్నారు.