వలస బ్రతుకులు (కవిత)

(గొంటుముక్కల గోవిందు)
కాసులకై తిరకాసులు తెలియని
శ్రమైకజీవన సౌందర్యాలివి.
తిన్నింటివాసాలను లెక్కపెట్టని
నీతి బ్రతుకుల వలసలివి.
మైళ్ళదూరం మైలపడిన దీనమిది
ప్రేగుబంధం తెంచుకోలేని తపనయానమిది,
తనవారికై తప్పని వలసల జీవనమిది.
ఓట్లనాడు దేవుళ్లుగా అభిషేకాలు పొందిరి
ఇయ్యాల నిమజ్జనమైన నిర్జీవులైరి.
ఎవరికోసమో ,దేనికోసమో ఎదురుచూడక
ఎడారంటి ఊళ్ళలో అడుగులేస్తూ అలసిపోయిరి.
ఎదన ఒకరు ,భుజాన మరొకరితో
మైళ్ళదూరం సాగుతున్న నడక
తల్లికి భారమవునా బిడ్డలబరువుతోటి.
రెండు,మూడేళ్ళ బిడ్డలను కావడిలో ఉంచి
కాళ్లకు బుద్దిచెప్పిన తండ్రిని చూస్తుంటే..
భుజానున్నది పసిబిడ్డలని నా కళ్లు అంటున్నా…..
పసిబిడ్డలు కారని ,వారు జ్ఞాననేత్రం తెరిచి దుస్థితి చూస్తున్న కారణజన్ములని
నా కలం చెబుతున్నది.
కావడిలో బిడ్డల బరువును మోసేది తండ్రియే అని నా కళ్లు అంటున్నా….
బిడ్డల బరువుకాదది ,బాధ్యతగా
మోస్తున్న నా బావిభారత భవిష్యత్తని
నా కలం చెబుతున్నది.
కాళ్ళు ఇక అడుగులు వేయలేమంటున్నాయి,
కడుపుచించుకొని కాళ్ళమీద పడుతున్నది…
రేయేదో ,పగలేదో స్పృహకే రాకుంది….
చీలిన పాదాలు,
రక్తమోడుతున్న అడుగులు,’
ఆకలికై తరుక్కుపోతున్న కడుపులు,
గమ్యం ఎరక్క ఇరుక్కపోతున్న బ్రతుకులు’,
కారుతున్న కన్నీళ్ళు
ఆవిరవుతున్న నోళ్ళు,…
అన్నింటిని రెప్పచాటున దాచి
పంటినొక్కన బిగపట్టి,
బయలుదేరిన బ్రతుకులు ,
రేపటికై అడుగేసిన వలసలు.
ఆశగా ఆసరాకై ఎదురుచూస్తున్న వలస కూలీలు…
ఈ భరతమాత ఒడిలో
నీతోపాటే పుట్టి పెరిగిన
సహోదర భారతీయులే !!!!

(గొంటుముక్కల గోవిందు,టీచర్, మోటివేషనల్ స్పీకర్, గుండ్లకుంట, కడప జిల్లా, ఫోన్ నెం 9160450104)