అందరికీ కార్పొరేట్ వైద్యం, చంద్రబాబు కడుపుమంటకు మందులేదు: జగన్

ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఆసుపత్రిలన్నింటిని అత్యాధునిక పరికరాలతో, కార్పొరేట్ స్థాయి వసతులతో తీర్చిదిద్దబోతున్నట్లు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు.
ఆ మధ్య ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చడం కోసం నాడు–నేడు చేపట్టామని, ఇపుడు ప్రభుత్వ ఆస్పత్రుల రూపురేఖలు మార్చే కార్యక్రమం మొదలు పెడుతున్నామని ఆయన కర్నూలులో కంటివెలుగు కార్యక్రమం మూడో దశ ప్రారంభిస్తూ చెప్పారు.
ఇండియన్‌ పబ్లిక్‌ హెల్త్‌ స్టాండర్డ్స్‌ (ఐపీహెచ్‌ఎస్‌)కు అనుగుణంగా ప్రభుత్వాసుపత్రులను అభివృద్ధి చేస్తున్నామని, పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఏఎహెచ్‌లు, డీహెచ్‌లతో పాటు, టీచింగ్‌ ఆస్పత్రులను కూడా మార్చబోతున్నామని ఆయన ప్రకటించారు.
దీని కోసం రూ.15,335 కోట్లతో పనులు చేపడుతున్నామని అంటూ కొత్తగా సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులు, నర్సింగ్‌ కళాశాలలు ఏర్పాటు చేస్తున్నామని కూడా ఆయన చెప్పారు.
‘ప్రతి పార్లమెంటు నియోజవర్గంలో టీచింగ్‌ ఆస్పత్రి ఏర్పాటు చేస్తాం. విధంగా మొత్తం 27 వైద్య కళాశాలలు, నర్సింగ్‌ కళాశాలలు వస్తాయి. మొత్తం 175 నియోజకవర్గాలలో వచ్చే జూలై 31 వరకు కంటి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఆపరేషన్లు అవసరమైతే మార్చి 1 నుంచి 133 కేంద్రాలు, 11 టీచింగ్‌ ఆస్పత్రులు, 13 జిల్లా ఆస్పత్రులు, 28 ఏరియా ఆస్పత్రులు, 81 ఎన్జీఓ కంటి ఆస్పత్రుల్లో కంటి శస్త్ర చికిత్సలు జరుగుతాయి,’ అని ముఖ్యమంత్రి జగన్ తెలిపారు.
వైయస్సార్‌ కంటి వెలుగు ద్వారా అవ్వాతాతల కోసం మూడో దశ కంటి వెలుగు కార్యక్రమం చేపట్టామని ఈ విడత కంటి వెలుగులో 56.88 లక్షల మంది అవ్వాతాతలకు కంటి వైద్య పరీక్షలు నిర్వహిస్తామని కళ్లజోళ్లు అవసరమైన వారికి రెండు వారాల తర్వాత గ్రామ వలంటీర్లు స్వయంగా వారి ఇళ్లకు వెళ్లి అందజేస్తారని ఆయన వెల్లడించారు.
ముఖ్యమంత్రి ఇంకా ఏమన్నారంటే…
రాష్ట్రంలో ప్రతి కుటుంబం, ప్రతి సామాజిక వర్గానికి ఏ ప్రభుత్వమూ చేయని విధంగా మేలు చేస్తున్నాం.ఇంత మంచి పరిపాలన చేస్తుంటే, ఓర్చుకోని వారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది.
చంద్రబాబును చూస్తున్నారు, వారి కడుపు మంట కూడా చూస్తున్నారు. ఆరోగ్యశ్రీలో 2వేల వ్యాధులకు పైగా చికిత్స చేస్తున్నాం. ఇంకా క్యాన్సర్‌కు కూడా ఆరోగ్యశ్రీలో ఉచిత వైద్యం ఉంది
కానీ, అసూయతో కూడిన కడుపు మంటకు ఎక్కడా చికిత్స లేదు
కంటిచూపు మందగిస్తే కంటి వెలుగులో చికిత్స ఉంది కానీ, చెడు దృష్టికి మాత్రం ఎక్కడా కూడా చికిత్స లేనే లేదు. వయసు మళ్లితే చికిత్సలు ఉన్నాయి కానీ, మెదడు కుళ్లితే మాత్రం చికిత్స లేనే లేదు. అలాంటి లక్షణాలున్న మనుషులను మహానుభావులుగా చూపించే కొన్ని పత్రికలు, కొన్ని ఛానళ్లు ఉన్నాయి. వాటిని బాగు చేసే మందులు కూడా ఎక్కడా లేవు.
వీటన్నింటి మధ్య మీ బిడ్డ మీ కోసం పని చేస్తున్నాడు
నిజాయితీతో పని చేస్తున్నాం.ప్రాంతీయ ఆకాంక్షలను గౌరవిస్తున్నాం. ప్రతి కుటుంబం, అందులో పిల్లలు అభివృద్ధిలోకి వచ్చేలా చదువులు చెప్పిస్తున్నాం.
వైద్యం, ఆరోగ్యం, వ్యవసాయం మీద దృష్టి పెట్టాం.
మేనిఫెస్టోలో ప్రకటించిన వాటిలో మొదటి ఏడాది కూడా పూర్తి కాకుండానే 85 శాతానికి పైగా అమలు చేసే చర్యలు తీసుకున్నాం.