(అభిప్రాయం) శివరామకృష్ణన్ సిఫార్సులే కొత్త రాజధానికి దిక్సూచి

(విజయభాస్కర్)
మన రాయలసీమలో పుట్టిన ప్రతి వ్యక్తి రాజధాని మనకు అనుకూలంగా ఉండాలనుకోవడం సహజం, అలాగే ఎక్కడో దూరంగా ఉన్న ఉత్తరాంధ్ర జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం వాళ్ళు కూడా వాళ్లకు అనుకూలంగా ఉండాలి అనుకోడం సహజం.
వీటన్నిటిని దృష్టిలో ఉంచుకుని శివరామకృష్ణన్ కమిటీ, మధ్యే మార్గంగా రాజకీయాలకతీతంగా కొన్ని ప్రాంతాలను సూచిస్తే, ఆ కమిటీ రిపోర్టును తుంగలో తొక్కి, ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు మెజారిగా ఉన్న ఊళ్లన్నీ కలిసేటట్లుగా, అయినవాళ్ళ రియల్ ఎస్టేటే ముఖ్య అజెండాగా అమరావతి రాజధానిని సృష్టించారు.
కడుపుకన్నం తినే ప్రతి వాడికీ తెల్సు ఆ ప్రాంతంలో అడుగు పెడితే మోకాలి లోతు దిగబడుతుందనీ.
కృష్ణా నది, కొండవీటి వాగుల వరద ముప్పు ఉందని తెలిసీ, ప్రకృతిసిద్ధంగా ఏర్పడ్డ వాగు ప్రవాహాన్నే మార్చాలనే విధంగా ప్రణాళిక ఏర్పాటు చేసుకుని, అత్యంత విలువైన ముక్కార్లు పండే భూమిలో ఒక భ్రమరావతిని సృస్థించి, గ్రాఫిక్కుల జిమ్మిక్కులతో, అక్కడి భూములకు విపరీతంగా రేట్లు పెంచేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకున్నారు తప్పితే, మనకంటూ ఒక మంచి పరిపాలనా కేంద్రం ఉండాలి అని ఏనాడు చిత్తశుద్దిగా ఆలోచించలేదు.
రాజధాని అంటే రియల్ ఎస్టేట్కు అడ్డాగా ఉండాలి అనుకోవడం దుర్మార్గం, అలాగే తాపీ చేత పట్టిన ప్రతి కార్మికుడి అడుగులు, పట్టా పుచ్చుకున్న ప్రతి విద్యార్థి చూపు ఆవైపే అనుకోవడం శుద్ధ అవివేకం.
తల వాళ్ళు తీసుకుని, ఆదాయంలేని మొండెం మాకిచ్చారు అని రోజూ ఇప్పటికీ అంగలారుస్తున్నారు. మరి మంచం ఉన్నంతనే కాళ్ళు చాపుకోవాలి అని పెద్దలు చెప్పిన నీతులు, మింగ మెతుకు లేదూ, మీసాలకు సంపెంగ నూనె కావాలన్నాట్ట అన్న వ్యంగ్యోక్తి, తెలియవా?.
అసెంబ్లీ భవనాలు, సచివాలయ భవనాలు, వాటికి అనుబంధంగా అవసరమైన ముఖ్య కార్యాలయాలు, అవసరమున్న మేర గృహ సముదాయాలు నిర్మించి, హైకోర్ట్ తో సహా ఇతర ముఖ్య కార్యాలయాలను రాష్ట్ర వ్యాప్తంగా మిగతా ప్రాంతాల్లో నిర్మించి రాష్ట్రాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయొచ్చు.
అంతేకానీ బాహుబలి సెట్టింగులను తలదన్నే విధంగా, కోటానుకోట్ల ధనాన్ని వెచ్చించి, విద్య, వైద్య, ఆర్థిక వ్యాపార, రియల్ ఎస్టేట్, పర్యాటకమ్ ఇలా అన్ని రంగాలను అక్కడే అభివృద్ధి చేయాలనుకోవడం ఏమిటి?
రాష్ట్ర జనాభా అంతటికి వలసలు ప్రోత్సహించి, అక్కడికే రప్పించి, ఒక కుక్కిన పేనులాగా తయారు చేసి, ఆ తర్వాత నీళ్లు చాలక, కరెంట్ చాలక, ఆస్పత్రిలో బెడ్లు చాలక, రోడ్ల మీద నడవడానికి కూడా చోటు లేకుండా చేసి, ఆఖరికి పీల్చే గాలిని కల్మషం చేసి, గాలికి కూడా కొరతను సృష్టించి, సామాన్య మానవుడు ఈ నరకం నుండి ఎప్పుడు బైట పడదామా అని వాపోయే పరిస్థితి సృష్టించాల్సిన పని లేదు.
అమరావతి నిర్మాణం పూర్తయితే, రాష్ట్రానికి స్వర్ణయుగం వచ్చినట్లే అని కొందరు కుహనా మేధావులు అఘోరించారు, ఎలా?
రాజధానిలో మాత్రమే అన్ని హంగులుంటే సరిపోతుందా?
మిగతా ప్రాంతాల అభివృద్ధి అక్కరలేదా? అన్ని అక్కడే నిర్మించి హైదరాబాదులో చేసిన తప్పునే మళ్ళీ చేయాలా?
తలలేని మొండెం, లోటు బడ్జెట్ గురించి మాట్లాడేవాళ్లకు తమిళనాడుకు చెందిన ప్రయివేట్ విద్యాసంస్థలకు అమరావతిలో భూములు కట్టబెట్టాల్సిన పని ఏంటి?
మన దేశంలో బిట్స్ పిలాని లాంటి ఎన్నో ఉదాహరణలు అభివృద్ధి వికేంద్రీకరణకు ప్రతీకలుగా నిలుస్తాయి, అదొక పెద్ద పట్టణం కాదు, ఎయిర్ పోర్ట్ లేదు, రైల్వే లైను లేదు, మానవ వనరుల లేమి, సౌకర్యాల లేమి లాంటి కుంటి సాకులు పిలాని గ్రామానికి అడ్డు రాలేదే?
ప్రపంచ పటంలో ఈ గ్రామంకు ఒక మంచి స్థానం దక్కలేదా?
సంవత్సరానికి 500 కోట్లు ప్రజల సొమ్మును, రాజధాని ఆకృతుల పేరిట విలాసవంతమైన విదేశీ పర్యటనలకు అర్పించి, ఆఖరికి వరదల్లో ముంచారు.
రాయలసీమ అన్ని రంగాల వెనుకబడి ఉన్న సంగతి ప్రతి సామాన్య వ్యక్తికి తెలుసు కానీ ఈ రాజకీయనాయకులకు మాత్రం తమ కులరాజకీయాలు, కుట్ర రాజకీయాలు, తమ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు తప్పితే తమ ప్రాంతం బాగుపడాలి అన్న ఆలోచన ఎంత మాత్రం ఉండదు.