ఇంగ్లీష్ కోసం తెలుగు మానేస్తమా, విజయవాడలో చర్చ, అందరూ రండి

  • సమయం: 8-12-2019, ఆదివారం, ఉదయం 10 గంటలకు; స్థలం: ప్రెస్ క్లబ్, విజయవాడ.

ప్రస్తుతం మన రాష్ట్రంలో విద్యావిధానంలో భాషా మాధ్యమంపై చెలరేగుతున్న గందరగోళం, అలజడి, కాంట్రవర్సీ అందరికీ విదితమే.

ఇంగ్లీషు భాష బాగా వచ్చిన వారికి దేశ విదేశాలలో ఉపాధి, ఉద్యోగ అవకాశాలలో ఉన్న అడ్వాంటేజ్ ఏమిటో కూడా అందరికీ తెలిసిన విషయమే. ఆంగ్ల భాషా పరిజ్ఞానమే ‘మెరిట్’ గా పరిగణింపబడుతున్న ఒక దురదృష్టకర దుష్పరిణామం కూడా జరిగిన మాట వాస్తవం. ప్రపంచీకరణ, సరళీకరణ, కంప్యూటరీకరణ జరిగిన నేపధ్యంలో ఈ పరిస్థితి మరింత తీవ్రతరమై వెర్రి తలలు వేసినమాట వాస్తవం. ఇటువంటి పరిస్థితుల్లో పేద బడుగు బలహీన వర్గాలవారు ఇంగ్లీష్ ద్వారానే తమ జీవన స్థితిగతులను మెరుగు పరుచుకోగలమని భావించటం తప్పుకాదు.

కానీ అదే సమయంలో మాతృభాషను పూర్తిగా విడిచి పెట్టటం, విస్మరించటం, తిరస్కరించటం సరైనది కాదని విజ్ఞులైన భాషా శాస్త్రజ్ఞుల, మేధావుల అభిప్రాయం. ప్రాధమిక విద్య మాతృభాషా మాధ్యమంలో పొందటం మానవుల మనో వికాసానికి, అభివృద్దికి దోహద పడుతుందని, మాతృభాష బాగా నేర్చుకున్న వారు ఇతర భాషలమీద కూడా తేలికగా పట్టు సాధించగలరనీ భాషా శాస్త్రజ్ఞుల అధ్యయనాల్లో తేలిన విషయం. అంతేకాదు, సామాజిక శాస్త్రాలతో పాటు విజ్ఞాన శాస్త్రాలను కూడా మాతృ భాషలోనే బోధించే జపాన్, చైనా, రష్యా వంటి అనేక దేశాలలో అది అభివృద్దికి, మానవ వికాసానికి ఆటంకం కలిగించిన దాఖలాలు లేకపోగా, అక్కడ మనదేశంలో కంటే అన్ని రకాలుగా మెరుగైన పరిస్థితులు ఉన్నాయన్నది మన కళ్ళముందు కనిపించే వాస్తవం.

ఈ రోజు విద్యావిధానంలో బాషా మాధ్యమంపై జరుగుతున్న చర్చ రెండు శిబిరాల మధ్య యుద్ధ వాతావరణంలో శత్రు పూరితంగా జరుగుతుండటం మనం చూస్తున్నాం. ఇది అత్యంత బాధాకరం. రెండు శిబిరాలు పూర్తిగా రెండు కొసలకు ఒరిగి ద్వేష పూరితంగా చర్చించటం గమనిస్తున్నాం. ఎలాంటి సమస్యకైనా పరిష్కారం ఏదో ఒక extreme లో ఉండవలసిన అవసరం లేదు. రెండు ఆలోచనా ధోరణులలో ఉన్న సానుకూల (పాజిటివ్) అంశాలను స్వీకరించి, గుదిగూర్చి ఒక మధ్యేమార్గ పరిష్కారాన్ని కనుక్కోవటం సరైన విధానమని మా అభిప్రాయం. ఇంగ్లీషు భాషా నైపుణ్యం, దాన్ని సాధించటానికి ఇంగ్లీషు మాధ్యమంలో విద్యా బోధన అవసరమే. ఆమోదించదగినదే. కాని అందుకోసం మాతృభాషను, తెలుగు మాధ్యమాన్ని పూర్తిగా ఈసడించవలసిన, తిరష్కరించ వలసిన, ద్వేషించ వలసిన అవసరం కూడా లేదు. రెండు మాధ్యమాలను కొనసాగించటం వల్ల వచ్చే నష్టం గానీ, ఇబ్బంది గానీ ఏమీ తోచదు. మాతృభాషను పూర్తిగా తిరస్కరించటం వల్ల వచ్చే అనర్ధాలు కూడ తక్కువేం కాదు. ఎంత పెద్ద స్థాయిలో ఆ అనర్ధాలు మన సమాజాన్ని ప్రభావితం చేస్తాయో ఇప్పటికిప్పుడు అంచనా వేయడం కూడా కష్టమే. అన్ని విషయాలలో, అన్ని రంగాలలో ఏదో ఒక ఆలోచనా ధోరణి కొసకు నిలబడి మిగతా వాటన్నిటినీ, మిగిలిన దాన్ని అంతటినీ తిరస్కరించటం వల్ల మానవజాతి, మానవ సమాజం ఎన్నో అనర్ధాలకు, ఒడిదుడుకులకు గురవటం మనం చరిత్రలో అనేక సందర్భాలలో చూశాం.. చూస్తున్నాం. దానినుండి తీసుకున్న గుణపాఠాలతో విజ్ఞులు, మేధావులు సమ్మిళిత ఆలోచనా ధోరణిని, సమ్మిళిత విధానాలను ప్రోత్సహిస్తున్న, ప్రబోధిస్తున్న వర్తమానంలో మనమున్నాం.

కనుక భాషా మాధ్యమం గురించి కూడ extremes లో ఆలోచించకుండా సమ్మిళిత (inclusive) ధోరణిలో చర్చ, ఆచరణ ముందుకు సాగితే బాగుంటుందని మా భావన. దాని గురించిన చర్చలు, సమాలోచనలు ఒక మైత్రీ పూర్వక వాతావరణంలో జరిగితే బాగుంటుంది. ఆ దిశగా చేస్తున్న ఓ చిన్న ప్రయత్నమే ఈ సమావేశం.

ఈ విషయంపై సీరియస్ గా ఆలోచిస్తున్న వారంతా హాజరై తమ తమ అభిప్రాయాలను, ఆలోచనలను పంచుకోవాలని హృదయ పూర్వకంగా ఆహ్వానిస్తున్నాం.

-డా.జి. గంగాధర్,
రాష్ట్ర అధ్యక్షులు,
బిసి జనసభ.

-గోళ్ల నారాయణ రావు,
అధ్యక్షులు,
ఆంధ్రా ఆర్ట్స్ అకాడమీ