Home Telugu మళ్లీ ఫెడరల్ ఫ్రంట్ కదలికలు… కేరళకు కేసిఆర్

మళ్లీ ఫెడరల్ ఫ్రంట్ కదలికలు… కేరళకు కేసిఆర్

117
0
SHARE
తెలంగాణ సిఎం కేసిఆర్ జాతీయ రాజకీయాలపై సీరియస్ గా దృష్టి సారించబోతున్నారు. తెలంగాణలో పార్లమెంటు ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో కేసిఆర్ మళ్లీ ఫెడరల్ ఫ్రంట్ ఆయుధాన్ని బయటకు తీసే పరిస్థితులు కనబడుతున్నాయి. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటాయని, కేంద్రంలో టిఆర్ఎస్ కీలక స్థానంలో ఉంటుందని టిఆర్ఎస్ శ్రేణులు ప్రచారం చేస్తున్నాయి. అన్నీ అనుకూలిస్తే కేసిఆర్ ప్రధాని పదవిని చేపట్టే చాన్స్ కూడా ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ఫలితాలు వచ్చే నాటికి పలు రాష్ట్రాల్లో కేసిఆర్ పర్యటనకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దానిలోభాగంగానే సోమవారం సాయంత్రం కేసిఆర్ కేరళ వెళ్లనున్నారు.
సోమవారం మధ్యాహ్నమే కేసిఆర్ కేరళ రాష్ట్రానికి చేరుకుంటారు. సోమవారం సాయంత్రం త్రివేండ్రంలో కేరళ సిఎం పినరయి విజయన్ తో ప్రత్యేకంగా సమావేశమవుతారు. తాజా రాజకీయ పరిణామాలపై ఇరువురు సిఎంలు చర్చించుకుంటారు. పార్లమెంటు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో దేశ రాజకీయాల గురించి మాట్లాడుకుంటారు. కేసిఆర్ కేరళ పర్యటనలో భాగంగా రామేశ్వరం, శ్రీరంగం దేవాలయాలను కూడా సందర్శిస్తారు. కేరళ టూర్ ఎన్నిరోజులనేది ఇంకా అధికారికంగా వెల్లడి కాలేదు. నాలుగైదు రోజులపాటు కేరళలోనే కేసిఆర్ స్టే చేసే అవకాశాలున్నట్లు పార్టీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. పనిలో పనిగా కుటుంబసభ్యులతో కేరళ వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఇటు అధికారిక కార్యక్రమాలు, అటు కుటుంబసమేతంగా పర్యటన రెండూ ఏకకాలంలో చేపట్టే అవకాశాలున్నట్లు పార్టీ నేతల్లో టాక్ వినబడుతోంది.
దేశంలో గుణాత్మక మార్పు కోసం ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తున్నట్లు ఇప్పటికే కేసిఆర్ ప్రకటించారు. ఇందుకోసం గతంలో పలు రాష్ట్రాల్లో కేసిఆర్ పర్యటించారు. పశ్చిమబెంగాల్ కు రెండుసార్లు వెళ్లి ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో భేటీ అయ్యారు. అలాగే ఒడిష్షా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, కర్ణాటక సిఎం కుమారస్వామి, వాళ్ల తండ్రి మాజీ ప్రధాని దేవేగౌడ్ ను సయితం కలుసుకున్నారు. ఇప్పుడు సిపిఎం ముఖ్యమంత్రి అయిన కేరళ సిఎం పినరయి విజయన్ ను కలవడం చర్చనీయాంశమైంది. రేపటి జాతీయ రాజకీయాల్లో కాంగ్రేసేతర, బిజేపియేతర పార్టీలను ఒకేతాటిపైకి తెచ్చి కేంద్రంలో అధికారంలోకి రావాలన్న ఆకాంక్షను గులాబీ బాస్ వ్యక్తపరుస్తున్నారు. అందుకోసమే మళ్లీ జాతీయ రాజకీయాలపై కేసిఆర్ దృష్టి నిలిపారు. కేరళ తర్వాత మరిన్ని రాష్ట్రాల్లో కేసిఆర్ పర్యటించే అవకాశాలున్నాయి.
రాష్ట్రంలో అట్టుడుకుతున్న ఇంటర్ వివాదం…
మరోవైపు రాష్ట్రంలో ఇంటర్ ఫలితాల వెల్లడిలో నెలకొన్న వివాదం రోజురోజుకూ తీవ్రస్థాయికి చేరుతోంది. అన్ని రాజకీయ పార్టీలు ఆందోళనలతో సర్కారును ఉక్కిరిబిక్కిరి చేసే ప్రయత్నం చేస్తున్నాయి. విద్యార్థి సంఘాలు ముట్టడులు, ధర్నాలతో వత్తిడి పెంచుతున్నాయి. ప్రతిపక్షాలన్నీ కలిసి హైదరాబాద్ లో మహా దీక్షకు పిలుపునిచ్చాయి. ఇప్పటికే 20 మందికి పైగా ఇంటర్ విద్యార్థులు మరణించారు. ఈ వివాదంపై తెలంగాణ సర్కారు ఆశించిన రీతిలో స్పందించలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇంటర్ వివాదం సద్దుమణగరముందే సిఎం కేసిఆర్ జాతీయ పర్యటనకు ఉపక్రమించడం రాజకీయ పక్షాల్లో చర్చనీయాంశమైంది.