ప్రైవేటు వాళ్లకు వరాలు, అమరావతి భూపంపకాలు ఇలా జరిగాయి: మంత్రి బుగ్గన

వికేంద్రీకరణ బిల్లును శాసన సభలో ప్రవేశపెడుతూ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అమరావతిరాజధాని ప్రాంతంలో భూముల కనుగోలు ఎలా జరిగిందో వివరాలు (ఇన్ సైడర్ ట్రేడింగ్ ) వెల్లడించారు.
తెలుగుదేశం ప్రముఖులు,వారి బంధువులు రాజధాని గురించి సమాచారం ముందుగానే తెలిసినందునే అంతా ఒకే కాలంలో భూములు కొనుగోలు చేయగలిగారని లేకపోతే, ఎక్కడో అనంతపురం జిల్లాకు చెందిన శాసన సభ్యులు పయ్యావుల కేశవ్, రఘనాథరెడ్డి భూములు అమరావతి ప్రాంతానికి వచ్చి 2014 లోనే ఎలా కొంటారని ఆయన ఆశ్చర్య పోయారు.
ఈ భూముల కేటాయింపులో కూడా అనుమానాలకు తావిచ్చే విధంగా నిర్ణయాలు జరిగాయని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం సంస్థలకు, బ్యాంకులకు ఎక్కువ ధరకు అంటే ఎకరానికి కోటి నుంచి నాలుగు కోట్ల వరకు కేటాయించి భూములు కేటాయించి, ప్రయివేటు వారికి మాత్రం ఎకరా లక్ష రుపాయలకు కేటాయించారని బుగ్గన తెలిపారు.
చివరకు నేవీ వంటి సంస్థలు కూడా ప్రయివేటు వారికంటే ఎక్కువ డబ్బు చెల్లించాయని అన్నారు. ప్రయివేటు విద్యా, వైద్య సంస్థలకు అవసరానికి మించి వందల ఎకరాలు కేటాయించిన పద్ధతి చూస్తే అమరావతి రాజధాని కాదు, రియల్ ఎస్టేట్ సంస్థగామారిందని అర్థమవుతుందని ఆయన అన్నారు.
బుగ్గన అందించిన వివరాలు:
* రాజధాని ప్రాంతంలో 125 సంస్థలకు మొత్తం 1,648 ఎకరాలను కేటాయించింది.
* ఇందులో ఏడు కేంద్ర ప్రభుత్వ సంస్థలకు 68 ఎకరాలు, ప్రభుత్వ రంగ సంస్థలకు 180 ఎకరాలు..
* ప్రైవేటు సంస్థలకు 1,366 ఎకరాలు కేటాయించింది.
*ఇందుకు ఒక విధానం పాటించకుండా నాలుగు ఏపీ ప్రభుత్వ సంస్థలకు ఏడెకరాలు, పబ్లిక్‌ అండర్‌ టేకింగ్‌ సంస్థలకు 87 ఎకరాలు కేటాయించారు.
* డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పోస్ట్స్‌కు ఎకరాకు రూ.కోటి చొప్పన 60 సంవత్సరాలకు లీజుకు ఇచ్చారు.
* ప్రైవేటు సంస్థలైన విట్‌ ఏపీకి 200 ఎకరాలు, ఎస్‌ఆర్‌ఎంకు 200 ఎకరాలు, అమృతా యూనివర్సిటీకి 200 ఎకరాలు, ఇండో–యూకే యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ 150 ఎకరాలు, మెడిసిటీ హెల్త్‌ 100 ఎకరాలు, బీఆర్‌ఎస్‌ మెడిసిటీ కేటాయించారు. ఈ సంస్థలకు ఎకరాకు ధర రూ.50 లక్షలు.
* వరుణ్‌ హాస్పిటాలిటీకి నాలుగు ఎకరాలు, మహాలక్ష్మి ఇన్‌ఫ్రా వెంచర్స్‌కు నాలుగు ఎకరాలు రూ.కోటిన్నరతో ఇచ్చారు.