జగన్ మౌనం, రెచ్చిపోయిన టిడిపి ఉమ

గత వారం రోజులుగా జగన్ మౌనంగా ఉండటం, లగడపాటి ఎగ్టిట్ పోల్స్ టిడిపి ప్రభుత్వం ఏర్పాటుచేస్తుందని చెప్పడంతో తెలుగుదేశంలో ఉత్సాహం ఉరకలు వేస్తున్నది. ముఖ్యమంత్రి వేయి శాతం టిడిపి అధికారంలోకి వస్తున్నదని చెప్పారు.ఇక రాష్ట్ర మంతి దేవినేని ఉమామహేశ్వరరావు ఇంకా రెచ్చిపోయిన జగన్ మీద దాడి తీవ్రం చేశారు. జగన్ మౌనంగా ఉండటాన్ని ఆయన ఓటమి ఒప్పుకోవడానికి సంకేతమన్నట్లు మాట్లాడారు.

పార్టీ అభ్యర్థులతో కూర్చుని సమావేశం కూడా నిర్వహించలేక జగన్  లోటస్ పాండ్ కే పరిమితం అయ్యాడని వ్యాఖ్యానించారు. ఈరోజు అమరావతిలోవిలేకరులతో మాట్లాడుతూ ఇలా వ్యాఖ్యానించారు.  ఇప్పుడు లోటస్ పాండ్ ను కుడా కేసిఆర్ ఖాళీ చేయించి జగన్ని బయటకు పంపుతారని అంటూ  కార్యకర్తలును బెట్టింగ్ బారిన పడేసి గొప్పలు చెప్పుకుంటూ ‘శునకానందాన్ని’ పొందుతున్నాడని అన్నారు.

‘ ఆంధ్ర ఫలితాల తీరు పసిగట్టే, పార్టీ అధ్యక్ష హోదాలో కనీసం మాట్లాడలేని దుస్థితి లో జగన్ ఉన్నాడు,‘ అన్నారు.

వైసిపికి ప్రజలు వోటేయరని చెబుతూ, ‘‘పోలవరం అడ్డుకునేందుకా, అవినీతి కి పాల్పడినందుకా, అమరావతి అభివృద్ధిని అడ్డుకున్నందుకా, ఏం చూసి నీకు ఓటేస్తారు.అనేక కుట్రలు చేసిన ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు ఎక్కడకు పారిపోయాడు.దమ్ముంటే నువ్వు, డర్టీ రెడ్డి, ప్రశాంత్ కిషోర్ లు జనంలోకి రండి. ఎపి ప్రభుత్వం తన పని తీరు ద్వారా ఎన్నో కేంద్ర అవార్డులు సాధించాం.దేశంలో ఎవరైనా ఇన్ని సాధించారా.. నిరూపించు.’ అని ఆయన జగన్ కు సవాల్ విసిరారు.

చంద్రబాబు చెప్పినట్లు వందకు వేయి శాతం టిడిపి దే విజయమని, మహిళలు, వృద్దులు‌ చంద్రబాబు అమలు చేసిన పధకాలకే పట్టం కట్టారని మేము బయటకి వచ్చి ధైర్యంగా చెబుతున్నామని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో 18 ఎంపి సీట్లు టిడిపి సాధించడం ఖాయమని చెప్పారు.

ఆయన ఇంకా ఏమన్నారంటే…

‘‘మోడి నియంతృత్వ పాలనను పారద్రోలేందుకు వ్యతిరేక శక్తులను చంద్రబాబు ఏకం చేశారు. ఈవిఎం లు పని తీరు, వివి ప్యాట్ ల లెక్కింపు పై చంద్రబాబు పోరాటం చేస్తున్నారు. జగన్ మాత్రం లోటస్ పాండ్ లో కూర్చుని.. లెక్కలు వేసుకుంటున్నాడు. ఆరా సంస్థ తో సర్వే చేయించి సిఎం అయిపోయినట్లు ఊహించుకుని ఏర్పాటు చేసుకుంటున్నాడు.చిత్తశుద్ధి లేని శివ పూజలు ఎన్ని చేసినా ఫలితం ఉండదనే సూత్రం ఇప్పటికైనా జగన్ తెలుసుకోవాలి.చంద్రబాబు వల్లే అభివృద్ధి సాధ్యమని మహిళలంతా భావించి అర్ధరాత్రి వరకు నిలబడి ఓట్లు వేశారు.చంద్రబాబు మళ్లీ సిఎం కావాలని గ్రామాలు, పట్టణాలలో ప్రజలు పూజలు చేస్తున్నారు.2014లో కూడా అరాచక శక్తులు రాకూడదని ప్రజలు చంద్రబాబు ను గెలిపించారు. అప్పుడు కూడా జగన్ సిఎం గా ప్రమాణ స్వీకారానికి సిద్దమై భంగపడ్డాడు. ఈసారి కూడా ముహూర్తాలు పెట్టుకున్న జగన్ ఇంటికే పరిమితం అవడం ఖాయం. 16నెలలు జైలులో ఉన్న జగన్, విజయసాయి రెడ్డి లు కూడా అవినీతి గురించి మాట్లాడేస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ తో వాళ్లు సంబరాలు చేసుకుంటే.. ఎగ్జాక్ట్  పోల్స్ వచ్చాక మేం పండుగ చేసుకుంటాం..’’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *