చిక్కుల్లో తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ (వీడియో)

తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చిక్కుల్లో పడిపోయారు. ఆయన చిక్కుల్లో పడ్డారనేకంటే ఓవర్ యాక్షన్ చేసి ఇరకాటంలో పడ్డారంటే కరెక్ట్ అవుతుందని సచివాలయ వర్గాలు చెబుతున్నమాట. ఇంతకూ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎందుకు చిక్కుల్లో పడ్డారు? ఆయన చేసిన ఓవర్ యాక్షన్ ఏంటో చదవండి… వీడియో చూడండి.

తెలంగాణ సచివాలయంలో సిఎం కేసిఆర్ కాలు పెట్టక నెలలు గడుస్తోంది. వాస్తు కారణమో… ఇంకే కారణమో కానీ కేసిఆర్ సచివాలయం వైపు కన్నెత్తి కూడా చూడడంలేదు. ప్రగతిభవన్ వేదికగా కేసిఆర్ పాలన సాగిస్తున్నారు.

ఈ పరిస్థితుల్లో సచివాలయంలో ఇటు మంత్రులు, అటు అధికారులు ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్లుగా తయారైంది. తాజాగా తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సచివాలయంలో ప్రొటోకాల్ వ్యవస్థను బ్రేక్ చేశారు. సచివాలయంలోని సి బ్లాక్ భవనం ముఖ్యమంత్రి కార్యాలయం కోసం కేటాయించినది. ఆ భవనం ముందు వరకు అంటే బారీకేడ్స్ దాటి లోపలికి కేవలం సిఎం వాహనాలు, ఉపముఖ్యమంత్రుల వాహనాలు, సిఎస్, డిజిపి వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుంది. మిగతా మంత్రులు, పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, అధికారులంతా బారీకేడ్స్ అవతల కారు దిగి లోపలికి నడుచుకుంటూ రావాల్సి ఉంటుంది. ఇది సాంప్రదాయంగా వస్తున్న ప్రొటోకాల్. కానీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వాహానం బుధవారం ప్రోటోకాల్ విస్మరించి ఏకంగా సి బ్లాక్ పోర్టికో ముందుకు ప్రవేశించించింది. ఆ సమయంలో కారులో మంత్రి కూడా ఉన్నారు. అనుమతి లేని ప్రదేశంలోకి సొంత వాహనంతో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రవేశించడం సచివాలయంలో చర్చనీయాంశమైంది. పోర్టికో ముందు (సిఎం కాన్వాయ్ లోని సిఎం ప్రయాణించే వాహనం నిలిచే చోట శ్రీనివాస్ గౌడ్ వాహనం ఆపి సి బ్లాక్ లోకి వెళ్లిపోయారు.

భద్రతా సిబ్బందిలో టెన్షన్…

సచివాలయానికి రౌండ్ ది క్లాక్ భద్రత ఉంటుందనే విషయం మనందరికీ తెలుసు. అలాంటిది సచివాలయంలోని ముఖ్యమంత్రి కార్యాలయమైన సి బ్లాక్ కు మరింత కఠినమైన భద్రత 24గంటలపాటూ ఉంటుంది. చీమ చిటుక్కుమన్నా వారు అలర్ట్ గా ఉంటారు. అలాంటిది ప్రొటోకాల్ పాటించకుండా ఒక మంత్రి కారు సి బ్లాక్ ముందుకు ఎంటర్ అయిన సందర్భంలో భద్రతా సిబ్బంది నిలువరించలేకపోయారు. వారు ఎంతగా చెబుతున్నా… మంత్రి పిఎస్ ల ఒత్తిడితోనే గేట్లు ఓపెన్ చేయాల్సి వచ్చిందని చెబుతున్నారు. కరవమంటే కప్పకు కోపం… వదలమంటే పాముకు కోపం అన్నట్లు తయారైంది వారి పరిస్థితి. కారులో మంత్రి… పిఎస్ భయపెట్టే చూపులతో భద్రతా సిబ్బంది గేట్లు తీయనైతే తీశారు కానీ ఇప్పుడు వారికి భయం పట్టుకుంది. విధుల నిర్వహలో విఫలమైనందుకు ఎక్కడ తమ ఉద్యోగాలు పోతాయోనని భయంతో వనికిపోతున్నారు.

అయితే ఈ వివాదంపై మంత్రి సిబ్బంది స్పందించారు. గేట్లు కుల్లా తీసి ఉన్నందుకే తాము సి బ్లాక్ పోర్టికో వరకు ఎంటర్ అయ్యామని చెబుతున్నారు. మొత్తానికి  సచివాలయంలో ప్రొటోకాల్ అంశం వివాదంగా మారే పరిస్థితులు కనబడుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఎస్సీ సామాజికవర్గానికి చెందిన ఉపముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య బర్తరఫ్ అయిన విషయం తెలిసిందే. ఆయన బర్తరఫ్ కు కారణాలేంటో ఇప్పటి వరకు తెలియరాలేదు. అయితే అంతటిస్థాయిలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా చిక్కుల్లో పడ్డారని సచివాలయ ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించడం గమనార్హం.

మంత్రి సచివాలయం సి బ్లాక్ వద్ద కారు ఆపి లోపలికి వెళ్తున్న వీడియో కింద ఉంది చూడొచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *