జెసి దివాకర్ రెడ్డి అండ్ కో గన్ మెన్ ల ఉపసంహరణ

అమరావతి : ఒకపుడు అనంతరంపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గాన్ని సొంత రిపబ్లిక్ గా నడిపిన టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి కష్టకాలం వచ్చింది. ఎన్నికల్లో ఆయన కుటుంబ సభ్యులెవరూ గెలవలేదు. ఆయన పార్టీ అధికారం కోల్పోయింది. తాను రాజకీయాలు జోరుగా మాట్లాడుతున్నా ఎన్నికలనుంచి విరమణ తీసుకున్నారు.
అధికారంలోకి వచ్చిన వైసిపి ప్రభుత్వం వాళ్ల ఆర్థిక సామ్రాజ్యాన్ని కుదేలు చేసింది. ఇపుడు వ్యక్తిగత భద్రతను తొలగించింది.
గతంలో ఆయనకు  2+2 గన్ మెన్ ల భద్రత ఉండేది.దీనిని కొద్ది రోజుల కిందట 1 + 1 కు తగ్గించారు.  జగన్ ప్రభుత్వం పూర్తి భద్రతను ఉపసంహరించుకుంటూ  నిర్ణయం తీసుకుంది.
రాష్ట్రంలో రాజకీయ ప్రముఖుల భద్రతను తొలగించడంలో భాగంగా ప్రభుత్వం జెసి భద్రతను ఉపసంహిరించుకుందని తెలిసింది. ఇదే విధంగా మాజీ మంత్రులు కాల్వ శ్రీనివాసులు, పల్లె రఘునాథరెడ్డిల భద్రతను తొలగించారు. ఇపుడు కృష్ణా జిల్లాలో మాజీ మంత్రి దేవినేని ఉమ, పల్నాడులో సున్నిత ప్రాంతమైన గురజాల మాజీ ఎమ్మెల్యే ఎరపతినేనికి రక్షణ తొలగిస్తూ మంగళవారం ఉదయం ఉత్తర్వులు జారీ అయ్యాయి. భద్రత తొలిగించినందున తమ తమ హెడ్ క్వార్టర్స్ కు వెనక్కు వచ్చేయాలని సాయుధ పోలీసులను ప్రభుత్వం ఆదేశించింది.
రాష్ట్ర సెక్యూరిటీ రివ్యూస్ కమిటీ ఆదేశాల మేరకు గత రాత్రి జేసీ దివాకర్‌రెడ్డికి భద్రత తొలిగిస్తుంచాలని నిర్ణయించినట్లు సమచారం.
 అనంతపురం జిల్లా రెండు మూడు దశాబ్దాలుగా తిరుగులేని శక్తిగా ఉన్న  జేసీ కి భద్రతను తొలగించడం పట్ల తెలుగుదేశం పార్టీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. జేసీ కుటుంబంపై జగన్  ప్రభుత్వం కక్ష్యపూరితంగా వ్యవహరిస్తోందని వారు విమర్శిస్తున్నారు.
రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జేసీ దివాకర్ రెడ్డి కుటుంబం లక్ష్యంగానే దాడులు చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు.
ఒకవైపు జేసీ ఆర్థిక మూలాలను దెబ్బతీసే విధంగా జేసీ దివాకర్ ట్రావెల్స్ బస్సులను ఎక్కడికక్కడ సీజ్ చేయడంతో పాటు, జేసీకి చెందిన త్రిశూల్ సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించి భూములను కూడా రద్దు చేశారు. వీటితోపాటు జెసి మీద  కేసులు నమోదు అయ్యాయి.
 తాడిపత్రి నియోజకవర్గంలో జేసీ ప్రధాన అనుచరులపైనా పోలీసులు కేసులు పెట్టడం, పీడీయాక్ట్‌లు పెట్టి నెలల తరబడి పోలీస్‌స్టేషన్‌లో ఉంచడంపై జేసీ బ్రదర్స్ (జెసి దివాకర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి)ఆగ్రహంతో ఉన్నారని చెబుతున్నారు. ప్రభుత్వం తమపై కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతూ ఉందని  జెసి బాహాటంగాగానే విమర్శిస్తున్నారు.టిడిపి నేతల సెక్యూరిటీ తొలగించడం పట్ల మాజీ మంత్రి ప్రతిపాటి పుల్లారావు ఆగ్రహించారు. చాలా మంది నాయకులు ఫ్యాక్షన్  ప్రాంతాలలో ఉంటున్నారని, వారికి భద్రత తొలగించడమంటే  అభద్రతాభావం కల్పించడమే నని  ఆయన వ్యాఖ్యానించారు.