అమిత్ షా మీద దాడి గొడవ, బిజెపి నేత అరెస్టు

ఆ మధ్య భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్‌షా తిరుమలకు వెళ్తున్నపుడు   ఆయన కాన్వాయ్‌పై దాడి జరిగిందని బిజెపి ఆరోపించింది. ఇది వివాదమయింది. ఎందుకంటే,పోలిసులెవరూ దీనిని ధృవీకరించలేదు. దానికి తోడు షా కారు మీద కాదు, కాన్వాయ్ లో ఉన్న ఒక కారు మీద రాయి పడిందని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇలాంటి ఇక జరగడానికి వీల్లేదన్నారు. దాడి చేసిన టిడిపి వారి మీద ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సిపిఐ నారాయణ మాత్రం దాడిని సమర్థించారు. హోదా విషయంలో ఆంధ్రాను మోసం చేసినందుకు షా దగ్గిర నిరసన మాత్రమే నిలిపారని, ఇది తప్పుకాదని అన్నారు.

ఇపుడా కేసులో నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసులో తాజాగా బీజేపీ నేత కోలా ఆనంద్‌ను అలిపిరి  పోలీసులు అరెస్టు చేశారు. ఇది వరకే టీడీపీ నాయకుడు సుబ్రమణ్యం యాదవ్‌ను అరెస్టు చేశారు.  ఈనెల 11వ తేది జరిగిన దాడి ఘటనకు ప్రధాన కారణం కోలా ఆనంద్‌ కుమార్‌(46)అనేది పోలీసుల అనుమానం.

కోలా  అనుచరుడు బట్టవాటి రాజశేఖర్‌ అలియాస్‌ రాజ (27)ను సోమవారం అదుపులోకి తీసుకుని  క్రైం నెంబరు 139/2018గాఐపీసీ సెక్షన్లు 341, 323, 506 రెడ్‌విత్‌ 34 కింద కేసు నమోదు చేశారు.  4వ అదనపు మున్సిఫ్‌ న్యాయమూర్తి ఎదుట హాజరుపరచారు. ఆయన బెయిల్‌ మంజూరయింది.

అయితే, కోలా అరెస్టుకు కారణాలు ఏమిటి?

ఏప్రిల్  11వ తేదిన బీజేపీ  అధ్యక్షుడు అమిత్‌షా కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు వచ్చారు. శ్రీవారిని దర్శించుకుని ఆయన తిరుగు ప్రయాణమయ్యారు. ఆ సమయంలో నిరసన తెలిపేం దుకు టీడీపీ నేతలు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో అలిపిరి గేటు వద్దకు చేరుకున్నారు. ఈ ఘటనలో తన కారు అద్దం పగిలిందని  కోలా అనంద్ తెగ ఆగ్రహానికి  గురైయ్యారు. తన అనుచరుడితో కలసి  టీడీపీ కార్యకర్తలపై ఎదురు దాడి చేశారు. ఈ ఘటనలో ఇరువర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. దీని వల్లే  అప్పట్లోనే తెలుగుదేశం పార్టీకి అనుబంధమైన టీఎన్‌ ఎస్‌ఎఫ్‌ నాయకుడు సుబ్రమణ్యం యాదవ్‌ను అలిపిరి పోలీసులు అరెస్టు చేశారు. అయితే పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించి  దాడికి గురైన తమవారినే అరెస్టు చేశారని  తిరుపతి ఎమ్మెల్యే సుగుణ విమర్శించారు.  టీడీపీ వాళ్లు పెద్ద  ఎత్తున పోలీస్‌స్టేషన్‌ వద్ద నిరసన తెలపారు. అయితే, ఆ రోజే యాదవ్ కు బెయిల్‌ ఇచ్చారు.

సుబ్రమణ్యం యాదవ్‌పై దాడి చేశారని  తెలుగుదేశం పట్టణ అధ్యక్షుడు దంపూరి భాస్కర్‌యాదవ్‌ చేసిన ఫిర్యాదు మేరకు కోలా ఆనంద్‌, ఆయన అనుచరుడు రాజశేఖర్‌ను అలిపిరి పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. వారికి  కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *