ఆంధ్రాలో కరెంట్ కొరత, అందుకే కోత … : ప్రభుత్వ ప్రకటన

అమ‌రావ‌తి: ఆంధ్రప్రదేశ్ లో విపరీతమయిన పవర్ కట్ అమలుచేస్తున్నారు. విద్యుదుత్పాదన పడిపోవడంతో కోత వధించాల్సి వస్తున్నదని రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ఈ వివరణ ప్రకారం,రాష్ట్రంలో విద్యుత్ నాలుగు మిలియన్ యూనిట్ల కొరత ఏర్పడింది.
విద్యుత్ కొరత తీర్చేందుకు సింగరేణి కాలరీస్ నుంచి బొగ్గు సప్లయ్ పెంచాలని ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ను కోరారు. ఇపుడు సింగరేణినుంచి రోజుకు నాలుగు ర్యాకుల బోగ్గు సరఫరా అవుతూ ఉంది. దీనిని తొమ్మదికి పెంచాలని కోరినట్లు ప్రభుత్వం వెల్లడించింది.
ఆంధ్ర ప్రదేశ్ కు పవర్ మిగులు రాష్ట్రాలలో అగ్రభాగాన ఉంది. గత అయిదేళ్లలో రాష్ట్రం విద్యుత్ కోతలను ఎదుర్కోలేదు. చివరకు గ్రామీణ ప్రాంతాలలో కూడా పవర్ కట్ లేకుండా సాగింది. అయితే, ఇపుడు ఉన్నట్లుండి కరెంటూ పోతూ ఉంది. వర్షాకాలంలో కరెంటుకోతలేమిటా అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇపుడు  రాష్ట్రంలో విద్యుత్ కోత‌ల‌పై ప్రభుత్వం వివరణ ఇచ్చింది.  కరెంటు కోతకు పలు కారణాలు చూపింది. క్లుప్తంగా కారణాలివే:
– ఏపీ జెన్కో థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు కొరత తీవ్రమయింది.
57శాతానికి పైగా తగ్గిన సరఫరా
– మహానది బొగ్గు గనుల నుంచి పడిపోయిన సరఫరా
– బొగ్గు గ‌నిలో ప్రమాదం, సమ్మెలు, భారీ వర్షాలే దీనికి కారణం
– సింగరేణిలో కూడా వర్షాల కారణంగా తగ్గిన ఉత్పత్తి
– డొంకరాయి– దిగువ సీలేరులో ఆగస్టులో పవర్ కెనాల్ కు గండి
– పునరుద్ధరణ పనులకు భారీ వర్షాలతో ఆటంకం
– నవంబర్ 2018 నుంచి ఏప్రిల్ 2019 వరకూ ఇతర రాష్ట్రాల నుంచి అప్పుగా కరెంటు తీసుకున్న క‌రెంట్ ను తిరిగి తీరుస్తున్న రాష్ట్రం
– పూర్తిస్థాయి విద్యుత్ ఉత్పత్తి కోసం రంగంలోకి దిగిన ప్రభుత్వం
– సింగరేణి నుంచి ఉత్పత్తి పెంచాలంటూ తెలంగాణ సీఎంకు ఏపీ సీఎం వైయస్.జగన్ విజ్ఞప్తి
– కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖకూ ముఖ్యమంత్రి లేఖ
– కేంద్ర ప్రభుత్వంలో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్న ఏపీ భవన్ అధికారులు.