Home Telugu త్వరలో తెలంగాణాకు కొత్త సచివాలయం

త్వరలో తెలంగాణాకు కొత్త సచివాలయం

67
0
SHARE

-ప్రస్తుత ప్రాంగణంలోనే నిర్మాణం
-గవర్నర్ ఉత్తర్వులతో మార్గం సుగమం
-హైదరాబాద్ లో భవనాలను అప్పగించాలంటూ ఏపీకి లేఖ
-భవనాల అప్పగింత నిర్ణయంతో ₹ 14 కోట్ల మేరకు ఏపీ బకాయిలు మాఫ్

కొత్త సచివాలయ నిర్మాణానికి అడ్డంకులు తొలగిపోయాయి. దాదాపు 25 ఎకరాలు ఉన్న పాత ప్రాంగణంలోనే కొత్త సచివాలయం నిర్మించే దిశలో సీఎం ఓ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర విభజన చట్టం మేరకు ఆంధ్రప్రదేశ్ కు కేటాయించిన ప్రభుత్వ భవనాలను తెలంగాణాకు అప్పగిస్తూ గవర్నర్ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో కొత్త సచివాలయం నిర్మాణానికి మార్గం సుగమమయింది. ఇక వీలైనంత త్వరగా సచివాలయం భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన కూడా జరిగే అవకాశాలున్నాయి.

సచివాలయ సముదాయంతో సహా హైదరాబాద్ లో ఆంధ్రప్రదేశ్ కు గతంలో కేటాయించిన ప్రభుత్వ భవనాలను రాష్ట్రానికి అప్పగించే దిశలో నిర్ణయం జరిగింది. ఏపీ అంగీకారంతో గవర్నర్ నరసింహన్ వాటిని తెలంగాణకు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఆ భవనాలను తమకు అప్పగించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒక లేఖ రాయనుంది. అదే సమయంలో ఏపీ అవసరాల కోసం పోలీసుశాఖకు ఒకటి, మిగతా శాఖల నిర్వహణ కోసం మరొక భవనం కేటాయిస్తామని గవర్నర్ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఆమేరకు హైదరాబాద్ లో వాళ్ళకు ఏ భవనం కావాలో కూడా తెలియజేయాలని ఏపీని కోరనుంది. నేడో రేపో ఆ లేఖలను అధికారులు ఆంధ్రప్రదేశ్ కు పంపనున్నారు. భవనాల అప్పగింత నేపథ్యంలో ఏపీ చెల్లించాల్సిన విద్యుత్, మంచినీటి వినియోగం, ఆస్తిపన్ను తదితర బకాయిలన్నీ కలిపి దాదాపు ₹ 14 కోట్ల మేరకు రద్దు చేసినట్లు సమాచారం. ఇక హైదరాబాద్ లోని ప్రభుత్వ భవనాలను రెండు రాష్ట్రాలకు కేటాయిస్తూ రాష్ట్ర విభజన సమయంలో మొత్తం 30 ఉత్తర్వులు జారీ చేశారు. భవనాలను తెలంగాణకు అప్పగించడంతో, ఆ 30 ఉత్తర్వులను సవరించాల్సి ఉంది. ఈ ప్రక్రియంతా వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు రాష్ట్ర ఎస్సార్ విభాగం ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టింది. ఇక ఏపీకి కేటాయించిన భవనాలు తెలంగాణాకు అప్పగించడంతో, కొత్త సచివాలయం నిర్మాణ ఆలోచనలకు ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి పదును పెట్టారు. ఇదే అంశంపై ఆయన అధికారులతో చర్చలు కూడా జరిపారు.

ప్రస్తుతం ఉన్న సచివాలయం పాలనకు అంత అనువుగా లేదనే అభిప్రాయాలు ఉన్నాయి. సౌకర్యలేమి కొట్టొచ్చినట్లు కనిపిస్తుందనే వాదనలు ఉన్నాయి. అగ్ని ప్రమాదాలు, ఇతరత్రా ఏదేని ప్రమాదం అనుకోకుండా జరిగితే భారీ నష్టం సంభవించే అవకాశాలు లేకపోలేదు అని అగ్నిమాపక శాఖ ఇచ్చిన నివేదికలు కూడా ఉన్నాయి. ఇక ప్రస్తుత భవనాల్లో వీఐపీ భద్రత కూడా గాల్లో దీపం చందమే అన్న హెచ్చరికలు కూడా ఉన్నాయి. వీటన్నిటికీ తోడు అనేక వాస్తుదోషాలు కూడా ఉన్నాయనేది వాస్తు నిపుణుల అభిప్రాయం. అందుకే కొత్త సచివాలయ నిర్మాణానికి ఐదేళ్ల క్రితమే, అంటే గత ప్రభుత్వ మంత్రివర్గంలోనే నిర్ణయం తీసుకొన్నారు. నిర్మాణ ఖర్చుల కోసం ₹ 150 కోట్లు కూడా కేటాయించారు. అదే సమయంలో కొత్త సచివాలయ నిర్మాణం కోసం అనువుగా ఉండే వివిధ ప్రదేశాలను పరిశీలించారు. కేంద్ర రక్షణశాఖ ఆధీనంలో ఉన్న బైసన్ పోలో గ్రౌండ్ సచివాలయ నిర్మాణం కోసం బాగుంటుందని ఒక నిర్ణయానికి వచ్చిన సీఎం కేసీఆర్, ఆ స్థలాన్ని తమకు అప్పగించాలంటూ అప్పట్లోనే కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అప్పటి రక్షణశాఖ మంత్రితో పాటు ప్రధానమంత్రిని కూడా ముఖ్యమంత్రి స్వయంగా కలిసారు. ఆ స్థలాన్ని తమకు అప్పగించాలని విజ్ఞప్తి చేశారు. ఐతే బైసన్ పోలో గ్రౌండ్ అప్పగింతపై కేంద్రం నుంచి ఇంకా ఒక నిర్ణయం రాలేదు. పైగా ఆ గ్రౌండ్ అప్పగిస్తే, అందుకు బదులుగా ఎక్కువ విస్తీర్ణంలో భూమితో పాటు ₹ 97 కోట్లు పరిహారం చెల్లించాలని కేంద్ర రక్షణ శాఖ కోరింది. అందుకు సుముఖంగా లేని తెలంగాణా ప్రభుత్వం కొత్త సచివాలయ నిర్మాణానికి ప్రత్యామ్నాయ ఆలోచనను కూడా సిద్ధంగా ఉంచుకుంది. బైసన్ పై కేంద్రం ఒకవేళ సానుకూలంగా స్పందించకపోతే ప్రస్తుత సచివాలయ ప్రాంగణంలోనే కొత్త సచివాలయం నిర్మించాలని ప్రభుత్వం అప్పుడే నిర్ణయించింది. ఖాళీగా ఉన్న సచివాలయ భవనాలను తమకు అప్పగించాలని అప్పట్లోనే ఏపీని కోరింది. అందుకు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు విముఖత వ్యక్తం చేయడంతో కొత్త సచివాలయ నిర్మాణంలో కొంత జాప్యం జరిగింది. కానీ, తాజా పరిణామాల నేపథ్యంలో అందుకు మార్గం సుగమం అయ్యింది.

ఇక కొత్త సచివాలయం కోసం అప్పట్లోనే ముఖ్యమంత్రి కేసీఆర్ కొన్ని నమూనాలను తయారుచేయించారు. ఆ ప్రాంతం మొత్తాన్ని చదును చేయించి, నాలుగు మూలలా వాస్తు ప్రకారం సవరించి కొత్త నిర్మాణాలను చేపట్టేలా నక్షాలను సిద్దం చేయించారు. ఆర్కిటెక్ట్ గీసిన ప్లాన్ ప్రకారం “యూ” లేదా “ఎల్” ఆకారంలో సచివాలయ భవనాల సముదాయాన్ని నిర్మించాలని ప్రతిపాదించారు. విశాలమైన పార్కులు, పార్కింగ్ వసతి ఉండేలా ఆ నమూనాలను తయారు చేయించారు. ఇక పాత ప్రాంగణంలోనే కొత్త సచివాలయాన్ని నిర్మించాలని సీఎం తాజాగా నిర్ణయించినట్లు సమాచారం. ఆమేరకు ప్రస్తుతం పరిపాలనా కార్యకలాపాలు కొనసాగుతోన్న ఏ, బీ, సీ, డీ బ్లాకుల స్థానంలో కొత్త భవనాల సముదాయాన్ని నిర్మిస్తారని తెలుస్తోంది. అందుకు అనువుగా ప్రస్తుతం తెలంగాణా వైపు ఉన్న కార్యాలయాలను ఏపీ వైపున్న హెచ్, జే, కే, ఎల్ బ్లాకులకు తరలించే అవకాశాలున్నాయి. భవనాల నిర్మాణం పూర్తైన తరవాత, ఆ 4 బ్లాకులను సైతం తొలగించి, లేక్ వ్యూ ఉండేలా ఆ ప్రాంతంలో అందమైన లాన్, ఫౌంటైన్ లాంటి ఇతర అధునిక హంగులను అద్దనున్నారు.