ప్రజల సమస్యలు పట్టని టివి ఛానల్స్ డిబేట్లు…

(వి శంకరయ్య)

పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల మీద అర్థ నగ్న తార శ్రీ రెడ్డి వాగే అవాకులు చెవాకులు జుగుప్స గొల్పేఅవతారం మీద, మరీ చెప్పాలంటే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి పై జరిగిన దాడిని అపహాస్యంగా కోడికత్తి కేసు పేరుతో – రాష్ట్రంలో తామర తంపరగా వెలసిన టివి ఛానల్స్ డిబేట్లు నిర్వహించాయి.

అయిదళ్ళు అధికార పార్టీ భజనలో తరించాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు కనుసన్నలలో మెలిగాయి. ప్రస్తుతం కూడా ఈ ఛానెల్స్ రాష్ట్ర ప్రజల నిత్య జీవిత సమస్యలకు ఏమాత్రం సంబంధం లేని అంశాలపై డిబేట్లు నిర్వహించుతున్నాయి.

ఈ రోజుకూ వీటికి చంద్రబాబు అపసవ్య కేంద్రీకృత విధానాలు కనిపించవు. ముఖ్యమంత్రి అనవసరంగా ప్రప్రథమంగా సియస్ పై చేసిన కామెంట్ నోరు జారడంగా వీటికి తట్ట లేదు. ఇవే కాదు. పాపులర్ మీడియా కూడా నోరు విప్ప లేక పోయింది. ప్రభు భక్తి అలాంటిది. బాస్ ఎప్పుడూ తప్పు చేయరనే వీరి భావన. పందిని చూచి పులి అంటే కామోసు అనే మీడియా వ్యవస్థ ఎపిలో నెలకొనింది.పోలింగ్ అయిపోయి దింపుడు కళ్లాం ఆశ మిగిలిన సమయంలో కూడా సమీక్ష సమావేశాలు నిర్వహించి ప్రజల దృష్టి లో ముఖ్యమంత్రి అపహాస్యం పాలౌతున్న అంశం వీటికి పట్టదు.ఇది వృథా ప్రయాస అని డిబేట్ పెట్టిన ఛానల్ ఒక్కటి లేదు. గాని కెసిఆర్ మోదీ వీరికి దొరికారు. బాస్ వీరిపై దూకుడు పెంచే కొద్ది ఈ ఛానెల్స్ డిబేట్లు నిర్వహించు తున్నాయి. . ఈ చర్చల్లో పాల్గొనే వారు అంతకు మించి చేయ గలిగిందేమీ లేదు.వారు విధించిన పరిధిలో వాదనలు చేసి వెళ్లుతున్నారు.

ఒకటి రెండు ఛానల్స్ తప్ప మిగిలిన ఏ ఛానెలూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ అయిదు ఏళ్ల కాలంలో అనుసరించిన అసంబధ్ధ అక్రమ విధానాలపై ఒక్క డీబేట్ నిర్వహించిన పాపాన పోలేదు. ఈ అయిదు ఏళ్లలో తెలుగుదేశం ప్రభుత్వం ఒక్క తప్పు చేయ లేదనేది వీరి భావన. చంద్రబాబు నాయుడును కీర్తించడంలోనే మునిగి తేలారు. సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న భూమి నుండి నిర్దాక్షిణ్యంగా తరమ గొట్ట బడిన లక్షలాది మంది చిన్న సన్న కారు రైతుల ఘోడు ఈ ఛానెల్లకు పట్ట లేదు. పరిహారం ఇవ్వకనే భూముల నుండి తరమ గొట్ట బడిన వారి గోడు వీరికి వినిపించ లేదు. దళితులపై జరిగిన దాడులు సోదిలోనికే రాలేదు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుసరించిన కేంద్రీకృత విధానాల ఫలితంగా సీమ ప్రాంతంలోనూ ఇంకా చెప్పాలంటే జన సేన అధినేత పవన్ కళ్యాణ్ అభిప్రాయ పడినట్లు ఉత్తరాంధ్రలో ప్రాంతీయ వాదం జీవం పోసు కొంటున్న అంశం ఒక సమస్య కాదు. ఇది జడలు విప్పితే రాష్ట్ర సమైక్యతకే పెను ప్రమాదం ముంచు కొస్తుందేమో-ఇవేవీ వీరికి పట్ట లేదు.

కేవలం తన పార్టీ గెలుపు కోసం నియమ నిబంధనలు గంగలో కలిపి ప్రభుత్వ నిధులు అడ్డ దిడ్డంగా వినియోగం- తన పార్టీ అభ్యర్థుల ఎన్నికల ఖర్చుకు కొత్త పథకాలు ప్రకటించి అక్రమ టెండర్లు పిలవడం-ఈ ఛానెల్స్ కు తప్పు కనిపించ లేదు. ప్రధాని మోదీ వ్యవస్థలను ధ్వంసం చేయడం మాత్రమే కనిపిస్తోంది. ఎందుకంటే ముఖ్యమంత్రి చెప్పారు కాబట్టి. రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా నిధుల విడుదల పరిపాలన వ్యవస్థను అస్తవ్యస్తం చేయడం వీటికి ఏ నాడైనా తప్పుగా కన్పించిందా? చంద్రబాబు నాయుడు గిట్టని వారు తుమ్మినా తప్పే. దగ్గినా తప్పే. నిలయ విద్వాంసులు చంద్రబాబు నాయుడుకు నొప్పి తగల కుండా గంటల కొద్దీ చర్చలు సాగిస్తారు. పాపం వారు చేయ గలిగిందేమీ లేదు. పరిధి దాటితే ఛానల్ గడప తొక్క నివ్వరు.

పోలింగ్ ముగిసిన తర్వాత తెలుగు దేశం ప్రభుత్వం బండారం ఒక్కొక్కటి బయట పడుతోంది. కాని తామర తంపరగా వున్న ఒక్క టివి ఛానల్ ఈ దుర్మార్గంపై ఒక్క డిబేట్ పెట్టిన పాపాన పోలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఏ మాత్రం నొప్పి తగలని విధంగా డిబేట్లు పెడుతున్నాయి..
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కు పోటీ కాళ్ళుగా వ్యవహరించే ఈ ఛానెల్ లకు ప్రధాని మోదీ భయం పట్టుకుంది. బిజెపి తో పాటు మోదీ అనుసరిస్తున్న మత దురహంకార ఫాసిస్ట్ వైఖరిని వ్యతిరేకించడం వేరు. మోదీతో చంద్రబాబు కు చెడిన తర్వాత బిజెపిని మోదీని ఈ ఛానల్స్ విమర్శించడంవేరు. ఈ రెండింటి మధ్య చాలా తేడా వుంది కాబట్టే ఇంత రాయాలసి వస్తోంది.

ప్రస్తుతం ఎపిలో ముఖ్యమంత్రి కి పోటీ కాళ్ళుగా వుండే టివి ఛానెల్స్ రాష్ట్రంలో కనీసం తాగునీరు పరిష్కరించ లేని ప్రభుత్వ అసమర్థతపై ఒక్క డిబేట్ పెట్ట లేదు. తాగు నీటి ఎద్దడి ఈ ప్రభుత్వం వారసత్వంగా ప్రజలకు మిగిల్చింది గాని ఇది ఒక్క రోజు ఆకాశం నుండి ఊడి పడలేదు. ఈ అంశాలు చర్చకు నోచు కుంటే తమ బాస్ పరువు బజారు పడుతుంది.కాబట్టి ప్రజల సమస్యల జోలికి ఈ ఛానెల్స్ వెళ్లడం లేదు.

ఇదంతా పరిశీలించితే బూర్జువా వ్యవస్థలో ప్రచార సాధనాలు వహించే పాత్ర మనకు కళ్లకు గట్టి నట్లు ద్యోతక మౌతుంది.కాని ఎపిలో మాత్రం ఇది మరింత వెర్రి తలలు వేస్తోంది. ఇతర రాష్ట్రాలకు భిన్నంగా నీకింత నాకింతగా దోపిడీ సాగిన వ్యవస్థ ఎపిలో వేళ్లూని కొన్నందున బాస్ ఎటు తిరిగితే అటు పొద్దు తిరుగుడు పూలు లాగా వ్యవహరం నడుస్తోంది.

(రచయిత సీనియర్ జర్నలిస్టు.పోన్ నెం. 9848394013. ఇందులో వ్యక్తం చూసిన అభిప్రాయాలు ఆయన వ్యక్తిగతం.)

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *