Home News టీడీపీకి డ‌బుల్ షాక్ః ఒకేరోజు..ఒకే ప్రాంతం.. రెండు ఘోర ఓట‌ములు!

టీడీపీకి డ‌బుల్ షాక్ః ఒకేరోజు..ఒకే ప్రాంతం.. రెండు ఘోర ఓట‌ములు!

172
0
SHARE

అమ‌రావ‌తిః అన్ని రాజ‌కీయ పార్టీలు ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తీసుకున్న ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీకి డ‌బుల్ షాక్ త‌గిలింది. ఇప్ప‌టికే భారీగా వ‌ల‌స‌ల‌తో డీలా ప‌డిన తెలుగుదేశం పార్టీకి తాజాగా మంగ‌ళ‌వారం వెలువ‌డిన ఫ‌లితాలు ఏ మాత్రం మింగుడు ప‌డేవి కాదు. వ‌చ్చే ఎన్నిక‌ల ఫ‌లితాలు ఎలా ఉండ‌బోతున్నాయ‌న‌డానికి నిద‌ర్శ‌నంగా దీన్ని తీసుకోవ‌చ్చు. ఆ పార్టీకి శుభ‌సూచ‌కం కావు. ఎన్నిక‌ల ముంగిట్లో టీడీపీకి ఎదురొచ్చిన దుశ్శ‌కునాలుగా భావించ‌వ‌చ్చు.

ఒక‌టి- ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో దారుణ ప‌రాజ‌యం. గెలుపోట‌ముల మ‌ధ్య భారీ ఆంత‌ర్యం. కొద్దో, గొప్పో కాదు.. ఏకంగా రెండు వేలకు పైగా ఓట్ల తేడాతో ఘోర ఓట‌మి. అదీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో చోటు చేసుకోవ‌డాన్ని టీడీపీ జీర్ణించుకోలేక‌పోతోంది. ఉత్తరాంధ్రలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బ‌ల‌ప‌రిచిన‌ గాదె శ్రీనివాస రావు ఘోరంగా పరాజయం పాలయ్యారు. గతంలో రెండు సార్లు ఎమ్మెల్సీగా గెలిచిన ఆయ‌న ఈ సారి క‌నీస పోటీ కూడా ఇవ్వ‌లేక‌పోయారు. త‌న స‌మీప ప్ర‌త్య‌ర్థి పాకలపాటి రఘువర్మ చేతిలో మ‌ట్టి క‌రిచారు. మొత్తం ఓట్లలో రఘు వర్మకు 7834 మొదటి ప్రాధాన్యత ఓట్లు రాగా.. గాదె శ్రీనివాస రావుకు 5632 మొదటి ప్రాధాన్యత ఓట్లు వచ్చాయి. మరో అభ్యర్థి అడారి కిషోర్‌ కుమార్‌కు 2548 ఓట్లు పడ్డాయి.

ఎవరికీ కోటా ఓట్లు రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించాల్సి వచ్చింది. రెండో ప్రాధాన్యత ఓట్లలో రఘు వర్మకు ఎక్కువ రావడంతో ఆయన విజయం సాధించిన‌ట్లు రిటర్నింగ్ అధికారి ప్ర‌క‌టించారు. ఓట్ల లెక్కింపులో భాగంగా ఆరు రౌండ్లలోను మెజారిటీ సాధించ‌డం విశేషం. టీడీపీ పట్ల ప్రజల్లో పెరిగిన వ్యతిరేకతతోనే ఎమ్మెల్సీగా గాదె శ్రీనివాస రావు ఓటమి పాలయ్యారని పరిశీలకులు భావిస్తున్నారు.

రెండోది- విజ‌య‌న‌గ‌రం జిల్లా కురుపాం అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి టీడీపీ త‌ర‌ఫున బ‌రిలో నిలిచిన జ‌నార్థ‌న్ థాట్రాజ్ నామినేష‌న్ తిర‌స్క‌ర‌ణ‌కు గురి కావ‌డం. థాట్రాజ్ దాఖ‌లు చేసిన నామినేషన్ ప‌త్రాల‌ను తిరస్కరించారు ఎన్నికల రిటర్నింగ్ అధికారి. నామినేషన్ లో భాగంగా ఎన్నికల అఫిడివిట్ లో దాఖలు చేసిన కుల ధృవీక‌ర‌ణ‌ పత్రం పై బీజేపీ అభ్యర్థి నిమ్మక జయరాజు అభ్యంతరం వ్యక్తం చేయ‌డంతో అస‌లు విష‌యం వెలుగులోకి వ‌చ్చింది.

జనార్థన్ థాట్రాజ్ ఎస్టీ కాదని 2012లో ఏపీ హైకోర్టు తీర్పునిచ్చిందని నిమ్మక జయరాజు ఆధారాలతో స‌హా నిరూపించారు. అలాగే 2014లో కూడా సుప్రీంకోర్టు జనార్థన్ థాట్రాజ్ ఎస్టీ కాదని స్పష్టం చేసిన పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందజేశారు నిమ్మక జయరాజు. అవ‌న్నీ దాచి పెట్టిన థాట్రాజ్‌.. తాను ఎస్టీ అని ధృవీక‌రిస్తూ కుల ధృవీక‌ర‌ణ ప‌త్రాన్ని నామినేష‌న్ తో జ‌త చేశారు. నిమ్మ‌క జ‌య‌రాజ్ డిమాండ్ మేర‌కు థాట్రాజ్ కుల ధృవీకరణ పత్రాన్ని పరిశీలించిన రిటర్నింగ్ అధికారి తప్పులు ఉన్నట్లు గుర్తించారు. త‌ప్పుడు స‌మాచారం ఇచ్చినందున ఆయ‌న నామినేషన్ ను తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు. జనార్థన్ థాట్రాజ్ నామినేషన్ తిరస్కరణకు గురవ్వడంతో ఆయన తల్లి నర్సింహా ప్రియా థాట్రాజ్ బరిలో ఉన్నారు.