కండక్టర్ నీరజకు అశ్రునివాళి

ఎన్నాళ్ళీ ఆత్మహత్యలు
ఆపలేరా ఈ చితిమంటలు
ప్రభుత్వ పెద్దలారా
కార్మిక నేతలారా
బెట్టు మానండి
సమస్యను గట్టుకు చేర్చండి
సమ్మెతో చెలగాటం ఆపండి
అద్దాల మేడలో
ఏసీగదుల్లో కూచున్న
ఆర్టీసి యాజమాన్య పెద్దలారా
ఒక్కసారి బయటికి రండి
కడుపులెండి ఏడుస్తున్న
కార్మికుల పిల్లల ఆకలికేకలు వినండి
ఎండలో ఎండి ధర్నాలుజేస్తున్న
మీకార్మికుల కన్నీళ్ళను తుడవండి
పనిచేసిన గతనెల జీతం చెల్లించండి
సమ్మె పరిష్కార దిశగా
గౌరవ హైకోర్టు ధర్మాసనం
మార్గనిర్దేశాన్ని ఆచరించండి
ఆర్టీసీ డ్రైవర్ కండక్టర్ల జీవితాలు
దారిద్ర దేవత తాండవించే ఆవాసాలు
చాలీ చాలని జీతాలు
అడుగడుగునా గండాలు
కన్నీళ్ల సుడిగుండాలు
కడుపునిండదు గడపపండదు
పిల్లల చదువులకు
పెళ్ళి పేరంటాలకు
కార్మికులు పడే అవస్థ
అలవిగానిది
సమ్మె రోడ్డెక్కింది
నెల జీతం వెక్కిరించింది
బతుకు భారమై
ఉరితాడే తోడై
సత్తుపల్లి కండక్టర్ నీరజ
నిండు నూరేళ్ళజీవితం
పండుటాకులా రాలిపోయింది..
దివంగత కార్మిక సోదరి
శ్రీమతి నీరజ ఆత్మకు
శాశ్వత శాంతినిచేకూర్చాలని
భగవంతుడిని ప్రార్థిస్తూ
ఆమె కుటుంబానికి
నా ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తపరుస్తూ..
-గోపిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి.

(ఖమ్మం జిల్లా సత్తుపల్లి డిపోకు ఆర్టీసి కండక్టర్ నీరజ నిన్న ఆత్మహత్య చేసుకుంది. కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ముందుకు రాకపోవడం, ఉద్యోగులందరిని కొలువులోకి తీసుకునేది లేదని ముఖ్యమంత్రి కెసిఆర్ తరచూ ప్రకటిస్తూ ఉండటంతో బతుకిక భారమని భావించి  నీరజ ఆత్మహత్య చేసుకుంది.)